ఇమ్రాన్ ను తలుచుకున్న గవాస్కర్ 

Gavaskar who understands Imran

Gavaskar who understands Imran

Date:18/08/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రధాన మంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ.. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అతడితో తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన ముగిశాక రిటైర్ కావాలని గవాస్కర్ భావించారట. ఇదే విషయాన్ని ఇమ్రాన్‌కు చెబితే.. ‘నువ్వు ఇప్పుడు రిటైర్ కాలేవు. వచ్చే ఏడాది పాకిస్థాన్ భారత్‌లో పర్యటించనుంది. భారత్‌ను భారత్‌లోనే ఓడించాలనుకుంటున్నాను. నువ్వు టీమిండియాలో ఉండకపోతే అంత మజా ఉండదు.
చివరిసారి ఇద్దరం ఒకరితో ఒకరం పోటీ పడదాం’ అని గవాస్కర్‌కు ఇమ్రాన్ ఛాలెంజ్ విసిరారు. దీంతో ఆయన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. 1986లో లండన్‌లోని ఇటాలియన్ రెస్టారెంట్లో భోజనం చేస్తున్న సమయంలో తమ మధ్య ఈ ప్రస్తావన వచ్చిందని గవాస్కర్ తెలిపారు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు ఆరంభంలోగా పాక్ పర్యటనను ప్రకటించకపోతే.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని ఇమ్రాన్‌కు చెప్పినట్టు గవాస్కర్ తెలిపారు.
కానీ వెంటనే పాక్‌ టూర్‌ను ప్రకటించారు. ఆ పర్యటనలో చివరి టెస్టును గెలవడం ద్వారా భారత గడ్డ మీద తొలిసారి టెస్టు సిరీసును పాక్ గెలుపొందింది. పాక్‌తో టెస్టు సిరీస్ తర్వాత లార్డ్స్‌లో జరిగిన ఎంసీసీ రెండో శతాబ్ది టెస్టులోనూ గవాస్కర్ ఆడారు. మర్లీబోన్ క్రికెట్ క్లబ్‌‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ తరఫున కపిల్, దిలీప్ వెంగ్‌సర్కార్, ఇమ్రాన్ ఖాన్, జావెద్ మియాందాద్‌ కూడా ఆడారు. ఆ టెస్టులో గవాస్కర్-ఇమ్రాన్ జోడి 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరం సరదాగా జోకులు వేసుకున్నామని, డ్రెసింగ్ రూంల ముచ్చట్లు చెప్పుకున్నామని గవాస్కర్ తెలిపారు. 1971 నుంచి తనకు మేం ఒకరికొకరం తెలుసని గవాస్కర్ తెలిపారు. సామాన్యుడిగా భారత్‌లో ఎక్కువసార్లు పర్యటించిన పాక్ ప్రధాని ఇమ్రానే అవుతారు. ఆయన భారత్‌లోని సంపన్నులతోనే కాదు, సామాన్యులైన ఫ్యాన్స్‌తోనూ అనుబంధం ఉంది. కాబట్టి ఇరు దేశాల మధ్య సంబంధాలను ఇమ్రాన్ పునరుద్ధరిస్తారని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని చెప్పిన గవాస్కర్.. తన మిత్రుడికి మాత్రం శుభాకాంక్షలు తెలిపారు.
Tags:Gavaskar who understands Imran

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *