ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్

Date:27/08/2020

వరంగల్ ముచ్చట్లు

తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు నర్సరీ నుంచి ఆన్ లైన్ క్లాసులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు టీవీ పాఠాల సమయం కూడా ఫిక్స్ చేసింది:కొత్త విద్యా సంవత్సరం(2020-21)లో అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ స్కూల్స్ లో విద్యార్థులను చేర్చుకునేందుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఒకటి, ఆరో తరగతిలో చేర్చుకోవడానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు భౌతికంగా స్కూల్స్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు వెళ్లి వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. ఒకటి, ఆరు తరగతులు కాకుండా మిగిలిన వాటిల్లోనూ ప్రవేశాలు చేపట్టవచ్చని కాకపోతే వాటిని బదిలీలుగా మాత్రమే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు.

అలాగే ప్రైవేటు పాఠశాలలు నర్సరీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం 3వ తరగతి నుంచే డిజిటల్‌ పాఠాలు మొదలవుతాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకైనా, ప్రైవేటు విద్యార్థులకైనా వారంలో అయిదు రోజులు మాత్రమే పాఠాల ప్రసారం ఉండాలి. తరగతులను బట్టి గరిష్ఠంగా రోజుకు 3 గంటలు అంటే 4 లేదా 5 తరగతులు(సెషన్లు) నిర్వహించాలి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి ప్రైవేటు విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వం ప్రాజ్ఞత పేరిట జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలి.ఆ ప్రకారం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో మూడు రోజులపాటు తరగతులు ఉండాలి.1-5 తరగతులకు రోజుకు గంటన్నర, 6-8 తరగతులకు 2 గంటలు, 9-12 తరగతులకు రోజుకు 3 గంటల చొప్పున వారంలో ఐదు రోజులపాటు పాఠాలు బోధించవచ్చు ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో మాత్రం 2వ తరగతి వరకు ఆన్‌లైన్‌ పాఠాలు ఉండవు.

 

కేవలం 3-10 తరగతుల వారికే ఉంటాయి బడులు తెరిస్తేనే మిగిలిన కింది తరగతులకు పాఠాలుంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.ప్రభుత్వ బడుల్లో చదివించే పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ పేదవారు ఉంటారు. వారికి పిల్లల పక్కన కూర్చొని చదివించే పరిస్థితి ఉండదు కాబట్టి 2వ తరగతి వరకు డిజిటల్‌ పాఠాలు పెట్టడం లేదు’ అని ఒక అధికారి తెలిపారు.ఇంట్లో టీవీలు లేని విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని గ్రామ పంచాయతీ, గ్రామంలోని ఏదైనా ప్రభుత్వ సంస్థ మద్దతు తీసుకోవాలి. లేదంటే టీవీ ఉన్న విద్యార్థులతో కలిపి వారికి పాఠాలు వినే సౌకర్యం కల్పించాలి. స్థానికంగా చదువుకున్న యువతను గుర్తించి వారి సేవలను కూడా వినియోగించుకోవచ్చు. ఈ సందర్భంగా కొవిడ్‌ నిబంధనలను పాటించాలి. పాఠ్య పుస్తకాలు, వర్క్‌ షీట్లు అందరికీ అందుబాటులో ఉంచాలి. ఉపాధ్యాయులు పిల్లలకు తగినంత హోం వర్క్‌ ఇవ్వాలి. చదువులో వెనుకంజలో ఉండే విద్యార్థులకు మొదటి నెల రోజులు సంసిద్ధత కార్యక్రమాలను చేపట్టాలి.రోజువారీ టీవీ పాఠాల వివరాలను తల్లిదండ్రులకు టీచర్లు తెలియజేయాలి. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విద్యార్థుల సందేహాలను తీర్చాలి. తల్లిదండ్రులు సైతం పిల్లలు టీవీ పాఠాలను చూసేలా చర్యలు తీసుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్ నెట్ ఉపయోగించినప్పుడు తగిన భద్రతా ప్రమాణాలను పాటించాలి’’ అని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది.

 ఒకే గొడుకు కిందకు ఇరిగేషన్ శాఖ

 

Tags:Green signal for admissions in private schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *