పుంగనూరులో సంక్రాంతి పండుగతో పల్లె సీమల్లో వినోదం
పుంగనూరు ముచ్చట్లు:
సంక్రాంతి సంబరాలకు పట్టణాల నుంచి ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాలకు తరలిరావడంతో పల్లెసీమాల్లో వినోదం వెల్లివిరిసింది. సోమవారం పట్టణంలో రంగవల్లులు, తదితర సామాగ్రీ విక్రయాలు ఊపందుకున్నాయి. వేకువజాము నుంచి ఇండ్ల ముందర గొబ్బెమ్మలు పెట్టి, పూజలు చేశారు. కనుమ నాడు పశువులకు పూజలు చేయడం అనవాయతీ. ఈ సందర్భంగా ప్రతి ఇంటా పశువులను నీటితో శుభ్రం చేసి, గంటలు, గజ్జలు, బెలూన్లు కట్టి ఊరేగింపు నిర్వహించారు. పశువులను తీసుకెళ్లి అక్కడ కాటమరాజు ఆలయాల వద్ద పూజలు చేసి, చిట్లాకుప్పలకు నిప్పు పెట్టి, పశువులను ప్రదక్షణ చేయించి, దిష్టిపరిహారం చేశారు. జంతుబలులు సమర్పించారు. ఇలా చేస్తే పశువులు వృద్ధి చెందుతుందని ప్రతీతి. మహిళలు గొబ్బెమ్మలతో ఇంటింటికి వెళ్లి గొబ్బియాళో…. అంటు పాటలు పాడి, యాచన చేశారు. అలాగే గంగిరెద్దులను తీసుకెళ్లి ప్రదర్శన చేశారు. ప్రతి ఇంటిలోను మహిళలు నూతన వస్త్రాలు ధరించి , రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను ఉంచి జానపద గీతాలు ఆలపించి , పితుకుపప్పు, దోసెలు, మాంసాహారాలతో కూడిన వంటలను చేసి బంధుమిత్రులతో విందుభోజనాలు ఆరగించారు. కాగా పడమటి నియోజకవర్గమైన పుంగనూరులో సంక్రాంతి పండుగను ఫిబ్రవరి నెల 10 వరకు గ్రామాల్లో విశేషంగా నిర్వహించడం అనవాయితీ.

Tags: Fun in rural areas with Sankranti festival in Punganur
