కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా డెల్టాలో ఏర్పడిన సాగునీటి సంక్షోభం రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. గత నెల రోజులుగా వర్షం కురవకపోవడంతో వరి సాగు బెట్టకు వచ్చింది. గుంటూరు, బాపట్ల, ఎన్‌టిఆర్, కృష్ణాల పరిధిలో దాదాపు 8.10 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇప్పటికే దాదాపు మూడు లక్షల ఎకరాల్లో వరి పంట బెట్టకు వచ్చింది. ఐదు లక్షల ఎకరాల్లో కొంత వరకు నిలదొక్కుకుంటోంది. మరో పది రోజులు వర్షాలు పడకపోతే బెట్టకు వచ్చే పంట విస్తీర్ణం మరింత పెరగనుంది. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉంది. దీంతో, రైతులు మరో 40 రోజుల్లో కోతలకు సిద్ధం కానున్న తరుణంలో పంట ఎందుకూ పనికి రాకుండా పోతుందోమోనని ఆందోళన చెందుతున్నారు. వరి పైరు బెట్టకు రావడంతో పంట ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం పడుతోంది. పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసినా చివరి భూములకు చేయడం లేదు. డెల్టా కాల్వల మరమ్మతుల సకాలంలో చేయకపోవడం వల్ల కూడా పొలాలకు నీరు సక్రమంగా అందని పరిస్థితి ఉంది. ఎక్కువ మంది రైతులు ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనివల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. వరి పొట్ట దశకు రావడంతో నీటి అవసరం పెరిగింది. గత నెల రోజులుగా డెల్టా ఆయకట్టు పరిధిలో కనీస వర్షం లేదు. 2003లో ఏర్పడిన కరువు పరిస్థితులు మళ్లీ 20 ఏళ్లకు చూస్తున్నామని రైతులు చెబుతున్నారు.
పట్టిసీమ, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి ఆదివారం సాయంత్రం నుంచి 14,370 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కానీ, బ్యారేజీకి కేవలం 10,650 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. గోదావరిలో కూడా నీటిమట్టం తగ్గడం, 24 పంపులకుగాను 17 పంపులే పనిచేయడం వల్ల పట్టిసీమ నుంచి ఆశించిన నీటిని ప్రకాశం మిగతా 2లో బ్యారేజీకి విడుదల చేయడం లేదు. వర్షాభావం తీవ్రంగా ఉండడం వల్ల డెల్టాలో ఈ ఏడాది రబీ సాగుపైనా నీలినీడలు నెలకొంటున్నాయి. ఏ పంటలు వేయాలన్న అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది.వర్షాలు లేకపోవడం వల్ల కాలువలకు ఎంత నీరు ఇచ్చినా సరిపోవడం లేదని, వేసవి కాలంగా వాతావరణం ఉండడంతో నీరు పెడుతున్నా వరి పంట బెట్టకు వస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన నీటిని వచ్చినట్టు కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలకు విడుదల చేస్తున్నామని తెలిపారు.ప్రస్తుతం డెల్టాలో సాగులో ఉన్న వరిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆయకట్టు చివరి భూములకు నీరు అందని పరిస్థితి ఉందని, కానీ మొత్తం డెల్టాలో పంటను కాపాడేందుకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి చూడాలని ఆదేశించామని తెలిపారు.

Tags: Flooding of Krishna Delta
