గోదావరి ఉగ్రరూపం…అప్రమత్తమైన యంత్రాంగం

-అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలు అధికారుల హెచ్చరిక
Date:17/08/2018
భూపాలపల్లి ముచ్చట్లు:
మ‌హ‌దేవ్‌పూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ ఆమయ్ కుమార్ఆర్డీవో వీరబ్రహ్మచారిఇరిగేషన్ అధికారులు ప‌రిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ గోదావరి నీటిమట్టం10 మీటర్లకు చేరుకున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు కాజువేల మీదుగా ప్ర‌వ‌హిస్తున్నాయి.
దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాజువేల వద్ద భ‌ద్ర‌త‌ను పెంచారు. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం జిల్లెలవాగు కాజువే వద్ద ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేశారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణ‌హిత న‌ది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పడవ ప్రయణాలను పోలీస్ అధికారులు నిలిపివేశారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వ‌స్తోన్న వరదను జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ప‌రిశీలించారు. ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 47.3 అడుగుల స్థాయి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
గత రాత్రి 11.20 నిమిషాలకు 43 అడుగులు దాటడంతో భద్రాచలం సబ్‌కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 47.3 అడుగులు ఉన్న నీటి మట్టం 48 అడుగులకు దాటితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద నీరు భారీగా రావడంతో భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు విద్యుత్‌ స్తంభాలు వరద నీటిలో మునిగి పోయాయి.
దుమ్ముగూడెం మండలం తూరుబాక రోడ్డుపైకి వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి. దిగువ ప్రాంతంలోని శబరీ నది పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. దిగువన ఉన్న వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాలకు రాక పోకలు స్తంభించాయి. భద్రాచలంలోని లోతట్టు ప్రాంతమైన అశోక్‌నగర్‌ కొత్తకాలనీలోనికి వరద నీరు చేరాయి.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు వరద ప్రభావంపై తెలపాలని సబ్‌ కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా సూచించారు.
Tags;Godavari agitation … the alarmed mechanism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *