23 వేల మంది విద్యుత్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్

 Date:18/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైదరాబాద్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సంస్థలలో పని చేస్తున్న 23 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ గతేడాది జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లు ఉత్తర్వులు జారీచేశాయి. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నియామకాలు చెల్లవని వాదించారు. అయితే, వారి వాదనను తిరస్కరించిన హైకోర్టు ఈమేరకు పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు తెలిపింది.సిఎం ఆదేశాల మేరకు 23వేల మంది ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్దీకరిస్తూ గత ఏడాది నాలుగు విద్యుత్ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. ఆర్టిజన్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఆర్టిజన్ల క్రమబద్ధీకరణ అంశంపై విచారణ కొనసాగించింది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని విద్యుత్ శాఖ తరుఫున వాదించే లాయర్లు హైకోర్టుకు వివరించారు. ప్రమాదపుటంచుల్లో ప్రతీ దినం విధులు నిర్వహిస్తున్నారని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి సర్వీసులు క్రమబద్ధీకరించకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తెచ్చారు. వారిని క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ మానవీయ దృక్పథాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు.
మెరుగైన విద్యుత్ సరఫరాకోసం కష్టపడుతున్న ఆర్టిజన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే ఉంటున్నారని, ఉద్యోగ భద్రత లేదని వివరించారు.విద్యుత్ శాఖ వాదనలను హైకోర్టు సమర్థించింది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను రద్దు చేసింది.  ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇవాళ పండుగ రోజని ఆయన వ్యాఖ్యానించారు.  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
23 వేల మంది ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరించాలని మానవతాధృక్ప‌థంతో తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడం సంతోషకరమని సీఎం అన్నారు. ఇదే సమయంలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును సీఎం అభినందించారు. 23 వేల మందినీ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్, పీఆర్సీ అమలు చేయాలని ట్రాన్స్‌కో సీఎండీని సీఎం ఆదేశించారు.
Tags:Green signal for the regulation of 23 thousand power employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *