సగం మంది ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ , మైనింగ్ బిజినెస్ 

Date:19/09/2018
బెంగళూర్ ముచ్చట్లు :
మన దేశంలోని ధనికులైన ఎమ్మెల్యేల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారే టాప్ అని అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ఎన్జీవో పరిశీలనలో వెల్లడైంది. మిగతా రాష్ట్రాలకు చెందిన వారితో పోలిస్తే.. కర్ణాటక ఎమ్మెల్యేలు ధనికులని ఆ నివేదికలో తేలింది. కన్నడ రాష్ట్రానికి చెందిన 222 మంది ఎమ్మెల్యేల్లో 90 శాతం మంది వార్షిక ఆదాయం రూ.1.1 కోట్లు కావడం గమనార్హం. కర్ణాటక ఎమ్మెల్యేల్లో 65 మంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండగా.. దాదాపు 30 మంది మైనింగ్ అండ్ గ్రానైట్ బిజినెస్ చేస్తున్నారు. 25 మంది విద్యాసంస్థలను నడుపుతున్నారు.
బెంగళూరు, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. అనెకల్‌తోపాటు బెంగళూరులోని 27 మంది ఎమ్మెల్యేలకు రియల్ ఎస్టేట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం గమనార్హం. పరిశ్రమల శాఖ మంత్రి కేజే జార్జి, విజయనగర్ ఎమ్మెల్యే ఎం క్రిష్ణప్ప, బొమ్మనహల్లి ఎమ్మెల్యే సతీష్ రెడ్డి తదితరులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. బళ్లారి ప్రాంతంలో మైనింగ్ లాబీ బలంగా ఉంది. బీజేపీ నాయకుడు శ్రీరాములు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, నాగేంద్రలు మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, మంత్రులు డీకే శివకుమార్, ఆర్వీ దేశ్‌పాండే, మాజీ మంత్రి శామనూరు శివ శంకరప్ప, బీజేపీ ప్రెసిడెంట్ యడ్యూరప్ప, కౌన్సిల్ చైర్మన్ బసవరాజు హోరట్టి తదితరులు విద్యా వ్యాపారంలో ఉన్నారు. కర్ణాటకలోని రాజకీయ పార్టీలను రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ టైకూన్లు, మైనింగ్, షూగర్, గ్రానైట్ మొఘళ్లు కంట్రోల్ చేస్తున్నారని మార్స్ రియాల్టీకి చెందిన ప్రశాంత్ సంబర్గి తెలిపారు. సంపదను కాపాడుకోవడం కోసం లేదా తమ వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవడానికి అనువుగా విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేయడం కోసం వారు రాజకీయాల్లో వస్తున్నారని ఆయన చెప్పారు.
చాలా కాలంపాటు కర్ణాటక రాజకీయాలను లిక్కర్ లాబీ గుప్పిట్లో ఉంచుకుంది. కర్ణాటక స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటుతో 2000 ఆరంభంలో దాని ప్రాభవం తగ్గింది. గ్రానైట్, ఎడ్యుకేషన్, మైనింగ్ లాబీలు బలపడ్డాయి. గాలి జనార్దన్ రెడ్డి జైలుకెళ్లడం, తదనంతర పరిణామాలతో మైనింగ్ లాబీ బలం తగ్గింది. ఇదే సమయంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ రంగం శక్తివంతమైంది. ధన ప్రవాహం పెరగడంతో.. ఖర్చు పెట్టగల స్థోమత ఉన్న అభ్యర్థులకే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్న వారిలో చాలా మంది కోటీశ్వరులే ఉంటున్నారు.
Tags:Half of the MLAs are real estate and mining business

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *