ఏపీకి వెళ్లిపోవాలి..తెలంగాణ సీఎస్ కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. ఆయనను ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులపై ఆయన క్యాట్‌ను ఆశ్రయించడంతో తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులతో అప్పటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే కొనసాగుతున్నారు.అయితే, సోమేశ్ కుమార్ విషయంలో క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని కేంద్రం 2017లో హైకోర్ట్ కు వెళ్లింది. చివరకు క్యాట్ ఉత్తర్వులను కొట్టేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ నందాతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. హైకోర్ట్ తీర్పు 3 వారాల పాటు అమలు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సోమేశ్ కుమార్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ధర్మాసనం అందుకు నిరాకరించింది. సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ అందగానే ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. సోమేష్ కుమార్ ను తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ అంగీకారంతో డిప్యూటేషన్‌పై రప్పించుకోవాలని అప్పట్లో కేంద్రం సూచించింది. హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ సోమేశ్ కుమార్ సుప్రీం కోర్టు ను ఆశ్రయించునున్నట్లు సమాచారం.
Tags: Go to AP.. High Court order to Telangana CS

