నత్తకే నడకలు 

Date:14/09/2018
నెల్లూరు ముచ్చట్లు:
సంగం బ్యారేజీ పనులు నత్తకే నడకలు నేర్పుతున్నాయి. సంగం బ్యారేజిని తొలుత రూ.122.5 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వానికి కాంట్రాక్ట్ సంస్థకు మధ్య ఒప్పందం జరిగింది. కేవలం 846 మీటర్ల పొడవున బ్యారేజి నిర్మాణం, 60 గేట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్యారేజి నిర్మాణ స్థలంలో పెన్నానది 1,400 మీటర్ల వెడల్పుతో ఉంది. ఇక్కడ 846 మీటర్ల వెడల్పుతో మాత్రమే కాంక్రీట్‌ నిర్మాణం, మిగిలిన 554 మీటర్ల మేర మట్టికట్ట నిర్మించాలనే ప్రతిపాదన జరిగింది.
ఐతే పలువురు నిపుణుల బృందాలు పరిశీలించిన తరువాత ఇక్కడ బ్యారేజి నిర్మాణాన్ని 1195 మీటర్ల మేర కాంక్రీట్‌ నిర్మాణం, మిగిలిన 205 మీటర్ల మేర మట్టిగట్లు నిర్మించాలని ఖరారు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం 2016లో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అందుకు అనుగుణంగా బ్యారేజి నిర్మాణంలో పెరిగిన పనులకు నిధుల మంజూరుకు ఇంతవరకు  ఆమోదం లభించలేదు. దీంతో ప్రస్తుతం నిర్మాణ పనులు ఏ క్షణంలోనైనా ఆగిపోయే ప్రమాదం ఉంది.
ఇప్పటి వరకు కాంట్రాక్టర్ కు ఇక్కడ పాత  ఒప్పందం ప్రకారం మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు. రూ.122.5 కోట్ల ఒప్పందం ప్రకారం ప్రస్తుతం కాంట్రాక్టర్ కు ఇప్పటి వరకు రూ.97.93 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులకు మరో రూ.10 కోట్ల చెల్లింపులు జరుగుతాయి. ఇక్కడి నుంచి గుత్తేదారుకు చెల్లింపులు జరిగే అవకాశం లేదు. అప్పుడు ఇక పనులు సాగే అవకాశం ఉండదు.
బ్యారేజి నిర్మాణ పనులు పూర్తికావాలంటే ప్రస్తుతం అత్యవసరంగా రూ.75 కోట్ల మేర నిధులు అవసరం. ఈ నిధులు మంజూరయితే పనులు పూర్తవుతాయి. ఇందులో రూ.50 కోట్ల మేర బ్యారేజిలో గేట్ల తయారీకే వ్యయం అవుతాయి. ఈ నిధులు వెంటనే మంజూరు చేయకపోతే పనులు గాడిన పడవు. పాత ఒప్పందం ప్రకారం 1.36 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పనులు జరగాల్సి ఉంటే ఇప్పుడు పెరిగిన పనుల కారణంగా 1.88 లక్షల ఘనపు మీటర్లకు పెరిగింది.
2,650 టన్నుల ఇనుము బదులుగా 6,230 టన్నులకు పెరిగింది. 60 గేట్ల బదులుగా 85 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. 14 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో జడ్‌షీట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటే, అది 20,870 చదరపు మీటర్లకు పెరిగింది. 846 మీటర్ల పొడవునా ఊటనీటిని వెలుపలకు తరలించాల్సి ఉంటే ఇప్పుడు అది 1,195 మీటర్లకు పెరిగింది.
బ్యారేజిలో మొత్తం 85 గేట్ల ఏర్పాటు జరగాలి. ఇందుకు 4,100 టన్నుల ఉక్కు అవసరం అవుతుంది. సుమారు రూ.50 కోట్ల వ్యయం అవుతుంది. ఆ పని జరగడం లేదు. ఇప్పటికిప్పుడు గేట్ల తయారీ పనులు ప్రారంభించినా, ఆ పనులు, బ్యారేజిలో గేట్ల అమరిక పూర్తికావాలంటే సుమారు నాలుగు నెలల సమయం పడుతుంది.. ఇప్పుడు ఆ పనులు ప్రారంభమే కాలేదు. కేవలం 60 గేట్లకు చెందిన విడిభాగాలు తయారయ్యాయి.
వీటిని మాత్రం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. సంగం బ్యారేజి ఎడమ వైపు సంయుక్త రెగ్యులేటర్ నిర్మాణ పనులు పునాదులకే పరిమితమై ఉన్నాయి. ఈ రెగ్యులేటరు నుంచి కనిగిరి జలాశయానికి, పాపిరెడ్డికాలువకు సాగునీటి సరఫరా జరగాలి. ఈ పనుల్లో వేగం పెరగాలి. ఇందుకు ప్రకృతి సహకరించాలి. సంగం ఆనకట్ట ఎగువ భాగంలో బీరాపేరు, బొగ్గేరు వాగుల పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు వస్తే ఇక్కడ పనులకు అంతరాయం ఏర్పడే ప్రమాదముంది.
Tags:Go for walks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *