కులమే కొంప ముంచిందా?

అమరావతి ముచ్చట్లు:

కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్సీపి ఘోర పరాజయానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నారు .
” గెలిచినోడి తప్పులన్నీ మాసిపోవును….
ఓడినోడి ఒప్పులు కూడా వెనుకబడును….
హతవిధి –
బలం తక్కువైతే బల్లి పామై కరవబడును…” అనేది నిజం!
చంద్రబాబు అయినా జగన్మోహన్రెడ్డి అయినా ఎవ్వరి విషయంలోనైనా ఇదే లోకరీతి..! ఇదే పునరావృతం అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇదే తంతు కొనసాగుతుంది. ఇదంతా తట్టుకుంటూ జగన్మోహన్రెడ్డి
మళ్లీ యుద్దానికి ” సిద్ధం ” అవ్వాలి అంటే తన పొరపాట్లను ఓటమికి కారణాలను సమీక్షించుకోవాల్సిందే!

చెప్పింది చేశాం… చెప్పనివి కూడా చేశాం … అంటూ ధీమాతో ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్లిన వైఎస్ఆర్సిపికి బలమైన ఎదురుగాలి వీసింది… ఈ దరిమిలా క్షేత్రస్థాయి పరిశీలనలో…
వైయస్సార్సీపీకి ఓటమికి ముఖ్య కారణాలు రెండే –
1. కులం.2. ఉద్యోగులు

అయితే …. భంగపాటుకు కారణాలుగా రాజధాని అంశం , మద్యం, ఇసుక, అని విశ్లేషకులు ….
60 లక్షల ఈవీఎంలలో 40 లక్షల మాత్రమే కనిపిస్తున్నాయి అని వైయస్సార్సీపి శ్రేణులు….
మాట్లాడుతున్నప్పటికి కులం – ఉద్యోగుల అంశాలు మాత్రమే పెద్ద దెబ్బ కొట్టాయి అనేది వాస్తవం.

1. కులం….
కులం అనేది ఎవరు చేదించలేని కవచం…
కులం అనేది ఎవరు పడగొట్టలేని బలగం…
కులం అనేది ఆపత్కాలాల నుండి రక్షించే గోవర్ధనగిరి…
కులం అనేది మాయాకృష్ణుడు బోధించే గీత…
కులాలు ఏకమైతే శత్రు విధ్వంసం తప్పదు అనేది 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సూటిగా స్పష్టం చేశాయి.
కమ్మ కులం చంద్రబాబు వెంట నడిస్తే…
కాపు కులం పవన్ కళ్యాణ్ కి జై కొడితే…
రెడ్డి కులం జగన్మోహన్రెడ్డిని ఇంటికి పంపించింది…
ఇందుకు? కారణాలేమిటి?

తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తాను కమ్మ కులస్తుడిని అనే స్పృహను ఎక్కడ మర్చిపోలేదు. తన కమ్మ అస్తిత్వాన్ని ఎప్పుడూ ఎక్కడా పక్కకు పెట్టలేదు. తాను పుట్టింది రాయలసీమ ప్రాంతంలో అయినప్పటికీ కమ్మ ప్రాబల్యం ఉన్న ఆంధ్ర ప్రాంతం మీదే అధిక ప్రేమ చూపించిన మాట వాస్తవం.ఏ ఒకరిద్దరూ తప్పిస్తే… అదీను రాజకీయ విభేదాల కారణంగా తప్పిస్తే … మొత్తం కమ్మజాతి చంద్రబాబు నాయుడు వెంటనే నడిచింది. కొండపైన అమ్మ కొండ కింద కమ్మ అని ధైర్యంగా చెప్పుకుంది. అమరావతి కాదు కమ్మరావతి అంటూ ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంది.

క్రైస్తవ బోధకుడిగా ఉన్న కేఏ పాల్ ధైర్యంగా నేను పెదకాపుని అని చెప్పుకుంటున్నాడు. నేను హిందువుని …. కేవలం దేవుడిగా ఏసును నమ్ముకున్నాను అని చెప్పుకుంటున్నాడు.

భీమవరం, గాజువాక ఓటమి తర్వాత, పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని తన వెంట నడవమని పిలుపునిచ్చాడు.కనీసం కాపు కులానికి అయినా ఓటేసి గెలిపించండి అని అనేక సభలో చెప్పాడు. చివరకు కాపు బలగం ఉన్నచోటే తన గెలుపు ఓటముల్ని పరీక్షించుకుని కులం ఓట్లతో విజయం సాధించాడు .

మనకి మొన్న తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో…. నేను రెడ్డిని, రెడ్లకు ఓటెయ్యండి రెడ్లు ప్రజా పరిపాలన చేస్తారు అని రేవంత్ రెడ్డి బాహాటంగానే చెప్పకున్నాడు. ఇందుకు ప్రత్యర్థి పార్టీలు కుల ప్రస్తావనని తప్పుపడుతూ హడావిడి చేసాయి తప్ప కాంగ్రెస్ శ్రేణులు ఏ ఒక్క మాట మాట్లాడలేదు.

కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కుల అస్తిత్వం అనేది పూర్తిగా కనుమరుగయ్యింది. తన అమ్మమ్మ గారు ఇప్పటికీ సనాతన రెడ్లు. కానీ తన నాయనమ్మ తరపువారు క్రిస్టియన్ రెడ్లు. వీరి ముత్తాత వెంకట్రెడ్డి హయాంలో క్రిస్టియానిటీ తీసుకున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్రెడ్డి హిందూ ప్రాబల్యం ఉన్న సమాజంలో ఒకింత ఇరకాటంలోనే పడ్డాడు. ఇరకాటంలో పడాల్సిన అవసరం లేదు. తాను ఒక సాధారణరెడ్డిగా బతికే అవకాశం అన్ని విధాలా ఉంది. ఇందుకు ఒకే ఒక్క అద్భుతమైన మార్గం సతీసమేతంగా ఆలయానికి రావడం ! కానీ సరైన సలహాలు సూచనలు లేక ఇంటి ముందు ఆలయం సెట్టింగులు వంటి పొరపాట్లు చేశాడు.

బిజెపి శ్రేణుల పునాదులు బలపడిన తరువాతే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీద కిరస్థాని ముద్ర పడటం మొదలయింది. సనాతన హిందూ ధర్మాచారాలతో ఈ ముద్రను చెరిపేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు.

ఇంకా… జగన్మోహన్రెడ్డి ” రెడ్డి ” అనే పదాన్ని ఉచ్చరించడానికి ఇబ్బంది పడ్డాడు. ఎందుకు ఇబ్బంది పడ్డట్టు? నా ఎస్సి – నా ఎస్టి- నా బిసి – నా మైనారిటీ అంటూ రెడ్డి అస్తిత్వానికి ఎందుకు దూరమైనట్టు? బహుజనుల జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి బహుజనుల మనిషిగా కనిపిస్తేనే విజయం తథ్యము అనుకున్నాడా? బహుజనులకు ఉచితాలు ప్రకటిస్తే తిరుగులేదు అనుకున్నాడా? ఇదే పొరపాటు! కాబట్టి క్షేత్రస్థాయిలో రెడ్డి యువత పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి దూరమైపోయింది. ఈ రెడ్డి యువతలో రెండు వర్గాలు ఉన్నాయి.
1. హిందూ భావజాలం మెండుగా ఉన్న రెడ్ల కుటుంబాలు.
2. రెడ్ల అస్తిత్వాన్ని తమ ఆత్మ గౌరవంగా భావించే రెడ్ల కుటుంబాలు.

ఈ పరిస్థితిని జగన్మోహన్రెడ్డి అసలు అంచనా వేసుకోలేకపోయాడు. కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కకు పెడుతున్నాను అనే స్పృహ మాత్రం అతడికి ఉన్నది. కాబట్టి ఒక రెడ్లు దూరమైతేనేం ప్రజలంతా నా వెంటే ఉన్నారు అనే మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఈ ఆత్మవిశ్వాసమే ఇప్పుడు అతలాకుతలం చేసింది.

మొత్తానికి రాజకీయంగా కులం అనేది కుటుంబంలా పనిచేస్తుంది అనేది నిరూపించబడింది కాబట్టి , రెడ్ల ఐక్యతతో ముందుకు నడిస్తేనే రచ్చ గెలవగలం అనేది
కఠినమైన సత్యమే.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వంటి నాయకులు కులానికి ఎంత దగ్గరగా ఉన్నారో విజయానికి కూడా అంతే చేరువయ్యారు. వాళ్లకు ఓటేసిన దళిత బహుజన మైనారిటీలు వాళ్లతో పాటుగా వాళ్ళ కులాన్ని కూడా గౌరవిస్తూ ఓటేశారు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది కాబట్టి, నాయకుడిగా నిన్ను మెచ్చిన ప్రజలు నీ కులాన్ని కూడా మెచ్చుతారు అనే నిజాన్ని మర్చిపోవద్దు.

రెడ్డి అంటే దుర్మార్గుడు దుష్టుడు నీచుడు నికృష్టుడు అని ఏ నిఘంటువు కూడా అర్థం చెప్పలేదు. రెడ్డి అంటే పాలకుడు పాలించేవాడు అని మాత్రమే అర్థం చెప్పింది. చరిత్రలో నియంతలుగా ఉన్న రెడ్లు ఉండవచ్చు. ఆ నియంతల కింద దళిత బహుజన మైనార్టీలు అనుచరులుగా బతికి ఉండవచ్చు. కానీ ఇంత మాత్రానికి మొత్తం సామాజిక వర్గాన్ని తప్పు పట్టడం చారిత్రక తప్పిదం. ఈ క్రమంలో ఒక రెడ్డి రెడ్డిగా బతకడానికి భయపడటమో లేదా అదొక బూర్జువా వ్యవస్థగా భావించడం అంతకన్నా తప్పిదం.
కానీ —–
అన్ని విధాల ఆరితేరి కూడా రెడ్డి అనే పదాన్ని నిషేధించుకున్న పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి, కొండపల్లి సీతారామిరెడ్డి, ముద్దసాని కోదండరామిరెడ్డిలు ఉన్నారు. వీళ్లంతా తమ పేరులోని రెడ్డిని మాత్రమే నిషేధించుకున్నారు. కాని, బతకంతా రెడ్డి కులంతోనే ముడిపడి ఉన్నది. కాబట్టి నిషేధం శాశ్వతం అనబడలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రెడ్లను పక్కకు పెట్టిన జగన్మోహన్రెడ్డి ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
తమ అస్తిత్వాన్ని తాము గౌరవిస్తూ… ఎదుటివారి అస్తిత్వాన్ని కూడా అంతే గౌరవిస్తూ… ముందుకు సాగిపోతే ఏ నాయకుడు కూడా ఫెయిల్యూర్ కాలేడనే వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది.

ముఖ్యంగా కమ్మ కులానికి చెందిన చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో రెడ్లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా, జగన్మోహన్రెడ్డి క్యాబినెట్లో కనిపించలేదు. 2019లో జగన్మోహన్రెడ్డి గెలవగానే మరో 20 ఏళ్ల పాటు తన పదవికి గట్టి పునాదులు వేసుకున్నాడు అని జనమంతా అనుకున్నారు.తాను కూడా తనకు తిరుగులేదనే అనుకున్నాడు. కానీ గెలిచిన తరువాత మంత్రివర్గ కేటాయింపులు చూసి , రెడ్లు పెదవి విరిచారు . సామాజిక సమీకరణ అంటూ సమర్థులైన పవర్ఫుల్ రాజకీయాలు నడిపే రెడ్లను పక్కకు పెట్టి, కేవలం పదవులు అనుభవించి వెళ్ళిపోయే పేలవ రాజకీయనాయకులకు పెద్దపీట వేయడాన్ని గురించి రాజకీయ విశ్లేషకులు , విమర్శకులు, మాట్లాడుతూ….సమర్థులను అనుభవజ్ఞులను పక్కకు పెట్టడాన్ని ఒక సవాల్ గా అభిప్రాయపడ్డారు. ఇది జగన్మోహన్రెడ్డి చుట్టూ ఉన్న పనికిమాలిన సలహాదారుల ఉచిత సలహాలు కావచ్చు. ఇదే జగన్మోహన్రెడ్డి సర్కార్ పై రెడ్ల అంతరంగంలో పడిన మొదటి దెబ్బ.

పార్టీ నాయకుడిగా జగన్మోహన్రెడ్డి పాదయాత్రలు చేసినా, నిరాహార దీక్షలు చేసినా, జన సమీకరణ కోసం…. సభలు సమావేశాలు యాత్రలు విజయవంతం కావడం కోసం…. ఎందరో రెడ్లు తమ కోట్లాది రూపాయల ఆస్తుల్ని అమ్ముకున్నారు. కానీ ఈ రెడ్లనంతా పక్కకు పెట్టిన జగన్మోహన్రెడ్డి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు అందుబాటులో కూడా లేరు. ఉన్నా కూడా శక్తివంతమైన రాజకీయాలు నడపలేరు…. జనాన్ని నడిపించలేరు. ఖర్చులు పెట్టలేరు. నాయకత్వాలు వహించలేరు. పరాన్నజీవులుగా ఆధారపడే వాళ్లను తనకు అండ దండ అనుకోవడం జగన్మోహన్రెడ్డి ఘోర తప్పిదం..

గ్రామాలను రాజకీయంగా శాసించిన రెడ్లు ఉన్నారు. రాజకీయ ప్రాబల్యం వహిస్తూ తమ ప్రభావంతో బహుజనుల్ని నడిపిస్తున్న రెడ్లు నేటికి ఉన్నారు. కానీ ఇవేమీ జగన్మోహన్రెడ్డి పట్టించుకోలేదు. కాబట్టే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో —–
” పైన పచ్చని ఆకుల్ని నమ్ముకుని కింద వేళ్లను తుంచేసుకోవడం అమాయకత్వమో…. అత్యుత్సాహమో ! ఆత్మ విమర్శ చేసుకోవాలి.

సురవరం ప్రతాపరెడ్డి బీసీ సంఘాలకు అధ్యక్షత వహించాడు. రావి నారాయణరెడ్డి హరిజన సంఘాలకి కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేశాడు. తన 500 ఎకరాల పొలాన్ని హరిజనులకు కూడా రాసిచ్చాడు. భూదాన్ రామచంద్రారెడ్డి కూడా 100 ఎకరాలు హరిజనుల కోసం దానం చేసి మరో తొమ్మిది వందల ఎకరాలని సేకరించి విరాళంగా ప్రకటించాడు. వీళ్లంతా దాతృత్వాన్ని నాయకత్వాన్ని కొనసాగిస్తూ రెడ్లుగానే బతికారు. తాము రెడ్లం అని చెప్పుకోవడానికి ఏనాడు ఇబ్బంది పడలేదు . రెడ్డి అంటే నాయకుడు అని తమ ఉనికిని ఉదాహరణగా నిరూపించారు. కానీ జగన్మోహన్రెడ్డి ” రెడ్డి ” పదాన్ని మాట్లాడటానికి భయపడుతూ …. రెడ్డిగా చెప్పుకోవడానికి తడబడుతూ… ఆదరించడానికి అసహనం చూపిస్తూ… తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు.

ఏది ఏమైనా – రెడ్డిగా చెప్పుకుంటే…రెడ్డిగా బతికితే… బహుజనులు దూరమైపోతారు అనుకోవడం అతిపెద్ద గ్రహపాటు. అట్లాగే కులగజ్జి కులపిచ్చి వంటి అతిదుర్గంధం అవసరం లేదు. కులాభిమానం అనే ఏ మనిషికైనా తప్పనిసరిగా అవసరమే. సామాజిక పరిస్థితుల్లో కుల కాట్లాటలు ఉండవచ్చు. కానీ రాజకీయ పరిస్థితుల్లో కుల ఐక్యతను మించిన బలం మరొకటి లేదు.

▪️ ఉద్యోగులు – నిరుద్యోగులు

ఇది పరాజయమా?
ప్రజల చేతిలో పరాభవమా? అని ప్రశ్నిచుకుంటే
ప్రభుత్వ ఉద్యోగుల చేతిలో పరాభవం అని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగుల డిమాండ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. నోటిఫికేషన్లు నిర్లక్ష్యం చేశాడు.

CPS రద్దు చేస్తానని చేయకపోవడం….
PRC 23% ….
2023 ఆగస్టు నుంచి కొత్త PRC మాట్లాడక పోవడం….
DA లు 10 వరకు పెండింగ్ ఉండడం….
DA అరియర్స్ ఇవ్వకపోవడం

AP పోలీసులకు SLS and ASLS చెల్లించకపోవడం….
TA లు పెండింగ్ ఉండడం

ఈ ఉద్యోగుల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు జగన్మోహన్రెడ్డిని పూర్తిగా తప్పుదోవ పట్టించాయి. ” ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒకసారి బయటకు వచ్చి మళ్లీ గెలిస్తే మీ అవసరాలు తప్పకుండ తీరుస్తాను అని ఒక్క హామీ ఇస్తే చాలు… ” అంటూ ఉద్యోగులు ఎదురు చూశారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సలహాదారులు జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇస్తూ ఉద్యోగులతో కలవనీయకుండా చేయడం శోచనీయం.

ముఖ్యమంత్రి అంటే ప్రజల కోసం పాలన కోసం వచ్చిన ప్రజల మనిషి. కానీ ఏసీ గదుల్లో కూర్చునే సలహాదారులు జగన్మోహన్రెడ్డిని ప్రజల మధ్యకే రానివ్వలేదు. అంతేకాదు సలహాదారులు ఉద్యోగులకు అధికారులకు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలకు ప్రజాబలం ఉన్న నాయకులకు సైతం జగన్మోహన్రెడ్డి తో భేటీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి జగన్మోహన్రెడ్డి ఇప్పటికైనా ఇటువంటి సలహాదారుల్ని పక్కకు పెట్టడం తక్షణ అవసరం.

▪️సోషల్ మీడియా

పనిలో పనిగా సోషల్ మీడియా గురించి కూడా ఒక మాట మాట్లాడుకుందాం.
అభివృద్ధి ప్రచారాలకు సోషల్ మీడియాకు మించిన వేదిక మరొకటి లేదు.
సోషల్ మీడియా మనకు మూడు విధాలుగా అందుబాటులో ఉన్నది.
మొదటిది – ఒక వ్యవస్థ ఆధీనంలో ఉన్న అధికారిక ఛానళ్ళు
రెండవది – దిన పత్రికలు.
మూడవది – ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, వాట్సాప్ వంటి సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న పై రెండింటి కన్నా శక్తివంతమైన మాద్యమాలు.

ఒక వ్యవస్థ ఆధీనంలో నడిచే ఛానళ్లు రాజకీయ శిబిరాలు మాత్రమే. ఏ పార్టీకి బాకా ఊదే ఛానళ్ళు ఆ పార్టీ గురించి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ…. ఉన్నవి లేనివి అతిశయోక్తులతో ప్రచారం చేస్తాయి. ప్రత్యర్థుల్లో మంచిని కూడా అవాకులు చవాకులతో నాశనం పట్టిస్తాయి.

ఈ క్రమంలో విద్య విషయంలో కేరళతో పోటిపడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిని సాక్షి ఛానల్ అనుకున్నంతగా ప్రచారం చేయలేదు. కంచ ఐలయ్య వంటి మేధావులు మాట్లాడుతూ…. దిగువ మధ్యతరగతి పేద విద్యార్థుల చదువు కోసమైనా ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మళ్లీ రావాలి అని ఆశించిన వీడియో కూడా పెద్దగా ప్రచారం పొందలేదు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి శ్రేణుల పోస్టుల్లో కూడా ఇటువంటి వీడియోలు పెద్దగా ప్రాచుర్యం పొందలేదు.

జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కూడా దాదాపుగా పెద్దగా ప్రాచుర్యం పొందలేదని చెప్పవచ్చు.. పాలన భవనాన్ని నిర్మిస్తున్న సమయంలో ఉవ్వెత్తున విమర్శలు ఎగిసి పడ్డప్పుడు
సమర్థవంతంగా తిప్పికొట్టే క్యాడర్ కూడా కనిపించలేదు.

ఋషికొండను గుండు గీస్తున్నాడు అని ప్రతిపక్షాలు మొత్తుకుంటుంటే… కనీసం ఉదాహరణ కోసమైనా చరిత్రను గుర్తుచేసే అంశాలను ఎవరు కూడా ప్రస్తావించలేకపోయారు. చరిత్రలో రాజ్య పాలన కోసం నాలుగు విధాల దుర్గాలను నిర్మించుకునే వాళ్ళు. జలదుర్గం, గిరిదుర్గం, స్థలదుర్గం , వనదుర్గం,. వీటిలో జలదుర్గం – గిరిదుర్గం పాలన సౌలభ్యానికి అనుకూలమైనవి. ఈ నేపథ్యంలో మా జగనన్న గిరిదుర్గం నిర్మిస్తున్నాడు అనే మాట కూడా చెప్పలేకపోయారు? కొండవీటి రెడ్డి రాజుల కొండవీడు దుర్గం, కుతుబ్షాహీల గోల్కొండ దుర్గం, భువనగిరి దుర్గం ఇందుకు ఉదాహరణలు.
అట్లాగే రోడ్డు రవాణా వ్యవస్థ గురించి మాట్లాడితే …. ఒక రోడ్డు వేస్తే 15 నుండి 20 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉంటుంది. మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రోడ్ల దుస్థితిని ఎత్తి చూపినప్పుడు ఆ రోడ్డు ఎవరి హయాంలో వేశారు ఎప్పుడు వేశారు అనే అంశాలను కూడా పెద్దగా ఫోకస్ చేయలేకపోయారు. అయినప్పటికీ ఇవన్నీ ఓటమి మీద పెద్దగా ప్రభావం చూపించిన అంశాలు కావు.

▪️ అభ్యర్థులు

అభ్యర్థుల గురించి కూడా మాట్లాడితే….
దాదాపు 60 – 70 నియోజకవర్గాల వరకు రెడ్లు రాజకీయంగా ప్రభావం చూపించగలరు. కానీ కులం లేదు మతం లేదు అంటూ
చాలాచోట్ల అభ్యర్థుల్ని మార్చడం , నియోజకవర్గాలు మార్చడం , పార్టీకి ప్రతికూల వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. గెలిచే అభ్యర్థుల్ని పక్కకు పెట్టి కులాల పేరుతో టిక్కెట్లు కేటాయించడం కూడా కొంపముంచింది.

▪️ గ్రామస్థాయి రాజకీయాలు

గ్రామస్థాయి రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తనదైన ముద్రను చూపించాలనుకుంటూ కుల సమీకరణలు చేశాడు సమర్ధుల్ని పక్కకు పెట్టాడు. ఇక్కడ కార్యకర్తలని పెద్దగా పట్టించుకోలేదు అనే వాదన కూడా వినిపిస్తున్నది.

▪️. మార్పు – క్షమాపణ

” నేను మారిపోయాను ” అనే మాట చంద్రబాబు నాయుడు నుండి వింటున్నాం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి…నాలుగవమారు పాలన పగ్గాలు పట్టిన చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నాయకులు
” నేను మారిపోయాను ” అనడం ఒక రకంగా వంచన. కానీ జనాలు ఇవేమీ పట్టించుకోరు.. రాజకీయ దురాభిమానం కులాభిమానం మాత్రమే జనాలను ప్రభావితం చేస్తాయి. ఇది కూడా జగన్మోహన్రెడ్డి పరిశీలించాలి. తన తప్పుల్ని ఒప్పుల్ని సింహవలోకం చేసుకోవాలి.
.
▪️ కుల జొరబాట్లు

కూటమి విజయంతో అటు కమ్మ కులస్తులు ఇటు కాపు కులస్తులు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో వివిధ స్థాయిలో పాగా వేయడానికి సిద్ధంగా ఉన్నారు… వేయడం ప్రారంభమైంది…. వేస్తున్నారు కూడా. కానీ ఇటువంటి నమ్మకం కిందిస్థాయి రెడ్లకు జగన్మోహన్రెడ్డి ఇవ్వలేకపోయాడు. ఫై స్థాయిలో అనుకూలస్తులకు ఇచ్చి ఉండవచ్చు.కానీ చాలావరకు గ్రామస్థాయిలో రెడ్లకు ఆలనా పాలన అండ దండ పూర్తిగా కరువైపోయాయి అనేది వాస్తవం.

▪️ ఓట్లు – పోట్లు

వైయస్సార్సీపి పార్టీ సమాధి అయిపోయింది అంటూ కొందరు విసురుతున్న వ్యంగ్యాస్త్రాలు అసంబద్దమైనవి. ఈసీ వివరాల ప్రకారం టీడీపీకి 1.53 కోట్లు, వైసీపీకి 1.32 కోట్ల ఓట్లు పోలయ్యాయి. జనసేన పార్టీకి 28 లక్షలు, బీజేపీకి 9.5 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 5.8 లక్షల ఓట్లు దక్కించుకుంది.
పూర్తి లెక్కలు చూస్తే….పోలైన ఓట్లలో కూటమికి
1,53,84,576 ఓట్లు వస్తే,
వైఎస్ఆర్ సీపీకి 1,32,84,134 మంది ఓట్లు వేశారు. ఒంటరి పోరులో ఈ ఓట్ల తేడాతో సమాధి అయ్యే పరిస్థితి లేదు. సంస్థాగతంగా బలంగానే ఉంది. భవిష్యత్తు కార్యాచరణపై తీసుకునే నిర్ణయాలు, పార్టీ విధి విధానాలు, వీటిపై ఆధారపడి భవిష్యత్తులో పుంజుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది .

మొత్తానికి కూటమి జగన్మోహన్రెడ్డిని గద్దె దించితే తప్ప తమ పబ్బం గడవదు అనుకున్నారు. ఇందుకు జగన్మోహన్రెడ్డి చెజేతులా రాజబాటలు వేశాడు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు ప్రతివాడు ఎత్తి చూపే వాడే అవుతాడు. ఇటువంటి పరిస్థితులు అన్నింటినీ ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక సునామీలా ముందుకు రావాలంటే….. కేవలం ఏసీ గదుల్లో కూర్చుని ప్రజల నాడిని అంచనా వేసే సలహాదారుల్ని పక్కకు పెట్టాలి. జనాల్ల పైన సూచించిన అంశాలని జగన్మోహన్రెడ్డి ఒక మెట్టు దిగి ఒకసారి పరిశీలించాలి……మీ .మల్లేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

 

 

 

Tags:Has caste sunk its horn?

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *