గుర్తింపేదీ..? (ఆదిలాబాద్)

Date:12/10/2018
ఆదిలాబాద్  ముచ్చట్లు:
పాఠశాల క్రీడల్లో ఆడి నా క్రీడాకారులకు గుర్తింపు లభించడం లేదు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ముగింపు రోజు క్రీడా ధ్రువపత్రాలు అందజేయడం ఆది నుంచి ఆనవాయితీగా వస్తోంది. కానీ అదే రాష్ట్రస్థాయిలో క్రీడా ధ్రువపత్రాలు అందక మూడేళ్లవుతోంది. దీంతో క్రీడాకారులు ఉన్నత విద్య ప్రవేశాల్లో దరఖాస్తు చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.మూడేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు దాదాపు 21 వేల మంది పాఠశాలస్థాయి నుంచి విద్యార్థులను క్రీడలవైపు మళ్లించినప్పుడే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే అవకాశముంటుందని భావించిన కేంద్ర ప్రభుత్వం 1954లో భారత పాఠశాల క్రీడా సమాఖ్య(ఎస్‌జీఎఫ్‌ఐ)ను స్థాపించింది.
దీనికింద ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎస్‌జీఎఫ్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఎస్‌జీఎఫ్‌ అధికారులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీలు ఏటా నిర్వహించేలా చూస్తున్నారు. రాష్ట్ర ఎస్‌జీఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సీనియర్‌ వ్యాయామ ఉపాధ్యాయులను జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శిగా నియమిస్తున్నారు. వీరు రెండేళ్ల పాటు జిల్లాలో మండల, జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా జిల్లా ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో ఏటా 72 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పాత పది జిల్లాల నుంచి క్రీడా జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నాయి. అంటే ప్రతి సంవత్సరం 7వేల మంది క్రీడాకారులు ఆయా క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయిలో పోటీ పడుతున్నారు.
గత మూడేళ్లలో రాష్ట్ర ఎస్‌జీఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. 2015లో మొదటిసారిగా క్రీడాకారుల వివరాలు ఆన్‌లైన్‌ పద్ధతిలో స్వీకరించారు. అప్పటి నుంచే అసలు సమస్య మొదలైందని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు వాపోతున్నారు. గతంలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వాహకులే నేరుగా క్రీడా ధ్రువ పత్రాలు ముద్రించి పోటీ ముగింపు రోజు అందించేవారు. కానీ ఆన్‌లైన్‌ విధానం వచ్చాక పోటీలు పూర్తి చేసిన తర్వాత సదరు జిల్లా కార్యదర్శికి ప్రత్యేక పాస్‌వర్డ్‌ పంపించి ధ్రువీకరణ పత్రాలు ముద్రించాలని రాష్ట్ర ఎస్‌జీఎఫ్‌ అధికారులు మొదట్లో ఆదేశించారు.
కానీ దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో సదరు కార్యదర్శులు సర్టిఫికెట్ల ముద్రణను గాలికి వదిలేశారు. దీంతో మూడేళ్ల నుంచి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఇప్పటివరకు రాష్ట్ర మెరిట్, పార్టిసిపేట్‌ సర్టిఫికెట్లు అందని ద్రాక్షగానే మారాయి.క్రీడల్లో రాణిస్తే ఉన్నత విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు లభిస్తుందని చిన్నవయసు నుంచే విద్యార్థులు పాఠశాల క్రీడల్లో పాల్గొంటున్నారు.
తీరా పోటీల్లో ప్రతిభ కనబర్చినప్పటికీ ధ్రువ పత్రాలు చేతికి అందక వారు తీవ్రంగా నష్టపోతున్నారు. క్రీడాకోటా కింద ఉన్నత విద్య కోర్సుల్లో సీటు పొందాలంటే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడా ధ్రువ పత్రం తప్పనిసరి. ఆ పత్రం లేకనే దరఖాస్తు చేసుకోలేక నష్టపోతున్నారు. ధ్రువీకరణ పత్రాల ముద్రణకు సంబంధించి రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.
Tags:Gurtimpedi ..? (Adilabad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *