గొంతెండుతోంది (విజయనగరం)

Giving (Vijayanagaram)

Giving (Vijayanagaram)

Date:13/10/2018
విజయనగరం ముచ్చట్లు:
విజయనగరంలో ఏ వీధి చూసినా తాగునీటికి అల్లాడుతున్న జనమే కనిపిస్తున్నారు. రోజు రోజుకూ ఇక్కడ నీటి సమస్య జటిటలమవుతోంది. పట్టణంలో దాదాపు రెండు లక్షల మందికి మంచినీరు అందడం గగనంగా మారింది.   ప్రస్తుతం పట్టణ ప్రజల అవసరాలకు రోజుకి 58 ఎంఎల్‌డీ నీరు అవసరమని అధికారిక అంచనా.  ముషిడిపల్లి, రామతీర్థం, నెల్లిమర్ల మూడు తాగునీటి పథకాల నుంచి కలిపి 19 ఎంఎల్‌డీకి మించి రావట్లేదు. దీనివల్ల ఇప్పటికే రోజు విడిచి రోజు మినహా   అందించలేకపోతున్నారు. మరోవైపు ప్రధానమైన ముషిడిపల్లి  పథకం ఊటబావులు తాటిపూడి రిజర్వాయరుకి దిగువన గోస్తనీ నదిలో ఉన్నాయి. తాటిపూడి నుంచి దిగువకు నీరు వదిలితే తప్ప(కనీసం లీకుల రూపంలోనైనా) ముషిడిపల్లి ద్వారా పట్టణానికి నీరొచ్చే దారిలేదు. మరోవైపు ఇసుకాసురుల కారణంగా ప్రాజెక్టు దిగువన ఇసుక రేణువైనా కనిపించని దుస్థితి.
దీనివల్ల నీరింకే దారిలేక ఏటా వేసవిలో లీకులు సైతం నిలిపేయడంతో పట్టణానికి ఎక్కిళ్లు తప్పట్లేదు.  తాటిపూడి 272 అడుగుల దిగువకు పడిపోయింది. వాస్తవానికి  స్పిల్‌వే ద్వారా 277 అడుగుల కంటే ఎక్కువ నీరుంటేనే దిగువకు వదలడానికి వీలుంటుంది. ప్రస్తుతం 272 అడుగుల కారణంగా కనీసం ఒక్క చుక్కైనా వచ్చే దారిలేదు. దీంతో జలాశయం నుంచి సైఫన్‌ పైపులు ఏర్పాటుచేసి మరీ నీటిని తోడి తాగునీటి పథకానికి ఇబ్బందులు రాకుండా తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే వాటితో నీరు లాగేస్తుంటే తమ వ్యవసాయానికి నీరుండట్లేదని రైతులు గొడవ చేస్తున్నారు.
ముషిడిపల్లి నుంచి నీరు ఆగిపోయి గత నెల 24 నుంచి 28వ తేదీ వరకూ నీటి సరఫరా లేక విజయనగరం పట్టణంలోని 24 వార్డుల్లో ఉన్న సుమారు 2 లక్షల మంది జనాభా తాగునీటి వెతలు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ కనిపిస్తుంది. ప్రస్తుతం ముషిడిపల్లిలో రోజురోజుకీ నీటి లభ్యత తగ్గిపోతుండడంతో పట్టణానికి తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది.  నాలుగైదు రోజులకోరైనా నీరివ్వడం సాధ్యపడేలా కనిపించట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కంటోన్మెంట్, కొత్త అగ్రహారం, బాలాజీనగర్‌, తోటపాలెం, కె.ఎల్‌.పురం, బీసీకాలనీ, అలకానంద కాలనీ, బొబ్బాదిపేట, అశోక్‌బంగ్లా దారి, అంబేద్కర్‌ కాలనీ, కలెక్టరేట్‌ రోడ్డు, కాంబోయి వీధి, రైల్వేస్టేషన్‌ రోడ్డు, రింగురోడ్డు, సాయినగర్‌, నటరాజ్‌కాలనీ, పువ్వాడ స్కూలు, పీఎస్‌ఆర్‌ కాలనీ, స్టేడియం కాలనీ, హుకుంపేట, లంకాపట్నం, పుచ్చలవీధి, పద్మావతి నగర్‌, వైష్ణవి వీధి తదితర ప్రాంతాల్లో తాగునీటి కోసం యుద్ధాలు తప్పేలా కనిపించట్లేదు. పురపాలికకు ప్రస్తుతమున్న రెండు ట్యాంకర్లతో పాటు ఇప్పటికప్పుడు మరో నాలుగు ట్యాంకర్లను కొనుగోలు చేసి నెల్లిమర్ల నుంచి నీటిని వీధులకు పంపిస్తామని అధికారులు చెబుతున్నా ఆచరణలో అది సాధ్యపడే విషయం కాదు.
మరోవైపు తాటిపూడి నుంచి ఒక్క విశాఖపట్టణానికే నిత్యం 11 మిలియన్‌ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుంది. సదరు నీటిని 600 మి.మీ. చుట్టుకొలత ఉన్న పైపులైను ద్వారా కృష్ణాపురం హెడ్‌ వాటర్‌ వర్క్స్‌కి తరలించి పరిశ్రమలకూ(విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకే కాదు) అమ్ముకుంటున్నారు. వారి నుంచి విజయనగరానికి నీరు కొనుగోలు చేయాలన్నా అది అత్యంత ఖర్చుతో కూడుకున్న పనే..
 తాటిపూడి జలాశయాన్ని 1965-1968 మధ్య కాలంలో 3.32 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దాంట్లో విశాఖ నీటి అవసరాలకు 0.68 టీఎంసీ, సాగునీటి కోసం 1.84 టీఎంసీ నీరు అధికారికంగా వెళుతుంది. అంటే 2.52 టీఎంసీల నీరు అక్కడకి పంపిణీ కాగా ఇంకా 0.8 టీఎంసీల నీరు ఉండేది. దాదాపు దశాబ్ద కాలంగా విజయనగర పట్టణానికి తాగునీటి వెతలు ఎదురవుతున్నాయి. ఏటా లీకులు వదలమని బతిమలాడుకోవడమే తప్ప కనీసం సదరు నీటిలో 0.2 టీఎంసీయో, 0.3 టీఎంసీయో నీటిని తాగునీటి కోసం ఇవ్వమంటూ ప్రభుత్వానికి విన్నవించి అధికారిక ముద్ర వేయించలేకపోయారు.
విచిత్రమేమిటంటే సరిగ్గా ఆరు నెలల క్రితమే అధికారిక ఉత్తర్వులు తెచ్చుకుని ఎస్‌.కోటకు 0.3 టీఎంసీల నీటిని తీసుకెళుతున్నారు. శృంగవరపుకోటకి ఇచ్చినపుడు విజయనగరానికి ఎందుకివ్వలేదు అంటే కచ్చితంగా అది విజయనగరం నేతల నిర్లిప్తతే కారణమని స్పష్టంగా చెప్పొచ్చు. అమృత్‌ పథకంలో భాగంగా రూ.19 కోట్లతో రామతీర్థం, నెల్లిమర్లల్లో కొత్తగా నిర్మిస్తున్న పథకం ద్వారా మరో 10 ఎంఎల్‌డీ నీటి కోసం పనులు సాగుతున్నా అదీ సరిపోదు. పైగా దానికి మరో ఏడాది వరకూ సమయం పట్టొచ్చు.
Tags:Giving (Vijayanagaram)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *