గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా!
– తెలంగాణా గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు
చెన్నై ముచ్చట్లు:
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వివాదం సుప్రీంకోర్టుకి చేరింది. కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది ఇఖజయ సుకిన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని తెలంగాణ నూతన సచివాలయ అంశంతో ముడిపెడుతూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె చెన్నైలో మాట్లాడారు.తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని కట్టిందని.. దాని ప్రారంభోత్సవానికి కనీసం తనకు ఆహ్వానం కూడా అందలేదని తమిళి సై సౌందర రాజన్ గుర్తు చేశారు. కొత్త పార్లమెంటును రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్షాలు కోరుతున్నాయని..

అయితే రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం ఉండదనే అంశాన్ని గుర్తించాలని తమిళి సై కోరారు.”తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారు. సచివాలయ ప్రారంభోత్సవానికి కనీసం నన్ను ఆహ్వానించలేదు. నాకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా అందించలేదు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ అంశం ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. రాష్ట్రపతే ప్రారంభించాలంటూ ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అయితే రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదని అంటున్నారు. మరి గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా!” అని తమిళి సై వ్యాఖ్యానించారు.మే 28న జరగనున్న కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై వివాదాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. ఈ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అవకాశం రాష్ట్రపతికి ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
ఇందుకు కేంద్రం నిరాకరించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోమని 19 పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మరోవైపు ప్రారంభోత్సవానికి తాము హాజరవుతామని బీజేపీతో సహా దాని మిత్ర పక్షాలు అయిన 14 పార్టీలు ప్రకటనలో తెలిపాయి.ఈ నేపథ్యంలో తమిళి సై వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో గవర్నర్ కు కేసీఆర్ ప్రభుత్వానికి ఉప్పూనిప్పులా పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ పర్యటనలకు హెలికాప్టర్ ను ఏర్పాటు చేయకపోవడం శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించకపోవడం గవర్నర్ రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటిస్తే ప్రొటోకాల్ మర్యాదలను చేయకపోవడం అధికారులెవరూ కూడా ఆమెకు స్వాగతం పలకకపోవడం వంటివి జరుగుతున్న సంగతి తెలిసిందే.
Tags:Governors are non-political people like the President!
