మాజీలు వర్సెస్ తాజాలు

విశాఖపట్టణం ముచ్చట్లు:


ఉమ్మడి విశాఖజిల్లాను కంచుకోటగా మలుచుకుంటోంది వైసీపీ. ఇక్కడ అధికారపార్టీకి 12మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. అదేస్ధాయిలో మాజీ ఎమ్మెల్యేల నాయకత్వం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చెయ్యడం ద్వారా ఉత్తరాంధ్రపై బలమైన ముద్ర వేసుకోవాలని చూస్తోంది వైసీపీ. పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసే బాధ్యతలను సీనియర్లకు అప్పగించడంతోపాటు.. మూడేళ్ల తర్వాత చేపట్టిన నియోజకవర్గస్ధాయి ప్లీనరీలకు మాజీ ఎమ్మెల్యేలను పర్యవేక్షకులుగా నియమించింది. క్షేత్రస్ధాయిలో కార్యకర్తల మనోభావాలను నేరుగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేలలో కొందరికి పోటీ చేసే అవకాశం లభిస్తుందనే చర్చ మొదలైంది.వివిధ కారణాలతో ఎమ్మెల్యేలు బలహీనంగా మారడం.. అంతర్గత విభేదాలు తదితర కారణాలతో మార్పులు ఉంటాయని భావిస్తున్నారట. ఇటీవల పశ్చిమ నియోజకవర్గంలో కోఆర్డినేటర్‌ను మార్చేశారు. దాంతో ఎన్నికలపై హైకమాండ్ ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో ఎమ్మెల్యేలు గ్రహించారట. ఆ తర్వాతే మాజీ ఎమ్మెల్యేలు రేసులోకి వస్తున్నారు. కీలక నియోజకవర్గాల్లో దృష్టిపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారట. గాజువాక, పెందుర్తి, పాడేరు, పాయకరావుపేట, అరకువ్యాలీ సెగ్మెంట్‌లలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గట్టి పట్టుతోనే ఉన్నారట.కాపు సామాజికవర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న పెందుర్తిపై ఫోకస్ పెట్టారట మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. గతంలో ప్రజారాజ్యం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి యలమంచిలిలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజును మారుస్తారనే ప్రచారంతో పంచకర్ల ఇక్కడ కన్నేశారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ సీనియర్లు యాక్టివ్ అవుతున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు.. ఈసారి చట్టసభలకు పోటీ చెయ్యాలని చూస్తున్నారు.

 

 

 

పాడేరు పరిధిలో సన్నిహితులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు బాలరాజు. రెండు దఫాలుగా అధికారానికి దూరంగా ఉండటంతో రాజకీయంగా ప్రజలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారట. పాడేరు ఎమ్మెల్యే కొత్తగుళ్లి భాగ్యలక్ష్మిపై స్థానికంగా పార్టీలో వ్యతిరేకత పెరుగుతోందనే చర్చ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నియోజకవర్గంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం పెద్ద మైనస్‌.అరకువ్యాలీ ఎమ్మెల్యే ఫల్గుణకు గ్రూప్‌ రాజకీయాల సెగ వదలడం లేదు. గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు.. ఈసారి అవకాశం చేజార్చుకోకూడదని గట్టిపట్టుదలతో ఉన్నారట. ఎమ్మెల్యే వ్యతిరేకవర్గాలను కూడగట్టడం ద్వారా తాను బలమైన అభ్యర్థిననే సంకేతాలు పంపిస్తున్నారు. స్ధానిక గిరిజన తెగలకు కాకుండా బయటి వారికి అవకాశం కల్పించాలని అధిష్ఠానం భావిస్తే ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పాచిక పారినట్టేననే టాక్‌. ఇక గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డికి పార్టీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పవన్ కల్యాణ్‌ను ఓడించడంతో.. ఆయన స్థానం సుస్థిరం అని చర్చ సాగుతోంది. అయితే వయోభారం కారణంగా నాగిరెడ్డిని మార్చితే గాజువాక ఖాళీ అవుతుంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీలోని ఒక యువనేత గాజువాకపై కర్చీఫ్‌ వేసినట్టు చర్చ సాగుతోంది.పాయకరావుపేటలోనూ సమీకరణాలు మారుతున్నాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు అసమ్మతి సెగ పెరిగింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు స్క్రీప్‌పైకి వచ్చారు. ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గమైన పాయకరావుపేటలో బీసీ, కాపు సామాజికవర్గాల ప్రభావం ఎక్కువ. ఆ వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాల ఆధారంగా చెంగల యాక్టివ్‌ అవుతున్నారు. ఇలా నియోజకవర్గాల్లోని పరిస్థితుల ఆధారంగా వైసీపీలో కూడికలు, తీసివేతలపై చర్చ మొదలైంది. ప్రతిపక్షాల వ్యూహాలు అభ్యర్ధుల ఎంపికను ప్రభావితం చేస్తాయనే అభిప్రాయం ఉంది. చివరికి ఎవరు తెరపైకి వస్తారో.. బరిలో ఉంటారో చూడాలి.

 

Tags: Formers vs. Freshers

Leave A Reply

Your email address will not be published.