మధ్య తరగతి కుటుంబాలపై పెను ప్ర‌భావం

Date:26/10/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి పండుగ సంబరాన్ని ఆవిరి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి భయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు అనూహ్యంగా పెరగడం.. ఇటీవలి వరదలు, పంట నష్టంతో ఆదాయం తగ్గడంతో పండుగ సంతోషం కాస్తా పటాపంచలవుతోంది.కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పటికే పట్టణ, గ్రామీణ ప్రాంత పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలపై పెను ప్రభావాన్ని చూపింది. వ్యాపార లావాదేవీలు తగ్గడం, జీతభత్యాలు, ఉద్యోగాల్లో కోతలు సామాన్యుడి నడ్డి విరిచాయి. మార్చి – ఆగస్టు మధ్య కాలంలో 84 శాతం కుటుంబాలు ఆదాయాన్ని కోల్పోవడం లేదా తగ్గుదలను ఎదుర్కొంటున్నాయని జాతీయ సర్వేలు అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా పట్టణ జనాభాలో కనీసం 13.9 కోట్ల మంది కరోనా విపత్తు నేపథ్యంలో పొదుపు (సేవింగ్స్‌)ను పూర్తిగా మరిచిపోయాయని ఈ సర్వేలు పేర్కొన్నాయి. దీన్నుంచి కోలుకుంటున్న సమయంలోనే భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికితోడు వరి, మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో కొనుగోళ్లు జరగక చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి ఎదురైంది. ఇక హైదరాబాద్, వరంగల్‌ వంటి పట్టణాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.

 

 

వీటి నుంచి తేరుకుంటున్న సమయంలోనే పెరుగుతున్న ధరలు మరింత కలవరపెడుతున్నాయి.సామాన్యులకు పప్పన్నమూ కరువవుతోంది. లాక్‌డౌన్‌ అనంతరం ఒక్కసారిగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. ప్రస్తుత సాధారణ పరిస్థితుల్లోనూ కిలో రూ.100కి తగ్గకుండా పలుకుతున్నాయి. దిగిరానంటున్న ధరలతో వంటింట్లో పప్పులుడకట్లేదు. విదేశీ దిగుమతులు తగ్గడం, దేశీయంగా పప్పుల దిగుబడులు తగ్గడంతో ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు. లాక్‌డౌన్‌ ముందువరకు కంది, పెసర, మినపపప్పుల ధరలు కిలో రూ.100కి తక్కువగా ఉన్నా.. ఆ తరువాత ధర రూ.100కి ఎగబాకింది. ప్రస్తుతం మార్కెట్లో మేలు రకం కందిపప్పు కిలో రూ.110– 115 మధ్య ఉంది. గతేడాది ఇదే సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే కనిష్టంగా రూ.20 మేర ఎక్కువ. గ్రేడ్‌–2 రకం కిలో రూ.90–100 పలుకుతోంది. పెసర, మినపపప్పు ధరలూ రూ.105–110 వరకు ఉన్నాయి. వీటి ధరలు గతేడాదితో పోల్చినా రూ.25 మేర పెరిగాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడం, అందుకు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో నూనెల ధరలు అమాంతం పెరిగాయి. లాక్‌డౌన్‌కు ముందు సన్‌ఫ్లవర్‌ లీటర్‌ ధర హోల్‌సేల్‌లో రూ.100 ఉండగా, ప్రస్తుతం హోల్‌సేల్‌లోనే రూ.115 పలుకుతోంది. ఇది వినియోగదారుడికి రిటైల్‌లో రూ.120కి చేరుతోంది.

 

 

 

ఇది గతేడాది ధరలతో పోలిస్తే ఏకంగా రూ.30 మేర ఎక్కువ. సామాన్యులు అధికంగా వినియోగించే పామాయిల్‌.. గతేడాది సెప్టెంబర్‌లో రిటైల్‌లో రూ.85 ఉండగా, ప్రస్తుతం రూ.100కి చేరింది. ఇక వేరుశనగ నూనె ధర సైతం గతేడాది రూ.120 ఉండగా, రూ.150కి చేరింది.కిలో రూ.50గా ఉన్న ఉల్లి ధర వారం వ్యవధిలో ప్రస్తుతం రూ.100కి చేరింది. ఉల్లి ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతిని, దిగుబడి తగ్గిపోవడం, డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలకు కళ్లెంవేసే చర్యలేవీ లేకపోవడంతో ఇప్పట్లో దిగివచ్చేలా లేవు. ఇక టమాటాదీ అదే పరిస్థితి. దీని సాగు రాష్ట్రంలో తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలతో పంట దెబ్బతినడంతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.50–60 పలుకుతోంది. వీటితో పాటే వంకాయ, ఆలుగడ్డ, బీరకాయ ధరలు రూ.60–70 పలుకుతుండటంతో సామాన్యులు ఏం కొనే పరిస్థితి కనిపించట్లేదు.

నిరక్ష్యరాసురాలైన తల్లితో కౌన్సిలింగ్‌కు వచ్చిన బిఎస్‌సి విద్యార్థి

Tags: Great impact on middle class families

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *