ఇక బీఆర్కే భవన్ చుట్టూ ఫుల్  సెక్యూరిటీ

Date:12/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

సచివాలయం తరలింపు నేపథ్యంలో హైదరాబాద్‌లోని బూర్గుల రామకృ ష్ణారావు  భవన్‌ చుట్టూ త్వరలో ఓ భద్రతావలయం ఏర్పాటు కానుంది. ఆ ప్రాంతమంతా పోలీస్‌ పహారాలోకి వెళ్ళబోతున్నది. భవనం పరిసరాలను హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించనున్నారు. ముందున్న మూడు రోడ్లను మూసేసి ట్రాఫిక్‌ను మళ్లించను న్నారు. వీటితోపాటు వీవీఐపీల రక్షణ, పార్కింగ్‌ స్థలం ఏర్పాటు తదితర అంశాలను స్టడీ చేసి ఒక రిపోర్ట్‌ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసుశాఖను ఆదేశించారు.

 

 

ఆ మేరకు ఒకటీ, రెండు రోజుల్లో అధ్యయనాన్ని పూర్తిచేసి నివేదిక సమర్పించనున్నారు. కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో శాఖలన్నీ బీఆర్‌కే భవన్‌కు తరలడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే షిఫ్టింగ్‌ మొదలైంది. ఎస్పీఎఫ్‌, ఐఎస్‌డబ్ల్యూ, సీఎస్‌డబ్ల్యూ, ఐబీ, ఎస్‌బీ, లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ ఇలా అన్ని విభాగాల సమన్వయంతో పోలీస్‌ శాఖ.. బీఆర్‌కే భవన్‌తోపాటు పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నది. రక్షణ ఏర్పాట్లపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి సంపూర్ణ నివేదిక ఇవ్వనున్నది.

 

 

 

పోలీస్‌శాఖకు సంబంధించిన వివిధ బృందాలు.. ఇప్పటికే బీఆర్‌కే భవన్‌ దాని పరిసర ప్రాంతాలను పరిశీలించాయి. అక్కడ తలెత్తే సమస్యలపై దృష్టి సారించాయి. భవన్‌ పరిసర ప్రాంతాల్లో పెట్టబోయే వివిధ రకాల ఆంక్షలను పోలీసులు ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. అటు జీహెచ్‌ఎమ్‌సీ గేటు వద్ద, ఇటు రిట్జ్‌ హోటల్‌ కిందా కళాంజలి సమీపంలోనూ, మధ్యలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ పక్కనే ఉన్న రోడ్లతోపాటు హోప్‌ హాస్పిటల్‌ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ కింద బీఆర్‌కే భవన్‌ వైపు వెళ్లే జంక్షన్లో కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి వాహన రాకపోకలను నిలువరించనున్నారు.

 

 

 

 

ఆ చుట్టుపక్కల ఉన్న రహదారులన్నింటినీ మూసేయాలని సర్కారుకు పోలీస్‌ అధికారులు నివేదించనున్నారు. శాఖలు బీఆర్‌కే భవన్‌కు తరలిపోతే పార్కింగ్‌ ఓ ప్రధాన సమస్యగా మారుతుంది. అందువల్ల ఆ భవన్‌లో కొన్ని, దాని ముందు రోడ్డుపై మరికొన్ని వాహనాలను పార్క్‌ చేసే వెసులుబాటు ఉంది. దీంతోపాటు పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఖాళీ స్థలాన్ని సైతం పార్కింగ్‌ కోసం ఉపయోగించుకునే విధంగా ట్రాఫిక్‌ అధికారులు ప్రభుత్వానికి సూచనలు చేయనున్నారు.

 

 

భవనం చుట్టు పక్కల ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, దాని చుట్టూ ఎలాంటి రక్షణ వలయం ఏర్పాటు చేయాలి, వీవీఐపీలకు ఏవిధమైన భద్రతా ఏర్పాట్లు చేయాలనే అంశాలను కూడా పోలీసుశాఖ తన నివేదికలో చేర్చనున్నట్టు సమాచారం. వివిధ విభాగాల్లో ఫైళ్లు, ఇతర సరంజామా ప్యాకింగ్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఐఏఎస్‌ ఆఫీసర్ల సంపూర్ణ సమాచారం నిక్షిప్తమై ఉండే కీలకమైన డోయిజర్‌ ఫైళ్లను జాగ్రత్తగా తరలించి, భద్రపరిచేందుకు కొత్త ప్రాంగణంలో ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఫైళ్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియంత్రణలో, సీ బ్లాక్‌, ఆరో అంతస్తులోని ఓ ప్రత్యేక గదిలో భద్రపరిచారు.

 

 

 

అదే సమయంలో బీఆర్‌కే భవన్‌లో ప్రస్తుతమున్న కార్యాలయాలను ఖాళీ చేసే ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకున్నది. భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న డేటా సెంటర్‌ మాత్రం అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. జీవోల జారీ మొదలు, వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్యమైన అప్లికేషన్ల వినియోగం వరకు, రోజువారి పరిపాలనకు అసౌకర్యం కలగకుండా ఉండేలా ఇకపై ఆ డేటా సెంటర్‌ను సచివాలయ అవసరాల కోసం వాడుకోనున్నారు. వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులతో సహా, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, డీఎస్‌లు ఇతర అధికారగణమంతా బీఆర్‌కే భవన్‌లోనే కొలువుదీరబోతున్నది.

 

 

 

 

ఇంకా ఏవైనా శాఖలు, విభాగాలు, సెక్షన్లు మిగిలితే వాటిని పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి తరలిస్తారు. ఇక ఐ అండ్‌ పీఆర్‌ ఆధ్వర్యంలోని పబ్లిసిటీ సెల్‌నూ, సీఎంఓలో భాగంగా ఉన్న సీపీఆర్‌ఓ కార్యాలయాన్ని కలిపి అక్కడే ఒక క్వార్టర్లో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. సీపీఆర్‌వో కోసం బీఆర్‌కే భవన్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్లో ఒక గదిని ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

 

 

 

వీటితోపాటు సెక్రటేరియట్లో ప్రస్తుతమున్న పోస్ట్‌ ఆఫీస్‌, రెండు బ్యాంకులు కూడా అక్కడికే తరలనున్నాయి. డిస్పెన్సరీని మాత్రం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రస్తుతం వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో పని చేస్తోన్న హెల్త్‌ సెంటర్‌కు తరలిస్తారు. సచివాలయం క్యాంటీన్‌ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కే మారనుంది. ఆదర్శనగర్‌లో మొన్నీ మధ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పగించిన 50 క్వార్టర్స్‌లో 25 భవనాలను ఇందుకోసమే కేటాయించనున్నారు.

 

 

 

వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని బీఆర్‌కే భవన్‌, ఎమ్మెల్యే క్వార్టర్స్‌, ఆ పరిసరాలను హై సెక్యూరిటీ జోన్‌ గా ప్రకటించి, ఆ ప్రాంతంలోని రహదారులపై వాహన రాకపోకలను అనుమతించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని పోలీస్‌ శాఖ ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఎస్పీఎఫ్‌, ఐఎస్‌డబ్ల్యూ, లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనున్నారు.

ఆకట్టుకొనే కధాంశంతో దొరసాని

Tags: Full security around BRK Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *