మళ్లీ వేడెక్కుతున్న గుంటూరు రాజకీయాలు

Date:19/09/2018
గుంటూరు  ముచ్చట్లు:
గుంటూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పార్లమెంటు పార్టీ సమన్వయకర్తలను నియమించడం సర్వత్రా చర్చనీయాంశంగామారింది. ఎవరూ ఊహించని విధంగా నరసరావుపేట పార్లమెంటు పార్టీ సమన్వయకర్తగా విజ్ఞాన్ సంస్థల వైస్‌ఛైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయులు, గుంటూరు పార్లమెంటుకు కిలారు రోశయ్యలను నియమించడంతో ఆ పార్టీశ్రేణులతో పాటు అధికారపార్టీలో సైతం ఒకవిధమైన చర్చకు దారితీసింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పార్లమెంటు పార్టీ సమన్వయకర్తలుగా ఎవరూ ఊహించని అభ్యర్థులను నియమించడం తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా నరసరావుపేటకు లావు శ్రీకృష్ణదేవరాయులు, గుంటూరు పార్లమెంటుకు కిలారు రోశయ్యలను నియమించడంతో ఆ పార్టీనాయకులతో పాటు అధికారపార్టీ నాయకులు సైతం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు కారణం లేకపోలేదు.
ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంటుకు లావు శ్రీకృష్ణదేవరాయులు పోటీ చేస్తారంటూ విస్తృత ప్రచారం జరిగింది. అదే సమయంలో కిలారు రోశయ్యకు సైతం గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరేదైనా నియోజకవర్గ నుంచి అవకాశం ఇస్తారంటూ వైసీపీ నాయకులు భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ నరసరావుపేటకు శ్రీకృష్ణదేవరాయులు, గుంటూరుకు కిలారును నియమించడంతో టీడీపీ సైతం వైసీపీలోని పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గత ఎన్నికల్లో ఒక్క మాచర్ల తప్ప అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను టీడీపీ కైవశం చేసుకుంది.
దీంతో అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు సైతం భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇదేసమయంలో 2009, 2014లో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దీన్ని అధిగమించేందుకు వైసీపీ అధినేత తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నరసరావుపేట నియెజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. దీనికితోడు అక్కడి నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని టీడీపీ పోటీలో నిలబెట్టే అవకాశం ఉందని వైసీపీ అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది.
దీంతో లావు శ్రీకృష్ణదేవరాయుల వైపు మొగ్గు చూపినట్లు పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇదేసమయంలో నరసరావుపేటలో తీవ్ర పోటీ మాత్రం తప్పదని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు.
జిల్లాలో గుంటూరు పార్లమెంటుకు రాష్ట్రంలోనే అధిక ప్రాధాన్యత ఉంది. రాజధాని పార్లమెంటు సెగ్మెంటు కావడంతో దీనికి ఎక్కడా లేని విశిష్టత ఉంది. ఇక్కడి నుంచి గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆయనకు దీటైన అభ్యర్థిని వైసీపీ నిలబెట్టనుంది.
ఇందులో భాగంగా పార్లమెంటులో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన కిలారు రోశయ్యకు అవకాశం ఇవ్వనున్నారు. ప్రధానంగా గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాలలో ఈయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. అలాగే కిలారు రోశయ్యకు ఆర్థిక, అంగ బలం ఉంది. దీంతో వైసీపీ అధిష్ఠానం కిలారువైపు మొగ్గుచూపినట్లు పార్టీ నాయకులు భావిస్తున్నారు.వైసీపీ తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ అధిష్ఠానం దృష్టిసారించినట్లు సమాచారం.
ప్రధానంగా గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రెండు నియోజకవర్గాల్లో పట్టుకోల్పోకూడదన్న గట్టి పట్టుదలతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు తేలితే ఎవరి బలమెంత అనేది తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
Tags:Guntur politics again warming up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *