కరీంనగర్ ముచ్చట్లు:
రోజుకో రకంగా జనాలను మాయ చేసి మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కేటుగాళ్లు. వారి ప్లాన్‌కు తగ్గట్టుగానే ఎప్పుడూ ఎవరో ఒకరు బకరా అవుతున్నారు. తాజాగా సగం ధరకే బంగారం ఇచ్చేస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తూ ఓ బెంగళూరు గ్యాంగ్ బురిడీ కొట్టిస్తోంది. ఈ వ్యవహారం జగిత్యాలలో బయటపడింది. 82960 09383, 88670 24793 ఈ ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకోండి.. ఇల్లు కడుతుండగా బంగారం దొరికిందని, సగం రేటుకే దాన్ని ఇచ్చేస్తున్నామని అంటూ జనాలకు ఫోన్ చేసి వల వేస్తోంది బెంగళూరుకు చెందిన ఓ గ్యాంగ్. అందినకాడికి దోచుకునేందుకు పక్కా ప్లాన్ వేసిన ఆ గ్యాంగ్.. జనాన్ని నమ్మించేందుకు కొన్ని బంగారం ఫొటోలను వాట్సాప్‌లో కూడా పంపిస్తోంది.జగిత్యాల జిల్లా జాబితాపూర్, హబ్సీపూర్, కల్లెడ, అనంతారం, ధర్మారం, లక్ష్మీపూర్ గ్రామాలలో చాలామందికి ఇలా ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయట. డబ్బు తీసుకుని బెంగళూరుకు వస్తే బంగారం ఇచ్చేస్తామంటూ మాయమాటలు చెప్తున్నారు. ఇప్పుడా ప్రాంతంలో ఇదే హాట్ టాపిక్. అయితే, వారిని ఇక్కడికి రప్పించాలనే ఉద్దేశంతో కొందరు యువకులు హైదరాబాద్ వస్తే అక్కడే బంగారం కొనుక్కుంటామని చెప్పగా, లేదు.. కర్ణాటకే రావాలని పట్టుబడుతున్నారు గ్యాంగ్ సభ్యులు. జనాలు మోసపోకుండా, పోలీసులు వెంటనే ఆ గ్యాంగ్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.10 నెలల క్రితం జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి ఇలాగే రూ. 9లక్షలు మోసపోయాడు. సగం రేటుకే బంగారం ఇస్తామని న్మమించడంతో పాటు వాట్సాప్‌లోనూ ఫొటోలు పంపించారు. వారి వలలో పడ్డ ఆ వ్యక్తి ఏపీ లోని కడప దాకా వెళ్లాడు. కర్ణాటక నుంచి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు ముందుగా ఓ తులం దాకా ఉన్న ఒరిజినల్ బంగారం బిల్ల ఇచ్చి నమ్మించారు. దాన్ని టెస్ట్ చేసి అసలైన బంగారమే అని తేలడంతో సదురు వ్యక్తి పూర్తిగా వారి బుట్టలో పడ్డాడు. ఇంకేముంది, వారు అడిగినట్టు తన దగ్గరున్న రూ. 9 లక్షలు ముట్టజెప్పాడు. తీరా ఇంటికొచ్చి చూస్తే అరకిలో నకిలీ బంగారాన్ని చేతిలో పెట్టారని తెలుసుకుని లబోదిబో అన్నాడు. ఇప్పుడూ సరిగ్గా అదే తరహా మోసానికి కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Tags: Gold at half price.