మంత్రి బెర్తుల కోసం…ప్రయత్నాలు

Date:24/06/2020

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు కొత్త‌గా మంత్రులు అయ్యేది ఎవ‌రు అనే అంశంపై చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఇప్పుడు రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎన్నిక కావ‌డంతో మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డం అనివార్యం కానుంది. త్వ‌ర‌లోనే వీరు రాజీనామా చేయ‌నున్నారు.దీంతో ఈ ఇద్ద‌రూ రాజీనామా చేసిన త‌ర్వాత వీరి స్థానంలో జ‌గ‌న్ క్యాబినెట్‌లో ఎవ‌రు చేర‌బోతున్నారు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇందుకు సంబంధించి ప‌లువురి పేర్లు ఇప్పుడు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, జ‌గ‌న్ మ‌దిలో ఏముంది, ఆయ‌న ఎవ‌రికి ఛాన్స్ ఇవ్వ‌బోతున్నారు అనేది ఇప్పుడు కీల‌కంగా మార‌నుంది.

 

 

 

ఏడాది క్రితం మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేసే క్ర‌మంలో సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పెద్ద పీట వేశారు. బీసీల‌కు ఆయ‌న ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. అన్ని సామాజి‌క‌వ‌ర్గాల‌కు క్యాబినెట్‌లో అవ‌కాశం క‌ల్పించేందుకు గానూ ఆయ‌న చాలా మంది సీనియ‌ర్‌ల‌ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో క‌ష్ట‌కాలంలో త‌న వెంట న‌డిచిన వారిని సైతం జ‌గ‌న్ గుర్తించారు. అందుకే త‌న‌తో పాటు కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌, త‌న కేసుల్లో ఇరికిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడినా ఎమ్మెల్సీల‌ను చేసి మ‌రీ వారిని మంత్రులు చేశారు.అయితే, శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో వీరి మంత్రి ప‌ద‌వులు పోవ‌డం ఖాయ‌మైంది. అందుకే వీరిద్ద‌రినీ జ‌గ‌న్ రాజ్య‌స‌భ‌కు పంపించారు. రాజ్య‌స‌భ‌కు ఎన్నికైనా వీరు రాష్ట్ర మంత్రివ‌ర్గంలో ఆరు నెల‌ల పాటు కొన‌సాగే అవ‌కాశం ఉంటుంది. కానీ, రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌గానే వీరిరువురు మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాజీనామా చేయ‌గానే ఒక ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి, ఒక మంత్రి ప‌ద‌వి ఖాళీ కానుంది. ఇప్పుటికే ఈ ప‌ద‌వుల్లో చేరేందుకు ప‌లువురు ఎమ్మెల్యేలు ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.

 

 

 

పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్ బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌. ఆయ‌న స్థానంలో మ‌ళ్లీ బీసీ నేత‌కే అవ‌కాశం ద‌క్కే ఛాన్స్ ఉంది. ఆయ‌న ఖాళీ చేసే స్థానంలో మ‌ళ్లీ తూర్పు గోదావ‌రి జిల్లా నుంచే ఎవ‌రికైనా అవ‌కాశం ల‌భించ‌వ‌చ్చు. ఈ రెండు ఈక్వేష‌న్ల‌ను జ‌గ‌న్ పరిశీలిస్తే మాత్రం ముమ్మ‌డివ‌రం ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్‌కు మంత్రి అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. పైగా ఆయ‌న మ‌త్య్స‌కార సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌. ప్ర‌స్తుతం ఏపీ మంత్రివ‌ర్గంలో ఈ సామాజ‌క‌వ‌ర్గం నుంచి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఒక్క‌రే మంత్రిగా ఉన్నారు. ఆయ‌న కూడా మంత్రి ప‌ద‌విని వ‌దులుకుంటుండ‌టంతో ఈ సామాజి‌క‌వ‌ర్గానికి అవ‌కాశం ఇవ్వాలని అనుకుంటే పొన్నాడ స‌తీష్‌, శ్రీకాకుళం జిల్లా ప‌లాస ఎమ్మెల్యే సిదిరె అప్ప‌ల‌రాజు మాత్ర‌మే ఉన్నారు.

 

 

శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్ప‌టికే ధ‌ర్మాన కృష్ణ‌దాస్ మంత్రిగా ఉన్నారు. స్పీక‌ర్ కూడా ఇదే జిల్లాకు చెందిన నేత‌. పైగా అప్ప‌లరాజు మొద‌టిసారి ఎమ్మెల్యే. కాబ‌ట్టి, రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న పొన్నాడ స‌తీష్‌కే ఎక్కువ మంత్రి అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇంకో స్థానం కోసం మాత్రం పోటీ చాలా తీవ్రంగా క‌నిపిస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి మంత్రి ప‌ద‌వి వ‌దులుకుంటుండ‌టంతో అదే జిల్లా నుంచి వేరే ఎమ్మెల్యేతో భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది. ఇలా చేస్తే ఎవ‌రికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్యంగా జిల్లా నుంచి ఇప్ప‌టికే జ‌గ‌న్ ప‌లువురికి మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చి ఉన్నారు. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని మంత్రిని చేస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు.

 

 

అయితే, ఆయ‌న సోద‌రుడు అయోధ్య‌రామిరెడ్డికి ఇప్పుడే రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇవ్వ‌డంతో ఈ సారి ఆర్కేకు ఛాన్స్ ఉంటుంద‌నేది అనుమానంగానే ఉంది. గుంటూరు జిల్లాకే చెందిన మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు కూడా మంత్రి ప‌ద‌వి కోసం రేసులో ఉన్నారు. చిల‌క‌లూరిపేట‌లో టిక్కెట్ ఇవ్వ‌ని మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు కూడా మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ గ‌తంలో హామీ ఇచ్చారు. ఒక‌వేళ బీసీకి అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటే చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఆమె మొద‌టిసారి ఎమ్మెల్యే కావ‌డం మైన‌స్‌గా మార‌వ‌చ్చు. మొత్తంగా ఈ రెండు మంత్రి ప‌ద‌వులు జ‌గ‌న్ ఎవ‌రికి ఇస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

కరోనా సృష్టిస్తున్న కల్లోలం

Tags: For minister berths … efforts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *