మంధని నుంచి ఢిల్లీ వరకు

న్యూఢిల్లీ ముచ్చట్లు :
పీవీ ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మరువని మహనీయుడు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే మాటలను అనేక సందర్భాల్లో ఉటంకించిన ఆయన దానిని అక్షరాలా ఆచరించారు. సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోయేవారు. ఎలాంటి డాబు, దర్పం ఉండేవి కావు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అందరి ఇండ్లలోకి వెళ్లేవారు. కుర్చీలో, మంచంలో, ఏదీలేకుంటే నేలపైనా చాపలోనూ కూర్చుని మాట్లాడేవారు’ అని ఆయనలోని సామాన్యుడి కోణాన్ని వివరించారు విశ్రాంత అధ్యాపకురాలు, రచయిత, ఎన్సీఈఆర్టీ జాతీయ అవార్డు గ్రహీత ఇషత్‌ సుల్తానా1957లో మంథని నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసిన నాటినుంచి పీవీ నరసింహారావుతో మా కుటుంబానికి అనుబంధం ఏర్పడింది. ఆ సమయంలో మా అమ్మ మరియం ఫాతిమా- మంథని హైస్కూల్‌లో టీచర్‌గా, అటు తరువాత ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేశారు. అనేక విద్యాకార్యక్రమాల్లో పీవీతో కలిసి అమ్మ ప్రత్యేకంగా పాల్గొన్నారు. నేను, మా చెల్లి కూడా ప్రచారంలో పాల్గొన్నాం. అలా పీవీ, ఆయన కుటుంబంతో మాకు సాన్నిహిత్యం ఏర్పడింది.

పీవీ నిరాడంబరత, ప్రేమ, ఆప్యాయత అనురాగాలు మరువలేనివి. వంగరలో ఉన్నప్పుడు, అటు తరువాత హైదరాబాద్‌లోనూ మేం ఎప్పుడు వెళ్లినా పీవీ సతీమణి సత్యమ్మ మాకు భోజనం పెట్టి మరీ పంపించేవారు. పీవీ చిన్నకుమార్తె వాణి, నేను కలిసి చదువుకున్నాం. వారి కుటుంబీకులందరూ మమ్ములను తమ ఇంటివాళ్లుగానే ఆదరించేవారు.పీవీతో ప్రతి క్షణమూ అమూల్యమైనదే కాదు ఒక మధురస్మృతి. ఇప్పటికీ పీవీని తలచుకుంటే నాకు రెండు సంఘటనలు కండ్లముందు కదలాడుతుంటాయి. ఒకటి- నేను మంథని స్కూల్‌లో సంస్కృతంలో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చినప్పుడు ధ్రువపత్రాన్ని పీవీ చేతులమీదుగా అందుకున్నాను. ఆ సందర్భంలో ఆయన- ‘మా పిల్లలు సంస్కృతం కూడా చదువుతున్నారా.. శెభాష్‌’ అంటూ ఆప్యాయంగా మెచ్చుకోవడం మరువలేను. మరొకటి- ఎన్సీఈఆర్టీ జాతీయ అవార్డును అందుకునేందుకు ఢిల్లీ వెళ్ళినప్పటిది. అప్పటికి కొన్ని మాసాల క్రితమే పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సార్‌ను కలుద్దామని నా సహచర ఉపాధ్యాయులను తీసుకుని వెళ్లా. కానీ ఆ రోజు హరారే వెళ్తున్న పీవీని కలిసేందుకు అక్కడి సిబ్బంది ఎంత ప్రాధేయపడినా అనుమతించలేదు. అంతలోనే పీవీ పీఏ నన్ను గుర్తుపట్టి అక్కడికి వచ్చారు. మా వివరాలు తెలుపుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఆయన ద్వారా పంపితే పది నిమిషాల్లో పీవీ నుంచి మాకు పిలుపు వచ్చింది. మేం లోపలికి వెళ్లగానే మమ్ములను చూస్తూనే అక్కడి సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేసి నేరుగా మా వద్దకు వచ్చారు. ఆనందంతో- ‘ఎక్కడి మంథని. ఎక్కడి ఢిల్లీ’ అంటూ ఆశ్చర్యంతో, సంతోషంతో ఆప్యాయంగా పలకరించారు. అటు తరువాత పీఏను పిలిచి ‘ముందు పిల్లలకు భోజనం పెట్టించండి.

ఎప్పుడు తిన్నారో ఏమో’ అంటూ చెప్పారు. మేం భోజనం చేసి వచ్చేలోగా సమావేశాన్ని ముగించుకుని వచ్చి మాతో ఆప్యాయంగా మాట్లాడారు. అందరినీ పేరుపేరునా అడగడమే కాకుండా, మంథనిలోని తన సన్నిహితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అటు తరువాత ఆయనే ఫొటోగ్రాఫర్‌ను పిలిచి మాతో ఫొటో దిగిన దృశ్యం ఇప్పటికీ నా కండ్లముందు కదలాడుతునే ఉంటుంది. ఇలా ఎన్నో జ్ఞాపకాలున్నాయి.తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. అన్నింటిలో కంటే పీవీకి ప్రీతిపాత్రమైన శాఖ విద్యాశాఖనే. సామాన్యులు, పేదలు, బడుగు బలహీన వర్గాల నుంచి విద్యాధికులు పుట్టుకొచ్చారంటే అది ఆయన చలువే. మాతృభాషలో విద్యాబోధనతోపాటు గురుకులాల ఏర్పాటు మొదలు పీవీ చేపట్టిన అనేక సంస్కరణల ఫలితమే. అదీగాక డిటెన్షన్‌ విధానం రద్దు కూడా ముఖ్యమైనదే. నేను పదో తరగతి వరకు మంథనిలోనే చదివా. అటు తరువాత స్థానికంగా ఇంటర్మీడియెట్‌ కళాశాల లేకపోవడంతో కరీంనగర్‌ వెళ్లాల్సి వచ్చింది. ఈ సమస్యను పీవీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మంథనిలో ఇంటర్‌తోపాటు డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేయించారు. విద్యకు అంత ప్రాధాన్యమిచ్చే వారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించి వారు చదువుకునేందుకు బాటలు వేశారు. పీవీ విశాల హృదయుడు. సంకుచిత రాజకీయాలు పడేవి కావు. అభివృద్ధి ఫలాలు పేదలందరికీ చేరాలన్నదే ఆయన ఆకాంక్ష.పీవీ స్వభావరీత్యా అంతర్ముఖుడు. తాను నేర్చిన అనుభవాలు, చదివిన చదువు, తన కుటుంబం, సమాజం నేర్పిన సంస్కారం అన్నీ కలబోతగా, సమస్యను మూలాల నుంచి తరచి చూసి, సిద్ధ సంకల్పమైన స్థిర నిర్ణయాలను తీసుకుంటారు. మితభాషి కానీ అమిత ప్రతిభా సంపన్నుడు. తన ప్రతిభను దేశ శ్రేయస్సుకు, ప్రజాసేవకు నిస్వార్థంగా అంకితం చేసిన మహానేత.పీవీ స్థితప్రజ్ఞుడు, అపర చాణక్యుడు, సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందారు. అంతర్లీనంగా ఒక చిత్రకారుడు, ఒక తత్త్వవేత్త, ఒక శాస్త్ర పరిశోధకుడు కూడానూ. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇన్ని ప్రత్యేకతలు, ఇంత విలక్షణత వున్న ఒక మహామనీషి తెలంగాణ బిడ్డ కావడం తెలంగాణవారంతా గర్వించదగ్గ విషయం. ప్రపంచ దేశాలు ఆయన సేవలను గుర్తించినా ఇక్కడ సముచిత గుర్తింపు, గౌరవం దక్కకపోవడం శోచనీయం. పీవీ జీవితమంతా నమ్ముకుని ఉన్న కాంగ్రెస్‌ పార్టీ, తోటి నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను, ఆయన దేశానికి చేసిన ఎనలేని సేవలను పూర్తిగా విస్మరించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:From Mandhani to Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *