స్వచ్ఛ భారత్ నిధుల్లో గోల్ మాల్

వరంగల్ ముచ్చట్లు:


నర్సంపేట మునిసిపాలిటీలో నిధుల వినియోగంలో గోల్‌మాల్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. 2014 నుంచి 2022 వరకు స్వచ్చ భారత్ కింద మంజూరైన నిధులు దుర్వినియోగం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. స్వచ్ఛ భార‌త్ నిధుల‌తో జ‌రిగిన పారిశుధ్య సామగ్రి కొనుగోళ్లు, ప‌నుల్లో అక్రమాలు జ‌రిగిన‌ట్లుగా విశ్వస‌నీయంగా తెలిసింది. ఈ మేర‌కు కొన్ని ప‌నుల‌ను నామమాత్రంగా కొన‌సాగించి రికార్డుల్లో అధిక వ్యయాల‌ను న‌మోదు చేసిన‌ట్లుగా కూడా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవ‌హారంలో మునిసిపాలిటీలో కీల‌క హోదాలో ఉన్న అధికారే న‌డిపిన‌ట్లుగా స‌మాచారం. స‌ద‌రు అధికారి క‌నుస‌న్నల్లోనే నిధుల వ్యయంలో తీవ్ర అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి .

 

 

2014 – 2022 వరకు స్వచ్ఛ భారత్ ప‌థ‌కం కింద న‌ర్సంపేట మునిసిపాలిటీకి రూ. 4కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటిలో రూ.3 కోట్ల 47లక్షలు ఖర్చయినట్లు రికార్డుల్లో నమోదైంది. మిగిలిన మొత్తం ఖర్చు చేయ‌కుండా మునిసిపాలిటీ ఖాతాలోనే ఉండిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. రూ.3.47కోట్ల నిధుల‌తో న‌ర్సంపేట పట్టణంలో ప‌చ్చద‌నం, పారిశుధ్యం పెంపొందించేందుకు జ‌రిగిన అభివృద్ధి, సామ‌గ్రి కొనుగోళ్లు ఎంత అన్నది కూడా మునిసిపాలిటీ అధికారులు వెల్లడించ‌కుండా గోప్యంగా ఉంచుతుండ‌టం ఈ అనుమానాల‌ను మ‌రింత పెంచుతోంది. వాస్తవానికి పట్టణంలోని కాలనీల్లో పారిశుద్యం ప్రధాన ఎజెండాగా పనులు చేపట్టాల్సి ఉంది. ఆరుబయట చెత్త వేయడం, ఆరు బయట మల, మూత్ర విసర్జన, తడి- పొడి చెత్తను వేరు చేయడం, డ్రైనేజీ సమస్యలు ప్రధానంగా ఉంటాయి.ఈ నిధులతో చెత్త తరలించడానికి ట్రాక్టర్లు, సైకిళ్ళు, ట్రాలీలు, మున్సిపాలిటీ సిబ్బందికి అవసరమైన శుభ్రతకు ఉపయోగించే పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా కాలనీల్లోని తడి, పొడి చెత్తను వేరు చేసేలా సిబ్బందిని, సరిపడా వాహనాలను సమకూర్చాల్సి ఉంటుంది.

 

 

 

కానీ న‌ర్సంపేట మునిసిపాలిటీకి మంజూరైన నిధులు ఖ‌ర్చయిపోయిన‌ట్లు అధికారుల రికార్డుల్లో రాసేసినా.. ఈ నిధుల వ్యయంతో చేప‌ట్టిన ప‌నులు, సామ‌గ్రి క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మున్సిపల్ కార్యాలయంలోని ఓ ముఖ్య అధికారిపై ఉన్నతాధికారుల‌కు ఫిర్యాదులు వెళ్లినా ప్రజాప్రతినిధి సహకారంతో చర్యల నుంచి త‌ప్పించుకుంటున్నట్లు స‌మాచారం.పట్టణాల్లోని చెత్త ప్రక్షాళన లక్ష్యంగా స్వచ్ఛ భారత్ 2అక్టోబర్, 2014 న మొదలైంది. నాటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తూ వస్తోంది. నర్సంపేట పట్టణంలోని కాలనీల్లో పారిశుధ్యం మెరుగుపడలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితులున్నాయి. కోట్ల ప్రజాధనం ప్రభుత్వాలు వెచ్చిస్తున్నా ఆ ఫలాలు సామాన్య ప్రజలకు చేరడం లేదు. ఒకప్పుడు ఉన్న మురికి కాలువలే ఇప్పుడూ ఉన్నాయి. అదే దుర్గంధం, అదే మురికి నీరు. మౌలిక సౌకర్యాల కల్పన దేవుడెరుగు కనీసం పారిశుద్యం పట్ల కనీస శ్రద్ధ లేకపోవడం ఏంటని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ భార‌త్ నిధుల వినియోగంపై మునిసిప‌ల్ అండ్ అడ్మిస్ట్రేష‌న్ అధికారులు క్షేత్రస్థాయిలో విచార‌ణ జ‌రిపితే అక్రమాలపై స్పష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని న‌ర్సంపేట ప‌ట్టణ వాసులు పేర్కొంటున్నారు. స్వచ్ఛ భారత్ నిధుల్లో గోల్ మాల్ జరిగాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్ వెంకట స్వామిని వివరణ కోరగా.. నేను మొదటి నుండి లేనన్నారు. ఇటీవలే వచ్చానని పూర్తి వివరాలు తెలియదన్నారు. అకౌంట్ సెక్షన్‌లో వివరాలు ఉంటాయన్నారు. ఈ రోజు ఆ సెక్షన్ వాళ్లు అందుబాటులో లేరని, మరోరోజు వస్తే చూసి చెప్తామన్నారు.

 

Tags: Goal Mall in Swachh Bharat Fund

Leave A Reply

Your email address will not be published.