గాలికొదిలేశారు(మహబూబ్ నగర్)

Date;28/02/2020

గాలికొదిలేశారు (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్ముచ్చట్లు:

పాలమూరు బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే కాంప్లెక్స్‌ను ప్రస్తుతం రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు అధికారులు
గాలికొదిలేశారు. ఆ కాంప్లెక్స్‌లో అద్దె మాయాజాలంతో పాటు బినామీ బాగోతమూ వెలుగుచూసినా అటువైపు కన్నెత్తిచూడడం లేదు. అంతేకాదూ.. ఎనిమిది షాపులు ఇతరులకు విక్రయించినట్లు ఆరోపణలు వెలువెత్తి, కాంప్లెక్స్‌కు చెందిన ఓ వ్యక్తిపై ఆరు నెలల క్రితమే పోలీసు కేసు నమోదైనా ఒక్కసారి కూడా ఆరా తీసిన పాపాన పోలేదు. కాంప్లెక్స్‌లో జరుగుతోన్న అక్రమాల గురించి స్థానిక వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాష్ట్ర శాఖకు నివేదించినా ఇంత వరకు ఎలాంటి అధికారుల తీరుపై పుర ప్రజలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్‌ నిబంధనల ప్రకారం.. లీజు పొందిన పదకొండు నెలల తర్వాత సదరు లీజుదారుడు మళ్లీ రెన్యూవల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో అద్దె కూడా పదిశాతం పెంచాలి. అయితే ఈ నిబంధన కొన్నేళ్ల నుంచే అమలుకు నోచుకుంటోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాంప్లెక్సేతర దుకాణాల అద్దె రూ.15వేల పైనే ఉండడం.. వక్ఫ్‌ కాంప్లెక్స్‌లో మాత్రం గరిష్టంగా రూ. 10వేలు కూడా దాటకపోవడం గమనార్హం.  నిబంధనల ప్రకారం లీజుదారులెవరూ తమ దుకాణాలను సబ్‌ లీజుకు ఇవ్వకూడదు. అలా చేసిన వ్యక్తి లీజును రద్దు చేసే అధికారం వక్ఫ్‌ బోర్డు అధికారులకు ఉంది. కానీ స్థానిక కాంప్లెక్స్‌లో పలువురు తమ దుకాణాలను ఇతరులకు సబ్‌ లీజుకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సుమారు 300 దుకాణాలు సబ్‌ లీజుపై కొనసాగుతున్నట్లు సమాచారం.
కొందరు లీజుదారులు దుకాణాల నిర్వహణ భారమైనందున తమ వ్యాపారంలో మరొకరిని కలుపుకున్నామని.. సబ్‌ లీజుకు మాత్రం ఇవ్వలేదని సమాధానం చెబుతున్నారు. వాస్తవానికి లీజుదారులు తమ పేరిట మంజూరైన దుకాణాలను సబ్‌ లీజుకు ఇచ్చి వారి నుంచి ప్రతి నెల రూ. వేలల్లో వసూలు చేస్తున్నారు. అదే వక్ఫ్‌బోర్డుకు మాత్రం తాము వసూలు చేసిన దాంట్లో 30శాతం మాత్రమే అద్దె రూపంలో చెల్లిస్తున్నట్లు స్థానిక వక్ఫ్‌ అధికారులు గుర్తించారు.  క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపితేనే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అటు వైపు కన్నెత్తి చూడని అధికారుల తీరును అదునుగా చేసుకున్న ఓ వ్యక్తి తన పేరిట మంజూరైన ఎనిమిది షాపులను ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ముహమ్మద్‌ గౌస్‌ గతేడాది జనవరిలోనే సదరు వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సదరు వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇంత వరకు ఆ విచారణలో అడుగు ముందుకు పడలేదు. ఇంత జరిగినా రాష్ట్రస్థాయి అధికారులెవరూ ఈ అక్రమ వ్యవహారంపై విచారణ చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా జరుగుతోన్న అక్రమాల వెనక రాష్ట్రాధికారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓ పక్క సీఎం కేసీఆర్‌ వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయాలు  ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

 

Tags;Gallikodilesar (Mahabubnagar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *