Date:13/07/2020
హైద్రాబాద్ ముచ్చట్లు:
బన్సీలాల్పేటలో నాలుగేళ్ల క్రితం మూసేసిన శ్మశానాన్ని తిరిగి తెరవడం స్థానికంగా తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. ఈ ప్రభావంతో ఆ శ్మశానికి దగ్గరగా ఉండే అరుణ్ జ్యోతి అనే కాలనీ వాసులు తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. కొంత మంది ఇప్పటికే ఇళ్లను ఖాళీ చేయగా, మరికొంత మరోచోట ఇళ్ల కోసం వెతుకుతున్నట్లు కాలనీ సెక్రటరీ సుధీర్ వెల్లడించారు. జులై 8న ఈ కాలనీ పక్కనే ఉన్న శ్మశానంలో ఓ కరోనా రోగికి విద్యుత్ యంత్రం ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటి నుంచి కాలనీ వాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కాలనీ వాసులు మూకుమ్మడిగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.నిజానికి అరుణ్ జ్యోతి కాలనీలో ఈ విద్యుత్ ఆధారిత శ్మశానాన్ని నాలుగేళ్ల క్రితం నిర్మించారు. ఇది గాంధీ ఆస్పత్రికి కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే ఉంది. రోజుకు 50 వరకూ శవాలను విద్యుత్ ద్వారా దహనం చేయగల సామర్థ్యంతో ఈ శ్మశానాన్ని ఏర్పాటు చేశారు. తొలుత రోజూ వచ్చే మృత దేహాలను ఇక్కడ విద్యుత్ ద్వారా దహనం చేస్తుండగా కాలనీ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ దహన యంత్రం నుంచి బయటకు ఉండే చిమ్ని ద్వారా బూడిద అవశేషాలు గాలిలోకి ఎగురి తమ ఇళ్లపై పడుతున్నాయని, వాసన కూడా వస్తోందని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో శ్మశానాన్ని మూసేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ చొరవతో ఇది మూతపడింది.తాజాగా, కరోనా రోగుల మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు సులభంగా ఉంటుందని మూతబడ్డ ఈ శ్మశానాన్ని తెరిపించాలని వైద్యాధికారులు జీహెచ్ఎంసీని కోరారు. గాంధీకి అతి సమీపంలో ఉండడంతో కరోనా శవాలకు అంత్యక్రియల కోసం మళ్లీ దీన్ని తెరిచారు.పాడుబడ్డ శ్మశానంలో సిబ్బంది శుభ్రం చేస్తుండడాన్ని మేం కొన్ని వారాల క్రితం గుర్తించాం. కరోనా శవాలను ఇక్కడ దహనం చేస్తారేమో అని మాకు అనుమానం వచ్చింది. అనుకున్నట్లుగానే కొద్ది రోజుల క్రితం ఓ మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ విద్యుత్ యంత్రం ద్వారా దహనం చేశారు. దీంతో చిమ్ని నుంచి బూడిత, వాసన వంటి సమస్య మళ్లీ ఎదురైంది.’’ అని కాలనీ వాసి అయిన నర్సింగ్ వాపోయాడు.‘‘కరోనా వ్యాప్తి గురించి డబ్ల్యూహెచ్ఓ రోజుకో కొత్త విషయం చెబుతోంది. తాజాగా కొవిడ్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాలనీకి అతి సమీపంలో ఉన్న శ్మశానాన్ని ఎలా తెరుస్తారు?’’ అని శ్మశానానికి అతి సమీపంలో ఇల్లు ఉన్న వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.అయితే, కరోనా రోగి చనిపోయాక అతని శరీరంలో వైరస్ 6 గంటలు దాటి బతకదని డాక్టర్లు చెబుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మృత దేహాన్ని దహనం చేస్తే వైరస్ బతికే అవకాశమే ఉండదని వివరించారు. ఈ క్రమంలో స్థానికుల నుంచి శ్మశాన సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలనీ వాసులు మాత్రం శ్మశానాన్ని మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మళ్లీ నిలిచిపోనున్న బెంగళూర్ సర్వీసులు
Tags:Funeral for Corona corpses..Evacuated colony residents