జవాన్ కు అంత్యక్రియలు

అన్నమయ్య ముచ్చట్లు:


జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గావ్ వద్ద సైనికుల బస్సు నదిలో పడిపోయిన దుర్ఘటనలో మృతి చెందిన ఐటీబీపీ జవాన్ రాజశేఖర్ పార్థీవదేహం స్వస్థలానికి చేరింది. జై జవాన్, రాజశేఖర్ అమర్ రహే.. అంటూ స్థానికులు, విద్యార్థులు పూలవర్షం కురిపిస్తూ మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకొచ్చారు. ఐటీబీపీ అధికారులు అన్నమయ్య జిల్లా దేవపట్ల గ్రామంలో కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి సైన్యం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని జవాన్ రాజశేఖర్ భార్య పరిమళకు అభయమిచ్చారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ జవాన్ రాజశేఖర్ మృతదేహానికి నివాళులు అర్పించారు. సైనిక లాంఛనాలతో రాజశేఖర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జవాన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. దేవపట్ల గ్రామం నుంచి సంబెపల్లి వరకూ భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
అమర్‌నాథ్ యాత్రలో విధులు ముగించుకొని తిరిగొస్తుండగా.. సైనికులు ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా.. మరో 30 మంది గాయపడ్డారు. బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు.

 

Tags: Funeral for Jawan

Leave A Reply

Your email address will not be published.