జనవరి 2నుంచి ‘జన్మభూమి-మా ఊరు’తో వస్తున్నాం దీవించండి

From January 2, we are blessed with 'birthplace-our town'

From January 2, we are blessed with 'birthplace-our town'

ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Date:31/12/2018
అమరావతి ముచ్చట్లు:
గత విజయాలను సమీక్షించి, నవ సంకల్పాలతో భవిష్యత్తు నిర్మించుకొనేందుకు వచ్చిన శుభ సమయమే కొత్త సంవత్సరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నూతన సంవత్సరం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి  నవ్యాంధ్రప్రదేశ్  చరిత్ర గతిని శాసించే సమయం అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
  నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో సాధించిన అభివృద్ధిని, ఐదుకోట్ల ప్రజలకోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఫలితాలను  వివరిస్తూ జనవరి 2వ తేదీ నుంచి 6వ విడత ‘జన్మభూమి-మా ఊరు’  కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు రానున్నామని, తమను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కోరారు.  పాలనా విజయాలను వివరించే 9 శ్వేతపత్రాలను ఇప్పటికే విడుదల చేశామని, మంగళవారం  పదో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.
తనపై ఎంతో విశ్వాసంతో రాజధాని నిర్మాణానికి సమీకరణ కింద  రైతులు 33 వేల ఎకరాల భూములిచ్చారని ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, కలలు నెరవేర్చుకునే వేదికగా నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిv అమరావతి నిర్మాణం జరుగుతోందని, ర్యాఫ్టు తరహా ఫౌండేషన్‌తో నూతన సచివాలయానికి 5 శిఖర భవనాల నిర్మాణం ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పోలవరం 63.57% కు పైగా పూర్తయ్యిందని, కేంద్రం కక్షతో నిధులు నిలిపివేసినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు ఆగకుండా చూస్తున్నామన్నారు.
   రూ.1600 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి కృష్ణా డెల్టాను ఎడారి కాకుండా కాపాడామని, రూ.40 వేల కోట్ల విలువైన పంట దిగుబడి వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు.
మరోవైపు రాజయలసీమకు కృష్ణాజలాలిచ్చి మూడేళ్లుగా చెరువులు నింపి కరవు చాయలు లేకుండా చేశామని చెప్పారు. అనంతపురానికి కియా కార్ల పరిశ్రమను తెచ్చినా, తిరుపతిలో మొబైల్ ఫోన్ కంపెనీల కేంద్రంగా మార్చామన్నా తమ దార్శనికత వల్ల, ఉద్యోగుల కృషి, ప్రజా సహకారంతో సాధ్యమైందన్నారు. అరవై ఏళ్ల శ్రమను, కష్టాన్ని, సృష్టించిన సంపదను హైదరాబాద్‌లో ధారపోశామని, ఆదాయాన్నిచ్చే రాజధానిని వదులుకొని, రాజధాని లేకుండా, అప్పులతో, కట్టుబట్టలతో వచ్చామని, అయినా నిరాశతో క్రుంగిపోకుండా నిర్మాణ దీక్షా సంకల్పం తీసుకుని కసిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
విభజన నాడు రూ.16 వేల కోట్ల ద్రవ్యలోటుతో కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రయాణం ప్రారంభమైందని, ఆనాడు రోజుకు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉందని సీఎం గుర్తు చేశారు. వచ్చిన కొద్దికాలానికే పరిస్థితిని సమూలంగా మార్చివేశామని సీఎం అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తో కష్టపడి పనిచేసి రెండంకల వృద్ధి రేటు సాధించామని, ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో 15.5%గా  వృద్ధిరేటు నమోదైందని ముఖ్యమంత్రి వివరించారు. కేంద్ర సహకారం లేకున్నా రూ.24 వేల 500 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, సంక్షేమానికి 80 వేల కోట్లకు పైగా వెచ్చించి నాలుగేళ్లుగా బడుగు, బలహీన, గిరిజన, మైనారిటీ వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో సామాజిక భద్రత కింద 50,50,762 మందికి పెన్షన్లిస్తున్నట్లు చెప్పారు.
అలాగే  వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి నాలుగేళ్లుగా 80 కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని నెంబర్-1గా నిలిపామన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తూ, రాష్ట్రాల హక్కులను హరిస్తే  గుణపాఠం తప్పదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయని అన్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా, రాజధానికి నిధుల హామీలను మోడీ అధికారంలోకి రాగానే తుంగలో తొక్కారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వంచించారని, అందువల్లనే తాము ఎన్డీయే నుంచి బయటికి వచ్చి ధర్మపోరాటం చేపట్టామని చంద్రబాబు గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల్లో దుష్ట శక్తులను ఓడిస్తామని రాష్ట్ర ప్రజలు సంకల్పం తీసుకుని, రాష్ట్రాభివృద్ధిని కొనసాగించేందుకు మళ్లీ తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర పురోభివృద్ధికి, బిడ్డల భవిష్యత్తుకు, రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగించాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా రాజకీయ సుస్థిరత ఎంతో అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సమర్ధ నాయకత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో అవకాశం వచ్చిందని, 2019లో జరిగే ఎన్నికల్లో మరో పర్యాయం మద్దతు పలికి ఆశీర్వదించాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Tags:From January 2, we are blessed with ‘birthplace-our town’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed