ఫెడరల్ ఫ్రంట్ కు పెరుగుతున్న మద్దతు

Date:12/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమాల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ మెగా ర్యాలీ తలపెట్టారు. కోల్‌కతా జనవరి 19న నిర్వహించనున్న ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలు పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఎన్డీయే వ్యతిరేక పక్షాలను ఏకంచేసే దిశగా ఈ ర్యాలీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కీలక పాత్ర పోషించనున్నారు. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్‌ తదితరులు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. వీరితో పాటు ఫరూక్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్, శరద్ పవార్, బాబూరాల్ మరాండీ తదితరులకు సీఎం మమతా ఆహ్వానాలు పంపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మమతా బెనర్జీ నుంచి కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అయితే.. బీజేపీ, కాంగ్రెస్ లేని మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు సాగిస్తున్న కేసీఆర్.. రాహుల్ గాంధీ హాజరవుతున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి ఆసక్తి కనబరచడంలేదు.
కేసీఆర్‌తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు కన్పించడంలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వ్యతిరేకిస్తూ బీఎస్పీ, ఎస్పీ పార్టీలు ఇప్పటికే యూపీలో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్‌కతా ర్యాలీకి మాయావతి హాజరుకావడంలేదు. కానీ, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ మాత్రం పాల్గొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు అఖిలేశ్ ఇప్పటికే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.కాంగ్రెస్‌తో గానీ బీజేపీతో గానీ కలిసే అవకాశం లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఇటీవలే తేల్చి చెప్పారు. దీంతో కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు పెరుగుతున్నట్లు భావించవచ్చు. కాంగ్రెస్‌కు మరిన్ని పార్టీల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎదురవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ, ఎస్పీ.. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌కు దూరమవుతున్నాయి. ఇక బెంగాల్‌లో కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఆవిర్భవించిన తృణమాల్ కాంగ్రెస్‌ కూడా ఆ పార్టీతో కలవడాన్ని ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జాతీయ ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలు కలిసి పనిచేసినా.. రాష్ట్రంలో మాత్రం పొత్తు పెట్టుకునే అవకాశాలు మాత్రం స్వల్పమే. కేసీఆర్ ఇటీవల మమతా బెనర్జీని రెండోసారి కలిశారు.
అయితే, కాంగ్రెస్‌ను ఫెడరల్ ఫ్రంట్ నుంచి మినహాయించడానికి మమత పెద్దగా మొగ్గు చూపడంలేదు. జనవరి 19న మమతా బెనర్జీ తలపెట్టిన ప్రతిపక్షాల ర్యాలీకి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డారు. కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు చంద్రబాబు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల నేపథ్యంలో ఏపీలో పొత్తు పెట్టుకోవడానికి మాత్రం ఇరు పార్టీలు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. ఇప్పటికే శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నాయి. కోల్‌కతా ర్యాలీ తర్వాతే కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ఓ ఫ్రంట్‌కు మాత్రం ఓ రూపం వస్తుందని చంద్రబాబు దీమా వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో టీడీపీ నిర్వహించ తలపెట్టిన ధర్మ పోరాట సభకు ఈ నేతలందరినీ ఆహ్వానించే అవకాశం ఉంది. అదే జరిగితే యాంటీ బీజేపీ ఫ్రంట్ కార్యాచరణ ఇక్కడ నుంచే మొదలవుతుంది.
Tags:Growing support to the Federal Front

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *