డ్రాగన్ ఫ్రూట్ కు ఫుల్ డిమాండ్

విజయనగరం ముచ్చట్లు:


దేశాల్లో సంపన్నులు తినే డ్రాగన్‌ ఫ్రూట్స్‌ మన ప్రాంతంలో కనిపించవు. అలాంటి అరుదైన పంటను బొండపల్లి, డెంకాడ, లక్కవరపుకోట మండలాల్లో ఔత్సా హిక రైతులు సాగుచేస్తున్నారు. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా యువ రైతులు పండ్ల తోట లు సాగుచేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలతో ముందుకు సాగుతున్నారు. అధిక దిగుబడులు వస్తుండడంతో సంతోసపడుతున్నారు. మన ప్రాంతంలో విస్తారంగా సాగుచేయవచ్చని చెబుతున్నారు. డ్రాగన్‌ఫ్రూట్స్‌ మొక్కల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. మంచి సేంద్రియ కర్బనంతో కూడిన ఇసుక నేలలు మరింత శ్రేష్టం. ఈ పంటను అధికంగా వియత్నాం, థాయ్‌లాండ్, ఇజ్రాయిల్, శ్రీలంక వంటి విదేశాల్లో పండిస్తున్నారు. ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ. పూత, కాయ సమయాల్లో 3–4 తడులు అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ పంట పండించుటకు, మొక్కల ఎదుగుదలకు ఊతం అనేది అతి ప్రధానమైనది. సిమెంట్‌/కాంక్రీట్‌ స్తంభాలను ఎకరానికి 500 వరకు అవసరమవుతాయి. ప్రతీ స్తంభానికి నాలుగు వైపులా నాలుగు మొక్కలను నాటాలి. స్తంభానికి పైన టైర్‌/ఇనుప చక్రం ఉంచాలి. ఇవి మొక్క నుంచి వచ్చిన కొమ్మలు విరిగిపోకుండా, జారిపోకుండా ఊతం అందిస్తుంది.

 

 

ఎకరానికి సుమారుగా 2, 000 మొక్కలు నాటాలి.   ఈ  పంట ఒకసారి నాటితే 20 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. స్తంభానికి నలు దిక్కులా 2 అడుగుల పొడవు, వెడల్పు, 1 అడుగు లోతు గుంతలు తవ్వాలి. గుంతకు 25 కిలోల పశువుల ఎరువు, కిలో వేపపిండి వేసి మొక్కలు నాటాలి. నేలను బట్టి, సాగు చేసిన రకాలను బట్టి తడులను ఇవ్వాలి. నీరు ఎక్కువైతే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. సంవత్సరంలో రెండు సార్లు పశువుల ఎరువు వేసి సూక్ష్మ పోషకాల మిశ్రమా న్ని పిచికారీ చేయాలి. సాధారణంగా డ్రాగన్‌ మొక్కలు తొలికాపు వచ్చేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది.డ్రాగన్‌ఫ్రూట్‌ పూత, కాయ సీజన్‌ జూన్‌ నుంచి అక్టోబర్‌ నెల వరకు ఉంటుంది. పంట పొలంలో విద్యుత్‌ లైట్లను అమర్చితే వేసవిలో కూడా పంటను పొందవచ్చు. డ్రాగన్‌ సాగుకు ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకు దిగుబడి 6–8 టన్నుల వరకు వస్తుంది. ప్రస్తుత మార్కెట్‌లో డ్రాగన్‌ఫ్రూట్‌ కేజీ ధర రూ.150–200 వరకు పలుకుతోంది.

 

Tags: Full demand for dragon fruit

Leave A Reply

Your email address will not be published.