ఏపీలో ఉచిత మందుల పథకం

Date:11/02/2019

గుంటూరు ముచ్చట్లు:
రాష్ట్రంలో మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడే వారికి ఇది శుభవార్తే. ఇకపై రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో బీపీ, షుగర్‌ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘ఉచిత మందుల పథకం’ ప్రకటించింది. నెలకు సరిపడా మందులు ఒకేసారి పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రైవేటు రిటైల్‌ మెడికల్‌ షాపులోనైనా రోగులు ఈ మందులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. బీపీ, షుగర్‌ రోగులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఈ తరహా పథకం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐసీఎంఆర్‌, కలామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ సంస్థలు ఇటీవల సంయుక్తంగా ఏపీలో సర్వే నిర్వహించాయి. ప్రైవేటు వైద్యరంగంలో నెలకు రూ.వేలు వెచ్చించి బీపీ, షుగర్‌ మందులు కొనుగోలు చేసే రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్ధిక భారం పడుతున్నట్లు గుర్తించారు. వారికి ఉచితంగా మందులు ఇవ్వడం ద్వారా ఆర్ధిక వెసులుబాటు కలుగుతుందని సిఫార్సు చేశారు.
ఈ ప్రతిపాదనను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రభుత్వానికి పంపగా, ఆమోదించింది.రోగుల ఎంపిక ఇలా… ఉచిత మందుల పథకంలో లబ్ధిదారులుగా చేరదలచిన రోగులు తొలుత తమకు ఉన్న బీపీ, షుగర్‌ వ్యాధులను సమీపంలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో నిర్ధారణ చేయించుకోవాలి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో డాక్టర్లు ఈ జబ్బులను నిర్ధారించాలి. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వైద్యులు కూడా ఈ వ్యాధులను నిర్ధారించవచ్చు. బీపీ పరీక్షలతో పాటు గ్లైకోజినేటెడ్‌ హీమోగ్లోబిన్‌ పరీక్షలు చేయించుకోవాలి. షుగర్‌ బాధితులు ఫాస్టింగ్‌, పోస్ట్‌ ప్రాండియల్‌ పరీక్షలతో వ్యాధిని నిర్ధారించాలి. అనంతరం డాక్టర్‌ రోగి పరీక్ష ఫలితాలను AP -e RX APP ద్వారా అప్‌లోడ్‌ చేస్తారు. వెంటనే రోగి సెల్‌ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, కోడ్‌ వస్తుంది. అంతే… రోగి లబ్ధిదారుడుగా ఎంపికైనట్లే. ఈ కోడ్‌ను చూపి రిటైల్‌ మెడికల్‌ షాపునకు వెళ్లి మందులు తీసుకోవచ్చు. ఒకసారి నెలకు సరిపడా మందులు ఇస్తారు.
రోగులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చేందుకు వారి ఆధార్‌ నంబర్‌, ప్రజా సాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. ప్రజా సాధికార సర్వేలో నమోదు కాని వారు తమ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో సంప్రదించాలి.మందుల దుకాణాలు ఇలా చేయాలి… ఇక ఈ పథకం కింద రోగులకు మందులు విక్రయించాల్సిన రిటైల్‌ మెడికల్‌ దుకాణాల వారు మొదట అదే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం తాము విక్రయించే మందులను బిల్లు, రోగి కోడ్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ప్రభుత్వం వారానికి ఒకసారి ద్వారా మందుల దుకాణాలకు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎంఎస్‌డీఈసీ) బిల్లులను, చెల్లింపులను పర్యవేక్షిస్తుంది. బీపీ, షుగర్‌ రోగులకు అందించే మందుల వివరాలను, ఆయా మందులకు ప్రైవేటు మెడికల్‌ దుకాణాలకు ప్రభుత్వం చెల్లించే ధరలను ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేసేందుకు ఏపీ ఎంఎస్‌ఐడీసీ సంస్థ చెల్లించే రేటును ఇందుకు ప్రామాణికంగా తీసుకున్నారు.
Tags:Free pharmacy plan in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *