Natyam ad

సానుభూతి కోసమా…. గేమ్ ప్లానా

చంద్రబాబు కామెంట్స్ పై  వైసీపీ మైండ్ గేమ్

కర్నూలు ముచ్చట్లు:


వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే .. ఇవే తనకు చివరి ఎన్నికలను చంద్రబాబు కర్నూలు టూర్‌లో ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు, భారీగా తరలి వచ్చిన జన సందోహం మధ్యనే ఆయనీ ప్రకటన చేశారు. వెంటనే ఏపీ రాజకీయాల్లో ఒక్క సారిగా కలకలం ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు భిన్న కోణాల్లో అన్వయించుకుని ప్రకటించుకుంటున్నారు. చర్చించుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ అంశంపై గుంభనంగా వ్యవహరిస్తున్నారు. తమకు కావాల్సింది ఇతర అన్ని చోట్లా చర్చ జరగడమేనన్నట్లుగా ఉన్నారు. ఇంతకీ చంద్రబాబు ఎందుకలా అన్నారు ? సానుభూతి కోసమా ? గెలవకపోతే రాజకీయాల్లో ఉండరా ? ” మీ పిల్లలు పెద్దయ్యే వరకూ నేను ఉంటానో ఉండనో కానీ..  అమరావతి మాత్రం శాశ్వతం.. రాష్ట్రం మాత్రం శాశ్వతం అందుకే చూసి ఓటేయండి” అని గత ఎన్నికలకు ఓటింగ్ ముందు చంద్రబాబు ప్రజల్ని కోరారు. అయితే ప్రజలు మాత్రం ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఐదేళ్లు పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి ఘోరపరాజయం ఇచ్చారు. ఐదేళ్లు ప్రజల కోసం.. రాష్ట్రం కోసం అంత కష్టపడ్డానన్న భావనలో ఉన్న నేత..అంత ఘోర పరాజయం పాలైతే.. ఇంకెందుకు రాజకీయాలు అనుకోవడం సహజం. అయితే చంద్రబాబులో అలుపెరుగని రాజకీయ నేత ఉన్నారు. ఈట్ పాలిటిక్స్.. డ్రింక్ పాలిటిక్స్.. స్లీప్ పాలిటిక్స్ అన్నట్లుగా యాభై ఏళ్లుగా జీవిస్తున్నారు. అందుకే ఓటమిని జీర్ణించుకుని మళ్లీ ప్రజల్లోకి వెంటనే వచ్చారు. ప్రజా మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.

 

 

Post Midle

ఇలాంటి స్పిరిట్ ఉన్న నేత రాజకీయాల నుంచి విరమించుకుంటారని ఎవరూ అనుకోరు.కానీ ఆయన నోటి నుంచి ఆ మాట రావడం సంచలనం అయింది. రాజకీయాల్లో సానుభూతిని మించిన గెలుపు సూత్రం మరొకటి ఉండదు. గత ఎన్నికల్లో ఒక్క చాన్స్ ప్లీజ్ అని జగన్మోహన్ రెడ్డి దీనంగా అడగడం వల్లనే ఆయనకు  ప్రజలు చాన్సిచ్చారని రాజకీయవర్గాలు గట్టిగా నమ్ముతూ ఉంటాయి. ఆ మాటకు వస్తే వైఎస్ఆర్‌సీపీ రాజకీయ పునాదులు సానుభూతి మీదనే ఉన్నాయంటారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే వ్యూహాన్ని పాటిస్తున్నారని అంచనా వేస్తున్నారు. చివరి ఎన్నిక అంటే.. ప్రజలు చివరి చాన్స్ ఇస్తారని గతంలో అనేక మంది రాజకీయ నేతలు ఇదే నినాదంతో పోటీ చేసినప్పుడు రుజువు అయిందంటున్నారు. చంద్రబాబు కూడా ఇదే వ్యూహాన్ని పాటిస్తున్నారని కొన్ని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రానికి ఎంతో సేన తనను.. రాజకీయాలతో సంబంధమే లేని తన కుటుంబాన్ని కించపరిచారని.. గెలిస్తేనే ..సీఎం హోదాలోనే మళ్లీ అసెంబ్లీకి వస్తానని చాలెంజ్ చేశానని ప్రజలకు చెబుతున్నారు. ఇదంతా వ్యూహాత్మకమేనని అంటున్నారు. చంద్రబాబు ప్రకటనను ఇతర రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుని విశ్లేషిస్తున్నాయి. చంద్రబాబు పనైపోయిందని..అందుకే అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఆయనకు గత ఎన్నికలే చివరివి అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

 

 

బీజేపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ లీడర్ అని.. వచ్చే ఎన్నికలే ఆయనకు చివరివని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. జనసేన నేతలు ఎవరూ పెద్దగా బయటకు  ప్రకటన చేయలేదు కానీ..సోషల్ మీడియాలో మాత్రం… ఇక చంద్రబాబు రాజకీయ శకం ముగిసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి చంద్రబాబును ఈసారి ఓడిస్తే తమకు తిరుగు ఉండదని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతీ రోజూ తమ పార్టీ నేతలకు చెబుతున్నారు. దీనికి కారణం.. వచ్చే ఎన్నికల్లోనూ ఓడిపోతే చంద్రబాబు వయసు రీత్యా యాక్టివ్‌గా ఉండలేరని.. ఈ కారణంగా టీడీపీ కూడా ఇబ్బంది పడుతుందని.. తమకు ఎదురు ఉండదని ఆయన ఆలోచన. ఈ విషయంలో వైఎస్ఆర్‌సీపీ కూడా అదే అనుకుంటోంది. మరి టీడీపీకి చంద్రబాబు తప్ప ప్రత్యామ్నాయ నాయకత్వం లేదా అంటే..  ఉన్నా జగన్‌ను ఢీ కొట్టలేరని వారి భావన కావొచ్చంటున్నారు. రాజకీయాల్లో సన్యాసం సవాళ్లు అతి సాధారణం.

 

 

కానీ ఎవరూ ఇంత వరకూ సన్యాసం తీసుకోలేదు. రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొంటానని..  మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చాలెంజ్ చేశారు. అన్నట్లుగానే ఆయన వైదొలిగారు. మళ్లీరాలేదు. బహుశా సందర్భం రాలేదు. సందర్భం వస్తే అభిమానులు పిలుస్తున్నారని ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తారు. చంద్రబాబు కూడా అంతే. ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని ప్రకటిస్తే.. వద్దని ఆయనను బతిమిలాడే క్యాడర్ ఉంటుంది. అదే సమయంలో చంద్రబాబు రాజకీయాలు చేయకుండా ఖాళీగా ఉంటారని ఎవరూ అనుకోరు. చంద్రబాబు ప్రకటన ఓ రాజకీయ ఎత్తుగడగానే అందరూ భావిస్తున్నారు. కానీ రాజకీయంగా తమకు అనుకలంగా విశ్లేషించుకునేందుకు ఎక్కువ తాపత్రయ పడుతున్నారు. టీడీపీ మాత్రం ఇలాంటి ప్రచారం ఎంత జరిగితే అంత మంచిదన్నట్లుగా గుంభనంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు ప్రకటనపై ఎలాంటి కామెంట్లు చేయడం లేదు.

 

Tags: For sympathy…. game plana

Post Midle

Leave A Reply

Your email address will not be published.