కాసులు కురిపిస్తున్న జామ

తిరుపతి ముచ్చట్లు:

ప్రజలకు ఆరోగ్యకరమైన జామ పండ్ల సాగుకు పెనుమూరు ప్రసిద్ధి చెందుతోంది. రైతులు ఏడాదిలో మూడు సార్లు దిగుబడులు సాధిస్తున్నారు. అత్యధిక ఫలసాయం, ఆదాయం ఇచ్చే పంట జామ.  ఇతర రాష్ట్రాలు, పట్టణాలకు పెనుమూరు నుంచి జామను  రవాణా చేస్తున్నారు. రెండు శతాబ్దాల క్రితం దాసరాపల్లెకు చెందిన నాగిరెడ్డి తొలిసారిగా జామ పంట సాగు చేశాడు.ఆయన జామ సాగులో మంచి లాభాలు పొందడం చూసి దాసరాపల్లెలో ఉన్న 50 కుటుంబాలు జామ పంట సాగు చేస్తున్నారు. దాసరాపల్లెను ఆదర్శంగా తీసుకొని కారకాంపల్లె, పెద్దరాజుపల్లె, ఉగ్రాణంపల్లె, చెళంపాళ్యం, రామాపురం, పెనుమూరు గ్రామాల్లో 150 ఎకరాల్లో వివిధ రకాల జామ సాగవుతోంది. జామ సాగుపై ఉన్న మక్కువతో వారసత్వంగా కూడా రైతులు సాగు చేస్తున్నారు. తొలుత రసాయన ఎరువుల వినియోగంతో జామ సాగు చేశారు. పెట్టుబడి పెరగడంతో కష్టాలు, నష్టాలు చవి చూశారు. మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా జామ సాగు చేస్తున్నారు.   సాధారణంగా జామలో ఏడాదికి రెండు పంటలు మాత్రమే దిగుబడి సాధించవచ్చు. అయితే శాస్త్రీయ పద్ధతులతో ‘‘చందన మాధురి’’ రకంతో మూడు పంటలు అందుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఘన జీవామృతం, ధ్రవ జీవామృతం, పంచగవ్య భీజామృతం, పళ్ల ద్రావణం, వేప కషాయం, వానపాముల ఎరువుల వినియోగంతో జామ సాగు చేస్తున్నారు. రైతులు జామ తోటల్లో కోళ్లు, పొట్టేళ్లు పెంచుతూ భూమిని సారవంతం చేస్తున్నారు. వీటితో పాటూ మూడు పర్యాయాలు పచ్చిరొట్ట పైర్లు సాగు చేస్తూ సేంద్రియ ఎరువులు సహజంగా అందిస్తున్నారు.

 

 

ఏటా  భూసార పరీక్షలు చేస్తూ సూక్ష్మపోషకాలు అందిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు స్థానికంగా జామ కాయలు విక్రయించడం వల్ల ఆదాయం ఆశాజనకంగా లేదు. దీంతో మార్కెట్‌ మెలకువలపై రైతులు దృష్టి సారించారు. పల్లెల్లో కన్నా పట్టణాల్లో జామ కాయల ధర, డిమాండ్‌ ఉండడాన్ని గుర్తించారు. సేంద్రియ ఉత్పత్తులు కొనే సంస్థలను, వ్యాపారులను సంప్రదించి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలకు రవాణా చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా ఒక కిలో జామ కాయలు రూ.20 ఉండగా పట్టణాల్లో రూ.80 నుంచి 100 వరకు పలుకుతోంది. వీటితో పాటూ డయాబెటిక్‌ సెంటర్లకు ప్రత్యేక ప్యాకింగ్‌తో సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా వివిధ పట్టణాల్లో నిర్వహించే ఆర్గానిక్, కిసాన్‌ మేళాల్లో ఈ దిగుబడులు విక్రయిస్తున్నారు.  ఉద్యానవన పంటల్లో ప్రస్తుతం జామ సాగు మంచి ఆదాయాన్నిస్తోంది. పైగా ఈ పంటకు తెగుళ్ల బెడద పెద్దగా ఉండదు. పెట్టుబడులు కూడా తక్కువే. మార్కెట్‌లో విక్రయించుకోవడం సులభంగా ఉంది. అదీకాక ఏడాదికి మూడు పంటలు ఇవ్వడంతో మంచి ఆదాయం పెరుగుతోంది. జామను సేంద్రియ పద్ధతులతో సాగుచేయడం, మార్కెట్‌ మెలకువలతో అమ్ముకోవడం ద్వారా ఎకరా పంటకు ఏడాదిలో రూ.3లక్షల వరకు నికర ఆదాయం వస్తోంది. కాయలతో పాటూ మొక్కలు అంటుకట్టి కొందరు రైతులు మరింత ఆదాయం పొందుతున్నారు.

 

Tags: Guava pouring money

Leave A Reply

Your email address will not be published.