ఫ్లోరైడ్ కమ్మేస్తోంది 

Date:10/11/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
ఫ్లోరైడ్‌ మహామ్మరి గిరి గ్రామాలను వణికిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ వ్యాధి ప్రబలుతూ భయాందోళకు గురి చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి హెచ్చరించినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్లు పనిచేయకుండా పోతున్నాయి. దీంతో సమస్య పెరుగుతుందే తప్పా తగ్గడం లేదు. ఫ్లోరైడ్‌తో పళ్లు రంగు మారుతున్నాయి. నల్లబారి వ్యాధి తీవ్రతను చూపుతున్నాయి.
కొందరి పళ్లు గారలు పట్టడం, అరిగిపోవడం జరుగుతుంది. పుట్టిన పిల్లలకు ఎముకలు పెరగడం లేదు. కీళ్ల నొప్పులు, చిన్న దెబ్బకే ఎముకలు విరగడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్య ఏళ్ల తరబడి వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫ్లోరైడ్‌ ప్రభావానికి గురైన ఆ ఎనిమిది గ్రామాలు బజార్‌హత్నూర్‌ మండలంలోని చందునాయక్‌ తండా, మోర్కండి, ఏసాపూర్, గులాబ్‌తాండ, టెంబి, హర్కాయి, బోస్రా, భూతాయి(బి). వైద్య,  ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో పైన పేర్కొన్న ఎనిమిది గ్రామాల్లో ఫ్లోరైడ్‌ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు తేలింది.
ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు  ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఆయా గ్రా మాల్లో బోర్లను సీజ్‌ చేశారు. సరైన పద్ధతిలో నీటి వసతిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. చందునాయక్‌ తండాను ఫ్లోరైడ్‌ బాధిత గ్రామంగా 2009లో గుర్తించారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో రూ.10లక్షలతో హడావిడిగా శుద్ధజల ప్లాంటును ఏర్పాటు చేశారు. కాని నిర్వహణ లోపంతో అది కాస్త పని చేయకుండా పోయింది. గ్రామానికి సమీపంలో ఫ్లోరైడ్‌ రహిత ప్రాంతంలో గల కడెం వాగు ఒడ్డున వేసిన బోరు నిరుపయోగంగా మారింది.
బోరు నుంచి శుద్ధజల ప్లాంట్‌ వరకూ పైపులైన్‌ వేయలేదు. దీంతో బోరును ఇతరులు సాగు నీటికి వినియోగిస్తున్నారు. తండాలో మొత్తం 2800 మంది జనాభాకు 60 శాతం మంది ఫ్లోరైడ్‌ బారిన పడిన వారే కావడం ఆందోళనకరం. ఇక్కడ మూడేళ్ల పాప నుంచి ముసలి వరకూ పళ్ళు నల్లబారి పోయి ఉంటాయి. శుద్ధజల పథకం గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
వంద శాతం గిరిజనులు గల గులాబ్‌ తండా గ్రామంలో ప్రజలు ఫ్లోరైడ్‌ బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన నిజామబాద్‌ జిల్లా డిచ్‌పెల్లి డీఎస్పీ రాథోడ్‌ దేవిదాస్‌ స్వంతంగా ఆర్‌వో ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షెడ్డు నిర్మాణం జరిగింది. త్వరలో మిషనరీలు ఏర్పాటు చేయనున్నారు.
మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు సైతం మిషన్‌ భగీరథ నీళ్లు అందడం లేదు. ఈ నీరు అందితే కొంత మేర ఫ్లోరైడ్‌ బారి నుంచి విముక్తి కలిగే అవకాశముంది. కాని ఇంకా అంతర్గత పైపులైన్‌ పనులు కూడా ప్రా రంభించలేదు. ట్యాంకుల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అంద డం వచ్చే ఏడాది కూడా అనుమానంగానే ఉంది.
ఫ్లోరైడ్‌ ఆనవాళ్లు ఉన్న గ్రామాల పరిధిలో బోరు బావుల నీటిని వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఫ్లోరైడ్‌ రహిత గ్రామాల నుంచి తాగు నీటిని సరఫరా చేయాలి. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాల్లో నాగ్‌పూర్‌ యూనివర్సిటీ విద్యార్థులు నేషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూషన్‌(ఎన్‌ఈఈఆర్‌ఐ) నీరీ పద్ధతి ద్వారా ఫ్లోరైడ్‌ బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
ఆ విధానం ఇక్కడ అమలు చేస్తే తప్పా ఫ్లోరైడ్‌ సమస్య తీరేలా లేదు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆ దిశగా ఆలోచించి ఈ ఎనిమిది గ్రామాల ప్రజలను ఫ్లోరైడ్‌ బాధ నుంచి తప్పించాల్సిన అవసరముంది.
Tags; Fluoride is coming

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *