పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించండి- కమిషనర్ జాహ్నవి

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రానున్న వర్షాకాలానికి తగిన విధమైన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 3 వ డివిజను మైపాడు గేట్ పరిసరాల్లోని రాజీవ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి కమిషనర్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించినపుడే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయగలమని, నగర పాలక సంస్థ చెత్త సేకరణ వాహనాలకు నగర పౌరులంతా విడివిడిగా చెత్తను అందించి సహకరించాలని కోరారు. నేరుగా ఇంటి నుంచే వ్యర్ధాలను సేకరించినపుడు వీధుల్లోని పెద్ద డస్ట్ బిన్ ల అవసరం ఉండదని తెలిపారు. డస్ట్ బిన్ ల వలన పందులు, పశువులు, కుక్కలు వంటి జంతువులకు ఆవాసం ఉండక జనావాసాల్లో వాటి సంచారంపై నియంత్రణ ఉంటుందని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా నిర్వహించేలా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యానికి హానికరమైన దోమల సంతాన ఉత్పత్తిని అడ్డుకునేలా డ్రైను కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పూడికతీత పనులను నిర్వహించాలని అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.అనంతరం స్థానిక బట్వాడీ పాళెంలోని పబ్లిక్ హెల్త్ కార్యాలయంలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్వహణ పనితీరును పరిశీలించిన కమిషనర్ మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను సూచించారు. వాటర్ ట్యాంక్ కు అవసరమైన మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సచివాలయం కార్యదర్శులు, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Focus on Sanitation Management- Commissioner Jahnavi

Leave A Reply

Your email address will not be published.