ఇళ్ల పట్టాలతో పాటు నిర్మాణానికి నిధులు

  -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
Date:13/04/2018
అమరావతి  ముచ్చట్లు:
ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఇకపై పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మాత్రమే పంపిణీ చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధిదారులుగా వారిని ఎంపిక చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల పేదలకు సొంతింటి కల నెరవేరడమే కాకుండా, అందరికీ ఆవాసం కల్పించాలన్న ప్రభుత్వ ఆశయం కూడా నెరవేరుతుందన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీటిడ్కో, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖాధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా రాష్ట్రంలో ఇంత వరకూ ఎన్ని పట్టాలు మంజూరు చేసిన విషయంపై సీసీఎల్ఏ కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ కు వివరించారు. రాష్ట్రంలో 2014 నుంచి నేటి వరకూ 3,45,853 ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. కొత్తగా ఇళ్ల స్థలాల పట్టాల కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతల నుంచి 19.82 లక్షల మందికి పైగా దరఖాస్తులు వసుకున్నారు. వారిలో 5,98,118 మంది అర్హులుగా గుర్తించినట్లు సీసీఎల్ఏ కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ తెలిపారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 2,99,246 మంది, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 2,98,872 మంది ఉన్నారన్నారు. తాజాగా 5,98,118 మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఎస్ కు ఆయన వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఇళ్ల స్థలాలకు కేవలం పట్టాలు మాత్రమే మంజూరు చేయడం వల్ల పేదలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలుగదన్నారు. పట్టాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ గృహ నిర్మాణ పథకాల కింద వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం ద్వారా పేదలకు పక్కా ఇళ్లు కట్టుకునే అవకాశం కలుగుతుందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో అందరికీ ఆవాసం కల్పించాలన్న ప్రభుత్వ ధ్యేయం నెరవేరడమే కాకుండా పేదలకు సొంతింటి కల నెరవేరుతుందన్నారు.అంతకుముందు విజయవాడ కార్పొరేషన్ లో 24 గంటలూ తాగునీటి కల్పన, జక్కంపూడి ఎకనామిక్ టౌన్ షిప్ నిర్మాణంపై ప్రగతిని సమీక్షా సమావేశంలో సీఎస్ దినేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. వృథాగా పోతున్న తాగునీటికి అడ్డుకట్టవేయాలని ఆదేశించారు. జక్కంపూడి ఎకనామిక్ టౌన్ షిప్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, వీఎంసీ కమిషనర్ నివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags:Funding for construction along with houses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *