గుర్రుగుర్రుగా కాంగ్రెస్ సీనియర్లు

రేవంత్ ముందు.. అ తర్వాత …

హైదరాబాద్ ముచ్చట్లు:

Post Midle

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో కాక రేపుతున్నది. ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిర్‌లో చేసిన తీర్మానాలను ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీ సీనియర్లలో వ్యతిరేకత పెరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, ఆ తర్వాత పార్టీని విడినవారిని తిరిగి పార్టీలోకి తీసుకోకూడదని రాజకీయ అంశాలపై వేసిన కమిటీ ప్రతిపాదించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిపిన చింతన్ శిబిర్‌లో ప్రతిపాదించింది. పార్టీ దానిని అక్కడే ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదే తీర్మానాన్ని అటు ఏఐసీసీకి కూడా పంపించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రేవంత్ కాంగ్రెస్‌ను వీడిన ఒక్కొక్కరితో మాట్లాడి తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో సీనియర్లకు మింగుడు పడటం లేదు.కాంగ్రెస్‌లో పాత వాళ్లకే టికెట్ ఇస్తామని, ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో తిరగాలని ఏఐసీసీ నుంచి మొదలుకుని టీపీసీసీ వరకు సంకేతాలిచ్చింది. ఇదే అంశాన్ని కీలకంగా తీసుకుని చింతన్ శిబిర్‌లో కూడా చేర్చారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వరాదని, పార్టీని వీడినవారిని కూడా ఇలాంటి సమయంలో పార్టీకిలోకి తీసుకోరాదని తీర్మానించారు. కానీ, ప్రస్తుతం గతంలో పార్టీని వీడిన వారితో రాయబేరాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత పీజేఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చింది. పీజేఆర్ సెగ్మెంట్ ఖైరతాబాద్ నుంచి ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆయన ఆ ఉపఎన్నికలో గెలిచారు. ఆ తర్వాత ఓటమిపాలయ్యారు.

 

 

 

ఇదే సందర్భంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో ఖైరతాబాద్ సెగ్మెంట్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్‌కు వెళ్లారు. ఖైరతాబాద్ నుంచి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పోటీకి దిగారు. ఇప్పటికీ ఆయనే ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్నారు. అయితే, అంతకు ముందు పీజేఆర్ కూతురు విజయారెడ్డి టీఆర్ఎస్ గూటికి వెళ్లారు. విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నా.. రాజకీయాల్లో తగ్గారు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. రాహుల్ సభకు కూడా దూరంగానే ఉన్నారు. టీపీసీసీ చీఫ్‌గా నియామకం తర్వాత రేవంత్ రెడ్డి స్వయంగా విష్ణు ఇంటికి వెళ్లి కలిశారు. అయినా దూరంగానే ఉంటూ వస్తున్నారు. అటు ఖైరతాబాద్ డివిజన్ నుంచి విజయారెడ్డి కార్పొరేటర్‌గా రెండుసార్లు గెలిచారు. ఇటీవల మేయర్ స్థానాన్ని ఆశించారు. అంతకు ముందు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఆశించారు. కానీ దక్కలేదు. ఇప్పుడు అనూహ్యంగా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. పార్టీ మారడంలో ప్రధాన డిమాండ్ ఉన్నట్టు తెలుస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ సెగ్మెంట్ టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దానికి టీపీసీసీ నుంచి కొంత అనుకూలత ఉండటంతో.. ఈ నెల 23న పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి నెలకొంది. మహబూబ్నగర్ నుంచి ఎర్ర శేఖర్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కానీ, అక్కడ ఓబెదుల్లా కొత్వాల్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. దీంతో ఆయనకు టికెట్ ఇవ్వడంపై సందిగ్థం నెలకొంది. ఎర్ర శేఖర్‌కు రేవంత్ రెడ్డి అండగా ఉంటున్నారు. మహబూబ్నగర్ నుంచి కాకుంటే జడ్చర్ల నుంచి అవకాశం కల్పిస్తామనే భరోసా ఇచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ. కాగా జడ్చర్లలో ఈసారి మల్లు రవికి చెక్ పెట్టినట్లేనని తెలుస్తోంది. వాస్తవంగా మల్లు రవి ముందు నుంచీ రేవంత్‌కు అండగా ఉంటున్నారు. కానీ, అక్కడి టికెట్ కోసం రేవంత్ బంధువు అనిరుధ్ రెడ్డి, ఎర్ర శేఖర్ లు ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో అదే జిల్లాకు చెందిన ఓ ఎంపీ సొదరుడి తనయుడు కూడా టికెట్ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతానంటూ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రచారం. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గంలో శివ కుమార్ రెడ్డి ఉండగా..

 

 

 

మరొకరిని తెరపైకి తీసుకువస్తున్నారు. మరోవైపు అప్పుడో, ఇప్పుడో పార్టీ మారేందుకు సిద్ధపడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నా.. అక్కడ రేవంత్ వర్గం మరొకరిని ఎంకరేజ్ చేస్తుందనే విమర్శలున్నాయి. దీంతో ఆయన వెనకాముందాడుతున్నారు.పలు నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు కూడా కాంగ్రెస్ వైపు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, టికెట్లపై హామీ రాకపోవడంతో వెనకాముందాడుతున్నట్లు చెప్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి నుంచి మాత్రం టికెట్‌పై కొంత హామీ ఇస్తున్నప్పటికీ.. సీనియర్లు మాత్రం ఒప్పుకోవడం లేదంటున్నారు.గతంలో డీఎస్, ఆయన తనయుడు సంజయ్‌తో భేటీ కావడం, కాంగ్రెస్‌ను వీడిపోయిన వారి దగ్గరకు వెళ్లి రావడం మాత్రమే కాకుండా.. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారిని రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకువస్తున్నారని పార్టీ సీనియర్లలో కొంత ఆసంతృప్తి వ్యక్తమవుతోంది. హుజూరాబాద్‌లో బల్మూరి వెంకట్, గోషామహల్‌లో మెట్టు సాయికుమార్, నకిరేకల్‌లో ప్రీతం, జనగామలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి, జడ్చర్లలో అనిరుధ్ రెడ్డి, ఖైరతాబాద్‌లో సమీప బంధువు రోహన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి జగదీశ్వర్, అభిలాష్రావు, మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్, సంజీవ్, చెన్నూరులో నల్లాల ఓదెలు, నిజామాబాద్‌లో మహేశ్ కుమార్, కామారెడ్డిలో అజారుద్దీన్, కుత్భుల్లాపూర్ నుంచి కొలన్ హన్మంతరెడ్డి, సత్తుపల్లి నుంచి మానవతారాయ్ వంటి వారిని కొత్తగా తెరపైకి తీసుకువచ్చి వీరిని ఎంకరేజ్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. దీంతో సీనియర్లు కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. ఉదాహరణగా జనగామలో మాజీ మంత్రి పొన్నాల, సత్తుపల్లిలో సంభాని చంద్రశేఖర్, నిజామాబాద్‌లో మధుయాష్కీ, కామారెడ్డిలో షబ్బీర్ అలీ, జడ్చర్లలో మల్లు రవి, ఖైరతాబాద్‌లో దాసోజు శ్రవణ్ వంటి నేతలు టీపీసీసీ చీఫ్ వ్యవహారంపై కొంత ఆగ్రహంగా కనిపిస్తున్నారు. ఏండ్ల నుంచి పార్టీ కోసం పని చేసుకుంటూ, కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తుంటే.. కొత్తగా తన వర్గాన్ని దింపుతున్నారని మండిపడుతున్నారు. తాజాగా విజయారెడ్డి చేరుతున్న పరిణామాలతో మళ్లీ సీనియర్లలో అగ్గి రాజేసినట్లుగా మారింది.

 

Tags: Gurudwara Congress seniors

Post Midle
Natyam ad