ప్రాజెక్టులకు భారీగా చేరుతున్న వరద నీరు

 Date:11/08/2018
విజయవాడ ముచ్చట్లు:
తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుండటంతో ఆదివారం  ఉదయం ప్రాజెక్టు 5 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద భారీగా పెరిగింది. ఖమ్మంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద పెరగడంతో ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన చెరువులైన మున్నేరు, కట్లేరు, వైరా తదితర వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది.ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 14,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. శనివారం రాత్రికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో 11 అడుగుల మేర నీటిమట్టం ఉందని, శనివారం రాత్రికి పూర్తి స్థాయి నీటిమట్టం అయిన 12 అడుగులకు చేరుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణాలోని మధిర తదితర ప్రాంతాల్లో రాత్రి 180 మిల్లీ మీటర్ల మేర వర్షం కురియడంతో మున్నేరు, వైరా నదులతో పాటు కట్లేరు వాగుల్లో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. ప్రస్తుతం 14 వేల500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింత పెరిగి 20 వేల క్యూసెక్కుల వరకూ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 14 పంపులను నిలిపేశారు. దీంతో పోలవరం కుడికాలువ ప్రవాహం 4 వేల క్యూసెక్కులకు తగ్గింది. కృష్ణాలో వరద ప్రవాహాన్ని అనుసరించి పట్టిసీమ ప్రాజెక్టులోని మిగతా పంపులను కూడా నిలిపివేస్తామని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ఉన్న తూర్పు, పశ్చిమ కాలువలైన ఏలూరు, బందరు, రైవస్ కాలువలతో పాటు గుంటూరు ఛానల్‌కు 11 వేల క్యూసెక్కుల నీటిని (పూర్తి సామర్థ్యం) విడుదల చేస్తున్నారు.
Tags:Flood water that gets heavily for projects

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *