శ్రీ రాంపూర్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

Date:17/02/2018
మంచిర్యాల  ముచ్చట్లు:
 శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు -2 విస్తరణకు కేంద్ర పర్యారవణ మంత్రిత్వశాఖ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. రూ. 272.73 కోట్ల అంచనా వ్యయంతో ఓపెన్‌కాస్టు పనులు చేపట్టనున్నారు. ఓపెన్‌కాస్టు విస్తరణలోభాగంగా తాళ్లపల్లి, సింగాపూర్, గుత్తెదారి పల్లి, దుబ్బపల్లి గ్రామాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేయనున్నారు. 707.63 హెక్టార్లలో ఉన్న ఓపెన్‌కాస్టును 1604.41 హెక్టార్లలో విస్తరింప జేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఓపెన్‌కాస్టు-2 విస్తరణ కోసం 276.38 హెక్టార్ల అటవీ భూమి, 1161 హెక్టార్ల వ్యవసాయ భూమి 20.15 హెక్టార్ల చెరువులు, 524 హెక్టార్లలో రోడ్లను సేకరించనున్నారు. నాలుగు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కోసం రూ. 72.13 కోట్లను ఖర్చు చేయనున్నారు. మైనింగ్ కోసం 276 హెక్టార్ల అటవీ భూమి ఉపయోగిస్తుండగా వాటి స్థానంలో మైనింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 840 హెక్టార్ల భూమిలో అడవులను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో గల అబ్బాపూర్, బెల్లంపల్లి, ఓపెన్‌కాస్టు 2 విస్తరణ పనుల విషయాన్ని కూడా చర్చించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్ మండలం బస్వరాజుపల్లిలోని కాకతీయ ఖని3(ఫేజ్1), కోల్‌మైనింగ్ ప్రాజెక్టును పరిశీలించేందుకు కమిటీ నిర్ణయించింది. ఇదే విధంగా కాకతీయఖని 5 అండర్ గ్రౌండ్ గనిని ఏర్పాటు చేసేదుకు కమిటీ ఆమోదం తెలిపింది.దశాబ్దాల కాలంగా ఇండ్లు నిర్మించుకొని ఉంటున్న గ్రామాలను తరలిస్తే ఓపెన్‌కాస్టు విస్తరణ పనులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అఖిలపక్ష కమిటీ పేర్కొంది. ఇప్పటికే శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు బాంబు పేలుళ్ల వల్ల ఇండ్లు పగుళ్లు తేలి దెబ్బతిన్నప్పటికీ గ్రామాలను వదిలి వెళ్లలేదని, ప్రతినిత్యం బాంబు శబ్దాలను వింటూనే కాలం గడుపుతున్నామని పేర్కొన్నారు. తాళ్లపల్లి, సింగాపూర్, దొరగారిపల్లి, దుబ్బపల్లి గ్రామాలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వడం శోచనీయమని, ఎట్టి పరిస్థితుల్లోను గ్రామాలను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
Tags: Green signal for Sri Rampur expansion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *