Natyam ad

సత్ఫలితాలనిస్తున్న డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్లు

కరీంనగర్ ముచ్చట్లు:
 
స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో భాగంగా నగరంలో మూడు చోట్ల ఏర్పాటు చేసిన డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్లు  సత్ఫలితాలనిస్తున్నాయి. డంప్‌యార్డులకు చెత్త తగ్గడంతోపాటు ఎందుకూ పనికి రాదనుకునే వ్యర్థాలతో వ్యాపారానికి బాటలు పడ్డాయి. రీసైక్లింగ్‌కు ఉపయోగపడే వస్తువులను ఐటీసీ కంపెనీ కొనుగోలు చేస్తుండగా, డీఆర్‌సీసీల నిర్వహణతో మహిళా సంఘాలకు ఉపాధి దొరకడంతోపాటు మంచి ఆదాయం వస్తున్నది. ఇదే సమయంలో చెత్తను తీసుకొచ్చే రిక్షా కార్మికులకు రోజువారీగా వంద నుంచి 150 వరకు సమకూరుతున్నది. మొత్తంగా వ్యర్థంలోంచే సరికొత్త అర్థం పుట్టగా, బల్దియా యంత్రాంగా మరో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో మెరుగైన ర్యాంకు కోసం నగరపాలక అధికారులు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సారి సర్వేక్షన్‌లో 50లోపు ర్యాంకు సాధించాలన్న లక్ష్యంతో నెల రోజుల నుంచి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో తడి, పోడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు వీలుగా ఇంటింటికీ చెత్త బుట్టలను పంపిణీ చేశారు. వీటితోపాటు తడి చెత్త ద్వారా వర్మి కంపోస్టు తయారు చేస్తుండగా, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఐటీసీ సంస్థతో బల్దియా ఒప్పందాలు చేసుకున్నది. ఇందులో భాగంగా పొడి చెత్తలో వివిధ వస్తువులను వేరు చేసేందుకు ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో పొడి వనరుల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా పొడి చెత్తలో రీసైక్లింగ్ వస్తువులు తగ్గడంతోపాటు డంప్‌యార్డుకు తక్కువ స్థాయిలో చెత్త చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పొడి చెత్తను వేరు చేసేందుకు ఇప్పటికే నగరంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం మంకమ్మతోట, కిసాన్‌నగర్, మున్సిపల్ కార్యాలయ ఆవరణ వద్ద ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటితోపాటు సప్తగిరికాలనీలో ఒక కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, మరో ఐదింటి ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
 
 
 
ఏర్పాటైన డీఆర్‌సీసీ కేంద్రాలకు చుట్టూ ఉన్న డివిజన్ల నుంచి రిక్షా కార్మికులు పొడి చెత్తను తీసుకొసుస్తున్నారు. కార్మికులు తీసుకొచ్చే పొడి చెత్తను తూకం వేసి ఆయా వస్తువుల కేటగీరి వారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. వీటి ద్వారా సదరు రిక్షా కార్మికులకు రోజుకు వంద నుంచి 150 వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం చిక్కుతుంది. డీఆర్‌సీసీ కేంద్రాల ఏర్పాటుకు మొదటగా ఆయా డివిజన్లల్లోని మహిళా సంఘాలకు నగరపాలక అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని ద్వారా మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే ఈ చెత్త సేకరణపై ఆసక్తి ఉన్న వారికి ఐటీసీ కంపెనీ ద్వారా అవగహన సదస్సులు నిర్వహించారు. రిక్షా కార్మికులు అందించే పొడి చెత్తలోంచి ఆయా వస్తువులను వేరు చేసి సంచుల్లో భద్రపర్చుకోవాలి. రీసైక్లింగ్‌కు ఉపయోగపడే పొడి చెత్తను ఐటీసీ కంపెనీ కొనుగోలు చేస్తుంది. దాదాపు అన్నింటినీ ఐటీసీ కంపెనీ ఈ కేంద్రాల నుంచి కొంటుంది. దీని వల్ల మహిళా సంఘాల్లోని సభ్యులకు ఆదాయం సమకూరుతుంది. డీఆర్‌సీసీ కేంద్రాల నిర్వహణ వ్యయాలను ఆ సంఘాలే భరించాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం నడుస్తున్న కేంద్రాల్లో సుమారుగా రోజుకు 2వేల నుంచి 6వేల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ లెక్కన ఒక్కో కేంద్రానికి నెలవారీగా భారీ ఆదాయం వచ్చే అవకాశమున్నది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కేంద్రాల వల్ల ఆయా మహిళా సంఘాల సభ్యులకు, రిక్షా కార్మికులకు సైతం ఆదాయం వస్తుండడంతో మరిన్ని కేంద్రాలపై దృష్టి సారించినట్లు అధికారులు చెప్పుతున్నారు. వారికి ఆదాయంతోపాటుగా డంప్‌యార్డుకు వెళ్లే చెత్త కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Good Dry Resource Collection Centers