వసూళ్లు సున్నా.. 

Date:14/04/2018
చిత్తూరు ముచ్చట్లు:
పల్లెల్లో పన్ను వసూళ్లు మందగించాయి. నిధుల రాబడి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం విడుదల చేసే నిధులపైనే పంచాయతీల బాగోగులు అధారపడ్డాయి. కొన్ని పంచాయతీల్లో కనీసం వీధి దీపాలు అమర్చుకోలేని పరిస్థితి. విద్యుత్‌ బిల్లుల బకాయిలు పదేళ్లుగా పేరుకున్నాయి. పారిశుద్ధ్యం నిర్వహణ 75శాతం పంచాయతీల్లో గాలికొదిలేశారు. ఈ ఏడాది జులై నెలాఖరుకు పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ప్రస్తుతం విడుదలైన 14వ ఆర్థిక సంఘం నిధులే పాలకవర్గాలకు చిట్టచివరి నిధులు కానున్నాయి. ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు పూర్తయి, రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు ప్రత్యేకాధికారులు లేదా పర్సన్‌ ఇన్‌చార్జ్‌ల ఆధీనంలో పల్లె పాలన సాగనుంది. దీంతో ఇప్పట్లో ఇక పంచాయతీలకు నిధులు విడుదల ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడొచ్చిన నిధులను మరి కొద్దికాలం జాగ్రత్తగా అత్యవసరాలకు మాత్రమే ఖర్చు చేసుకోవాలి. జిల్లాలోని 1365 గ్రామ పంయచాయతీలకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడతగా రూ.63.50కోట్లు విడుదలయ్యాయి. గ్రామీణ జనాభా లెక్కల ప్రాతిపదికన ఒక్కొక్కరికీ రూ.208 చొప్పున నిధులు మంజూరు చేస్తూ జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఇది వరకే ఉత్తర్వులందాయి. మంజూరైన నిధులను ఆయా పంచాయతీల ఖతాల్లో జమ చేశారు. గత ఏడాది మాదిరే పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధుల నుంచి సీపీడబ్ల్యూ పథకాల నిర్వహణ, తాగునీటి బోర్ల మరమ్మతులకు కోత విధించారు. ఆయా నిధుల మొత్తం జడ్పీ ఖాతాకు జమ కానుంది.జిల్లాలోని తూర్పు మండలాల్లో సీపీడబ్ల్యూ పథకం అమలవుతోంది. ఇందుకు ఆయా పంచాయ తీలకు విడుదలైన ఎఫ్‌.ఎఫ్‌.సి నిధుల నుంచి రూ.6కోట్లు కేటాయించారు. పంచాయతీల ఖాతాలకు జమ చేసిన అనంతరం సీపీడబ్ల్యూ పథకాల నిర్వహణకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించపోవడంతో ముందుగానే ఆయా గ్రామాలకు ఇచ్చే నిధుల నుంచి కోత పెట్టారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు గతంలో ఆర్థిక సంఘం నిధుల్లో 15శాతం మాత్రమే  వినియోగించేవారు. ఈసారి నిబంధనల్లో మార్పు చేశారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఉపాధి హామీ పథకం కింద అన్ని గ్రామాల్లో చెత్త సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. వీటి నిర్వహణకు నిధుల కొరత ఉంది. దీంతో చెత్త సేకరణకు రిక్షాలు కొనుగోలు, సిబ్బంది జీతాల చెల్లింపునకు ఆర్థిక సంఘం నిధుల నుంచి 15శాతం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.గ్రామాల్లో అంతర్గత రహదారులు ఆధ్వాన్నంగా ఉన్నాయి. నిధులు కొరతతో పంచాయతీల్లో కనీసం మరమ్మతులు చేసుకోలేని పరిస్థితి ఉంది. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సిమెంటు దారుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోంది. చంద్రన్న బాటలో భాగంగా ఆర్థిక సంఘం నిధుల నుంచి 50శాతం కేటాయిస్తే, ఉపాధి హామీ పథకం నుంచి జనాభా ఆధారంగా 50శాతం నిధులు మ్యాచింగ్‌ గ్రాంటు కింద సమకూరుస్తున్నారు. పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు నుంచి 30శాతం రహదారుల నిర్మాణానికి వినియోగించవచ్చు.పంచాయతీల్లో విద్యుత్‌ బిల్లుల బకాయిలు పేరుకున్నాయి. పన్ను వసూళ్లు మందగించడం, వీధి దీపాల నిర్వహణకు పంచాయతీల ఖతాల్లో డబ్బులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న పంచాయతీలకు బిల్లులు చెల్లించడం భారంగా మారింది. ప్రస్తుతం విడుదలైన ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకుంటే కొంత మేర ఇబ్బందులు తొలగనున్నాయి. విద్యుత్‌ చార్జీల చెల్లింపునకు కచ్చితంగా 15శాతం నిధులు చెల్లించాలి.పంచాయతీల్లో పౌర సేవలను సులభతరం చేసేందుకు 1365 గ్రామ పంచాయతీలను 597 క్లస్టర్లుగా విభజించి కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించారు. పనిని బట్టి గంటకు రూ.50 చొప్పున ఆపరేటరుకు నెలకు రూ.9వేలకు మించకుండా ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనం చెల్లించవచ్చు.
Tags: Grossing zero

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *