Natyam ad

వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు

– మార్చి 5న స్వర్ణ రథోత్సవం

 

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమ‌వారం రాత్రి 7 గంటలకు జరుగనున్న శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్‌ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.గోదా కల్యాణయాత్ర పేరిట నిర్వహించిన ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్ర శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. ఆలయం నుండి ఎస్వీ గోసంరక్షణశాల, తాటితోపు, పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది.భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నాయి.

 

 

Post Midle

రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి అలంకరించనున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీమతి శాంతి పాల్గొన్నారు.

మార్చి 5న స్వర్ణ రథోత్సవం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన మంగ‌ళ‌వారం స్వర్ణ రథోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు స్వర్ణ రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు గజవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

 

Tags:Glorious garland procession of Andal Amma

Post Midle