బడికి ఎందుకు రాలేదని ప్రశ్నిం‍చిన పాపానికి..

haryana prinipal student gun

haryana prinipal student gun

సాక్షి

Date :20/01/2018

సాక్షి, యమునా నగర్‌ (హర్యానా) : హర్యానాలో దారుణం జరిగింది. పాఠశాలకు సక్రమంగా ఎందుకు హాజరు కావడం లేదని విద్యార్థిని దండించినందుకు మహిళా ప్రిన్సిపాల్‌ను కాల్చి చంపాడో మూర్ఖపు విద్యార్థి. ఈ ఘటన యమునా నగర్‌లోని స్థానిక వివేకానంద పాఠశాలలో శనివారం జరిగింది.

వివేకానంద పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి పాఠశాలలకు సరిగా హాజరు కావడం లేదు. అటెండెన్స్‌ తక్కువగా ఉండడంతో సదరు విద్యార్థిపై ప్రిన్సిపాల్‌ రితు చబ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు సరిగ్గా లేదంటూ తోటి విద్యార్థుల ముందు ప్రిన్సిపాల్‌ కోపగించుకోవడాన్ని సదరు విద్యార్థి అవమానంగా భావించాడు. దీంతో ఎలాగైనా ప్రిన్సిపాల్‌ను హత్య చేయాలని నిర్ణయించుకొని శనివారం ఉదయం తండ్రి లైసెన్స్‌డ్‌ తుపాకిని బ్యాగ్‌లో పెట్టుకుని స్కూల్‌కు వెళ్లాడు. ఎప్పటిలా తరగతి గదికి కాకుండా నేరుగా ప్రిన్సిపాల్‌ గదికి వెళ్లిన అతడు నేరుగా తుపాకితో విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మూడు బుల్లెట్లు రితు చబ్రా ఛాతిలోకి దూసుకెళ్లాయి. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించారు.

దీనిపై యమునానగర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రాజేష్‌ కాలియా మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి అన్నికోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థితోపాటు, అతని తండ్రిపై కూడా ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *