నాలాకు చెల్లు..దృష్టి పెడితే ఖజానా నిండు!

Date:12/4/2018
నల్గొండ ముచ్చట్లు :
నల్గొండ జిల్లాలో సాగు భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించడం ఎక్కువగానే ఉంది. నల్గొండ, మిర్యాలగూడ పట్టణాలతో పాటు కొన్ని మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు. రెవెన్యూ పంచాయతీల అనుమతి తీసుకోకుండానే వ్యవసాయ భూముల్లో ఇతర కార్యకలాపాలు సాగిస్తున్నారని అంటున్నారు. ఇటీవల సాగించిన భూ ప్రక్షాళన కార్యక్రమంలోనూ ఈ విషయం వెలుగుచూసింది. పలువురు నాలా చెల్లించలేదని అధికారులు గుర్తించారు. దీంతో ఈ విషయమై దృష్టి పెడితే రెవెన్యూ విభాగానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అంతా అంటున్నారు. సాగుభూమిని స్థిరాస్తి వ్యాపారం, పరిశ్రమలు, ఇళ్లు లేక ఏ ఇతర పనికి వినియోగించినా ఆ భూమిని మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుంది.. దీని కోసం రెవెన్యూకు నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసిస్‌మెంట్‌ (నాలా) టాక్స్‌ చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌ విలువలో మూడు శాతం డీడీ తీసి ఆర్డీవోకు ఇవ్వాలి. అయితే నల్గొండ ప్రాంతంలో ఈ తరహా పన్ను సంబంధిత అధికారులకు అందడంలేదు. వేల ఎకరాల్లో ప్లాట్ల దందా కొనసాగుతున్న స్థిరాస్తి వ్యాపారులు నాలా చెల్లించడం లేదని సమాచారం. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంతా స్పష్టంచేస్తున్నారు.
భూ ప్రక్షాళన సర్వేలో జిల్లాలో వ్యవసాయేతర భూమి మూడు లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ భూమి పహాణీలో వ్యవసాయ భూమిగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అక్కడ స్థిరాస్తి వ్యాపారం, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ భూముల హక్కుదారులు నాలా ఎగవేసినట్లు తెలుసుకున్నారు. ఇదిలాఉంటే మరికొన్ని చోట్ల భూమి వృథాగా ఉన్నట్లు బయటపడింది. ఈ భూమిని వ్యవసాయేతరగా గుర్తించారు. దీనికి పెట్టుబడి సాయం వర్తించదు. జిల్లాలో వ్యసాయేతర భూమిలో పట్టా భూమి ద్వారా ఆదాయం బాగానే సమకూరుతుంది. ప్రభుత్వ భూములు సైతం వ్యవసాయేతర వినియోగంలో ఉంది. అయితే దీనిలో వృథాగా ఉన్న భూమి, చెరువులు, కుంటలు, కాలువలు ఇతర నిర్మాణాలకు ఉపయోగించిందే ఎక్కువగా ఉంది. కొందరు ప్రభుత్వ అసైన్డ్‌ భూముల్లోనూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో జరిమానా పేరిట పన్ను వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి పన్ను వసూలు కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచిస్తున్నారు.
Tags:Go to the end of the treasury!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *