అరకొర సిబ్బంది.. ముందుకు సాగని పనులు

Date:13/10/2018
కర్నూలు ముచ్చట్లు:
జిల్లాలో పంచాయతీల పాలనకు అవసరమైన అధికార యంత్రాంగం కొరతతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ప్రగతి మిగిలిపోయింది. కొన్ని గ్రామాలకు మంజూరైన నిధులను సైతం ఖర్చు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి పంచాయతీ కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు ఏ గ్రామం పైనా పూర్తి స్థాయిలో దృష్టి సారించలేక పోతున్నారు.
గ్రామాల అభివృద్ధికి పాటుపడలేని పరిస్థితి నెలకొంది.జిల్లాలో 889 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కార్యదర్శులు మాత్రం 450 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరు సగటున 2 పంచాయతీల నుంచి 6 వరకూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో పాలనపై దృష్టి సారించలేకపోతున్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యమే కాకుండా కనీసం ముఖ్యమైన పారిశుద్ధ్య పనులను సైతం పర్యవేక్షించి అమలు చేయలేని దయనీయ పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి.
ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి వ్యాధులు ప్రబలే పరిస్థితి తలెత్తిందంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలంలో 19 గ్రామ పంచాయతీలు 34 మజరా గ్రామాలు ఉండగా ఇక్కడ కేవలం అయిదుగురు కార్యదర్శులు మాత్రమే పనిచేస్తున్నారు. మద్దికెరలో 7 పంచాయతీలకు గానూ నలుగురు కార్యదర్శులు, వెల్దుర్తిలో 22 గ్రామపంచాయతీలకు 11 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. కృష్ణగిరి మండలంలో 15 పంచాయతీలకు 9 మంది విధుల్లో ఉన్నారు.
నియోజకవర్గ కేంద్రం పత్తికొండ మండలంలో 15 గ్రామ పంచాయతీలకు గానూ అయిదుగురు కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండడం విశేషం. కనీసం సౌకర్యాలను కల్పించలేని దుస్థితిలో ఇంకా ఎన్నో పంచాయతీలు ఉన్నాయి. పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు కూడా పలు గ్రామాలు నోచుకోవడం లేదు.వెల్దుర్తి ప్రధాన వీధిలో మురుగునీరు పారుతూ దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. పలు వీధుల్లో నడిచేందుకు సైతం దారి లేని దుస్థితి నెలకొంది. మురుగునీరు పారేందుకు కాలువలు సరిగా లేకపోవడం, పారిశుద్ధ్య చర్యలు నిత్యం జరగని కారణంగా గ్రామాలు మురుగుమయంగా మారాయి. స్థానికులు ఈ దారుల్లో నడిచేందుకు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు.
నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులు పట్టించుకునే వారే లేరంటూ ప్రజలు వాపోతున్నారు. ప్రతి గ్రామంలోనూ పారిశుద్ధ్యం లోపించి కష్టాలు ఎదుర్కొంటున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 11 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు అవసరమైన సిబ్బంది లేరు. గ్రామాలు చెత్త కుప్పలను తలపిస్తున్నాయి.అగ్రహారం గ్రామంలో తమ ఇళ్ల ముందు ఎంతో కాలంగా మురుగునీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోందని…
పంచాయతీ, మండల స్థాయి అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రతి బుధవారం జరిగే పల్లెపిలుపు కార్యక్రమానికి వచ్చిన ప్రతిసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి మార్పు లేదని చెబుతున్నారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేవని ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ సిబ్బంది కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ కష్టాలు పట్టించుకునేవారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags: Half of the staff

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *