ఎల్‌ఆర్‌ఎస్‌తో నిధుల వరద! 

Date:19/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఆర్థికంగానే కాదు.. అధికారాల్లోనూ గ్రామ పంచాయతీలకు పెద్దపీట దక్కింది. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ, కొత్త రెవెన్యూచట్టంతో గ్రామ పంచాయతీలు ఆర్థిక సమృద్ధి సాధించే దిశగా అడుగుపడింది. ఇప్పటివరకు కేవలం 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడిన పంచాయతీలకు ఇకపై మరిన్ని ఆర్థిక వనరులు సమకూరనున్నాయి. సొంత వనరులకు అవకాశంతో పాటు కొత్త అధికారాలు కూడా సంక్రమించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి చేస్తూ కొత్త చట్టంలో పొందుపరచడంతో పాత బకాయిలు వసూలు కానున్నాయి. ఇంటి, నల్లా పన్ను, విద్యుత్‌ చార్జీలకు సంబంధించి బకాయి లేనట్లు స్థానిక పంచాయతీ జారీ చేసిన ధ్రువపత్రం/రసీదును రిజిస్ట్రేషన్‌ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.అంతేగాకుండా రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే మ్యుటేషన్‌ ప్రక్రియను కూడా సబ్‌ రిజిస్ట్రార్లే పూర్తి చేయనున్నారు. తద్వారా ఆయా పంచాయతీల్లో ఉన్న మార్కె ట్‌ విలువకు అనుగుణంగా 1 నుంచి 5 శాతం వరకు రుసుము వసూలు చేయనున్నారు. ఇన్నాళ్లు స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ పూర్తయినా.. గ్రామ పంచాయతీలకు సమాచారం ఉండేది కాదు.

 

మ్యుటేషన్‌ కోసం దస్తావేజు సమర్పిస్తేనే పంచాయతీలకు తెలిసేది. ఇకపై దీనికి ఫుల్‌స్టాప్‌ పడనుంది. ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ జరిగిన మరుక్షణమే ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా మ్యుటేషన్, పంచాయతీ ఖాతాలో ఆదాయం జమకానుంది. కొత్త నిబంధన ప్రకారం రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు, బహుమతి, వారసత్వం లేదా ఇతర చట్టం ద్వారా బదిలీ అయిన వ్యవసాయేతర రికార్డులు ధరణి పోర్టల్‌ ద్వారా ఈ– పంచాయతీ పోర్టల్‌కు అనుసంధానం కానున్నాయి. తద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై సమాచారం ఎప్పటికప్పుడు పంచాయతీలు తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. స్థలాల క్రమబద్ధీకరణతో గ్రామ పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టం కానున్నాయి. లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)ను ఇన్నాళ్లూ కేవలం నగర, పురపాలక సంస్థలు, పట్టణాభి వృద్ధి సంస్థల పరిధిలోనే అమలు చేసిన ప్రభుత్వం.. పంచాయతీరాజ్‌ చట్టం– 2018 ప్రకారం పల్లెల్లోనూ అమలు చేయా లని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. పంచాయతీల పరిధిలోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణతో వచ్చిన ఆదాయాన్ని స్థానిక పంచాయతీలకే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నగరాలు, పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాలకు దండిగా ఆదాయం రానుంది.

 

కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో స్థిరాస్తి రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో అనధికార లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ లేకపోతే రిజిస్ట్రేషన్‌ చేసేదిలేదని ప్రభుత్వం మెలిక పెట్టడంతో ప్లాటు ఉన్న ప్రతి వ్యక్తి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. దీంతో పంచాయతీలకు భారీగా ఆదాయం సమకూరనుంది.   ఇప్పటివరకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్లు జారీ చేసేవారు. ఇటీవల శాసనసభలో ఆమోదం పొందిన నూతన రెవెన్యూచట్టంలో తహసీల్దార్ల నుంచి ఈ అధికారాలను తొలగించిన ప్రభుత్వం.. వీటిని స్థానిక సంస్థలకు కట్టబెడుతున్నట్లు ప్రకటించింది. ఇందులోభాగంగా ఇకపై కుల ధ్రువపత్రాలను పంచాయతీలే ఇవ్వనున్నాయి. అలాగే సమగ్ర కుటుంబసర్వే, ఇతర మార్గాల ద్వారా సేకరించిన వివరాలకు అనుగుణంగా ఆదాయ ధ్రువపత్రాలను కూడా అక్కడికక్కడే జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

 

టీడీపీతో పొత్తుకు తెలంగాణ బీజేపీ నేతలు..

Tags:Flood of funds with LRS!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *