మహాలక్ష్మి ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
-పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు
-వాయినాలు ఇచ్చుపుచ్చుకున్న మహిళలు
మంథని ముచ్చట్లు:
శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే మహిళలు పసుపు, కుంకుమలు, పూలమాలలు, మంగళహారతులు చేతబట్టి ఆలయానికి చేరుకొని కొంగుబంగారమైన మహాలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో వేలాదిగా మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. దేవాలయ వెనుక భాగంలో ఉన్న రావుల చెరువులో అమ్మవారి స్వరూపమైన తామర పూలు భక్తులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మంథని పట్టణంలోని ప్రతి ఇల్లు వ్రత శోభను సంతరించుకున్నాయి. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈ పూజ నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది. తమ సౌభాగ్యాన్ని కాపాడాలని… కోరిన వరాలు ఇవ్వాలని వరలక్ష్మిదేవి రూపంలో ఉన్న అమ్మవారిని పూజించుటం వరలక్ష్మి వ్రతం యొక్క ప్రత్యేకత. గతంలో కలశాన్ని అమ్మవారి రూపంగా భావించి పూజలు నిర్వహించేవారు.

ఇటీవలి కాలంలో అమ్మవారి ముఖ ప్రతిమను ఆధారంగా చేసుకుని వరలక్ష్మిదేవి రూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇత్తడి బిందెలు, కలశాల సాయంతో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి… నూతన వస్త్రాలతో అమ్మవారిని అలంకరించారు. కొబ్బరికాయకు వరలక్ష్మిదేవి ముఖాన్ని జోడించి… అమ్మవారి రూపును తమ ఇళ్లలో కొలువుదీర్చి భక్తితో మురిసిపోతున్నారు మహిళలు. నిండు ముత్తయిదువలా తయారైన వరలక్ష్మిదేవికి… స్వర్ణాభరణాలు జోడించి తన్మయత్వం చెందుతున్నారు. ఆ తర్వాత వరలక్ష్మి వ్రత కథను పఠించి… శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం తోటి ముత్తయిదువలకు పసుపు, కుంకుమలు ఇచ్చి వారి నుంచి ఆశీర్వాదాలు పొందారు. ముత్తయిదువ మహిళలను ఇళ్లకు ఆహ్వానించి తాంబూలంతో కూడిన వాయినం ఇవ్వటం ద్వారా వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు.
Tags:Grand Varalakshmi Vratas at Mahalakshmi Temple
