గులాబీ నుంచి కమలంలోకి..

బీజేపీ మైండ్ గేమ్

హైదరాబాద్ ముచ్చట్లు:

రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను మోరల్‌గా దెబ్బతీయడానికి బీజేపీ బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తున్నది. టీఆర్ఎస్‌కు చెందిన దాదాపు డజను మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో ఇప్పటికే ఫస్ట్ రౌండ్ చర్చలు జరిపింది. పార్టీని విడిచి రావడానికి వారు సిద్ధంగా ఉన్నట్టు ఢిల్లీలోని కమలనాథులు పేర్కొన్నారు. పదవులకు రాజీనామా చేసి రావాలని కండీషన్ పెట్టినట్టు ఆ వర్గాల ద్వారా తెలుస్తున్నది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాదిరిగా గెలిపించుకుంటామని పార్టీ భరోసా కూడా ఇచ్చినట్టు సమాచారం. కానీ ఆ ఎమ్మెల్యేలు మాత్రం అందుకు ధైర్యం చేయడం లేదు. దీంతో జనవరి వరకూ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇతర పార్టీల నుంచి చేర్చుకోడానికి ప్రత్యేకంగా ‘చేరికల కమిటీ’ అనే వ్యవస్థను రూపొందించుకోవడం వెనుక బీజేపీ ఉద్దేశం ఇదే. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తరహాలోనే టీఆర్ఎస్‌కు చెందిన పన్నెండు మంది విషయంలోనూ ఉప ఎన్నిక అంశాన్ని నొక్కిచెప్పినట్టు తెలిసింది. అధికార పార్టీని వీడి వచ్చిన తర్వాత బీజేపీ తరఫున గెలిచారనే మెసేజ్ జనంలోకి వెళ్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు టర్నింగ్ పాయింట్‌గా మారుతుందన్నది కమలనాథుల వ్యూహం. ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్యే పదవి ముగిసేందుకు ఇంకా ఏడాదిన్నర టైమ్ ఉన్నందున వాటికి ఇప్పుడే రాజీనామా చేస్తే ఎలా? ఉప ఎన్నికల్లో గెలుస్తామా? అనే సందేహం ఆ డజను మందిలో వ్యక్తమైనట్టు తెలిసింది. కానీ గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందని కమలనాథులు భరోసా కల్పించినా.. వారు ధైర్యం చేయడం లేదని ఢిల్లీ వర్గాలు వివరించాయి.

 

 

 

అందువల్లనే జనవరి వరకు డెడ్‌‌లైన్ పెట్టినట్టు పేర్కొన్నాయి.తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ అమలుచేసిన వ్యూహాన్నే ఇప్పుడు బీజేపీ సైతం అనుసరించాలని భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పుకోడానికి టీఆర్ఎస్ రాజీనామా బాటను ఎంచుకున్నది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ప్రజల మద్దతు ఉన్నదని బలంగా చెప్పుకోడానికి ఈ ఉప ఎన్నికలు టీఆర్ఎస్‌కు బాగా దోహదపడ్డాయి. ప్రస్తుతం ఇదే వ్యూహాన్ని బీజేపీ సైతం అనుసరించాలని అనుకుంటున్నట్టు ఢిల్లీ వర్గాలు వివరించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఇటీవల చేసిన ‘కట్టప్ప’ కామెంట్స్, ‘టీఆర్ఎస్ పార్టీలోనే ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారు’ అని మరికొంత మంది చేసిన కామెంట్స్ వెనక అసలు అర్థం ఇదేనని ఆ వర్గాలు వివరించాయి. ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు, శ్రేణులు లేరన్న సంగతిని గ్రహించిన బీజేపీ ‘పల్లెగోస’ పేరుతో గ్రామాల్లోకి ఎంటర్ అవుతున్నది. ప్రస్తుతం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్ కొనసాగిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు 119 నియోజకవర్గాల్లో ఈ ప్రోగ్రామ్‌ను అమలుచేయడాన్ని పార్టీ ఒక టాస్క్‌గా పెట్టుకున్నది. ఇటీవల బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తరహాలోనే కొత్త కేడర్‌‌ను తయారుచేసుకోడానికి ఈ రూపంలోనూ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

 

 

‘రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదు’ అని టీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న విమర్శలకు దీటుగా ఉప ఎన్నికల్లో వీరిని గెలిపించుకుని ‘ఎంత సీన్ ఉన్నదో చూపిస్తాం’ అనేది బీజేపీ లాజిక్.ఇప్పటి నుంచి ప్రతి నెలలో రెండు రోజులు తెలంగాణలోనే గడిపేలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నుంచి డజను మందిని లాక్కుని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. తిరిగి వారిని గెలిపించుకోవడం ద్వారా అధికార పార్టీని నైతికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు.

 

 

 

బీజేపీ రాష్ట్ర కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఇలాంటివి దోహదపడతాయన్నది ఆ పార్టీ భావన. కొద్దిమంది కాంగ్రెస్ నేతలపైనా బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. రాజగోపాల్‌రెడ్డికి తోడు ఇంకెవరున్నారన్నది బయటకు పొక్కకుండా బీజేపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీ దూకుడుగా వ్యవహరించి ప్రత్యర్థులను టెన్షన్ పెట్టాలనుకుంటున్నది. చేరికలుంటాయంటూ మైండ్ గేమ్ ఆడాలనుకుంటున్నది. వ్యూహరచనలో ఒకరిని మించి మరొకరు నిష్ణాతులు అని కేసీఆర్, అమిత్ షా గురించి ఓపెన్ టాక్ ఉన్న పరిస్థితుల్లో ఎవరి స్ట్రాటెజీ ఎలా వర్కవుట్ అవుతుంది, ఎవరికి ఎవరు చెక్ పెడతారు, ఏ పార్టీది పైచేయి అవుతుంది.. అనేవి ఆసక్తికరంగా మారాయి.

 

Tags: From rose to lotus..

Leave A Reply

Your email address will not be published.