ఎరువుల మోత (మెదక్)

Furrier of the fertilizer (Medak)

Furrier of the fertilizer (Medak)

Date:09/10/2018
మెదక్  ముచ్చట్లు:
సీజన్ ఆరంభంలోనే ఎరువుల ధరలు ఎగబాకాయి. డీఏపీ ధర బస్తాపై రూ.100, పొటాష్‌ ఏకంగా రూ.150 పెరిగింది. గత ఖరీఫ్‌ సీజన్‌లో రూ.800 గరిష్ఠ చిల్లర ధరగా ఉన్న పొటాష్‌ బస్తాను డిమాండ్‌ లేని కారణంగా అంతకు తక్కువ ధరకే విక్రయాలు జరగడం గమనార్హం. ప్రస్తుతం అది రూ.950లకు చేరింది. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు కూడా బస్తాపై రూ.70 నుంచి 150 వరకు పెరగటం తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటిలో రైతులు ఎక్కువగా వినియోగించే 20:20:0:13 బస్తాపై రూ.50, 14:35:14 బస్తాపై రూ.95, మరో ప్రధాన కాంప్లెక్స్‌ ఎరువు 10:26:26 బస్తాపై రూ.120 పెరిగింది. ఇలా యూరియా తప్ప మిగతా అన్నీ 7 నుంచి 18 శాతం వరకు పెరగటం పెట్టుబడి వ్యయంపై ప్రభావం చూపనుంది.
ఎరువుల తయారీలో వినియోగించే ముడి సరకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరగటంతోపాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
జిల్లాలో రాబోయే యాసంగి సీజన్‌లో 1,36,387 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ పంటల సాగు కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 31,701 టన్నుల యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్‌ ఎరువులను రైతులు వినియోగిస్తారని అంచనా. దీన్నిబట్టి చూస్తే పెరిగిన ధరల కారణంగా జిల్లాలో ఒక్క పొటాష్‌పైనే రూ కోటిన్నర, కాంప్లెక్స్‌పై మరో కోటి భారం పడుతుంది. ఈ రకంగా మొత్తం రూ.3 కోట్ల మేరకు అదనంగా వ్యయం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ విషయం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఓవైపు పెట్టుబడి వ్యయం అమాంతం పెరుగుతున్నా… రాబడులు మాత్రం రోజురోజుకూ కుదేలవుతున్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వేసిన మొక్కజొన్న పంట వర్షాభావంతో పాటు కత్తెర పురుగు దెబ్బకు తుడిచిపెట్టుకుపోయింది. ఈపంట దిగుబడులు 8 నుంచి 10 క్వింటాళ్లకు పరిమితమయ్యాయి. దీనికితోడు వానలు లేక పత్తి పంట సగటు దిగుబడి కూడా గణనీయంగా పడిపోయే పరిస్థితి ఉంది. పలు చోట్ల వరి పంట ఎండిపోతుంది. దీంతో వేల ఎకరాలలో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించటంలేదు. ఇలాంటి కష్టకాలంలో యాసంగి వైపు చూస్తున్న రైతులకు పెరిగిన ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం శనగ, కూరగాయలు సాగు చేయటానికి సిద్ధమౌతున్న రైతులపై తక్షణం ఈ ప్రభావం పడనుంది. సర్కారు స్పందించి ఎరువులపై రాయితీని ఇచ్చి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
Tags:Furrier of the fertilizer (Medak)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed