చివరి వరకు వెళ్లొచ్చేశారు

 Date:19/10/2018

తిరువనంతపురం ముచ్చట్లు
శబరిమలలో అడుగుపెట్టడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు మహిళల ప్రయత్నం సైతం విఫలమైంది. శుక్రవారం దాదాపు 300 మంది పోలీసుల భద్రత నడుమ హైదరాబాద్‌కు చెందిన మహిళ జర్నలిస్ట్ కవిత, కేరళ మహిళ రేష్మా శబరిమలకు చేరుకున్నారు. అయితే, వీరు మరో 10 నిమిషాల్లో స్వామిని దర్శించుకుంటారనగా, అయ్యప్ప సన్నిధానానికి కేవలం 200 మీటర్ల దూరంలో వేలాది మంది భక్తులు అడ్డుకున్నారు. సుమారు 20 వేల మంది భక్తులు వారికి అడ్డుగా నిలబడ్డారు. ఇదే సమయంలో వారికి రక్షణగా వచ్చిన ఐజీ శ్రీజిత్ మాట్లాడుతూ.. భక్తుల మనోభావాల విషయంలో తానేమీ చేయలేనని, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను తాను పాటించాల్సివుందని, దయచేసి అడ్డుతొలగాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.
అలాగే తమను అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని ఐజీ శ్రీజిత్ హెచ్చరించగా, తమను చంపి లోనికి ప్రవేశించమంటూ భక్తులు ఎదురుతిరిగారు. దీంతో అంతవరకూ రక్షణగా వచ్చిన పోలీసులు, ఇద్దరు యువతులనూ శబరిమలలోని పోలీసు కార్యాలయానికి తరలించారు. దీంతో ఏం చేయాలో పాలుపోక మహిళలకు రక్షణ కల్పిస్తూనే ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశారు. ఆందోళనకారులతో పోలీసులు జరిపిన చర్చలు కూడా ఫలించలేదు. మహిళలను వెనక్కు పంపాలని అధికారుల ఆదేశించిడంతో భద్రత నడుమ పంబకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. వేలాది మంది నిరసనల నడుమ తాము ఆలయానికి చేర్చలేమని ఇద్దరు యువతులకూ ఐజీ పేర్కొనగా, అయ్యప్ప దర్శనం చేయించాలని వారిద్దరూ పట్టుబడినట్టు సమాచారం.
మరోవైపు మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే ఆలయాన్ని మూసివేస్తామని పూజారులు హెచ్చరించడంతో పోలీసులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పదునెట్టాంబడిపై ఆలయ పూజార్లు బైఠాయించి, మంత్రోచ్ఛారణ చేస్తూ, చప్పట్లు కొడుతూ మహిళలను రావద్దంటూ నిరసన తెలిపారు. ఒకవేళ రావడానికి ప్రయత్నిస్తే ఆలయంలో కార్యక్రమాలు నిలిపివేసి, మూసివేస్తామని హెచ్చరించారు. ఆ మహిళలకు పోలీసులు నచ్చజెప్పడంతో వెనక్కు వెళ్లేందుకు అంగీకరించారు.
Tags:Go to the end

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *