శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 26వ తేదీ బుధవారంనిర్వహించనున్న పుష్పయాగానికి మంగళవారం సాయంత్రంఘనంగా
అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, రాత్రి 7 గంటలకు మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు.ఏప్రిల్ 26న బుధవారం ఉదయం 10 గంటలకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.1000/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు. శ్రీ కోదండరామాలయంలో మార్చి 20 నుంచి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

Tags: Flowering ceremony at Sri Kodandaramalayam
