హాచ్‌బ్యాక్‌ ‘స్విఫ్ట్‌’ కారుకు అగ్రస్థానం

Hatchback is the 'Swift' car
Date:25/12/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
నవంబరు నెలలో ఎక్కువగా అమ్ముడైన ప్యాసింజర్‌ వాహనాల్లో మారుతి సుజుకీకి చెందిన హాచ్‌బ్యాక్‌ ‘స్విఫ్ట్‌’ కారు అగ్రస్థానంలో నిలిచింది. నవంబరు నెల విక్రయాలకు సంబంధించి ‘సొసైటీ ఆఫ్‌ ఇండియన్ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌’ విడుదల చేసిన జాబితాలో ఈ విషయం వెల్లడైంది. నవంబరులో ఎక్కువగా అమ్ముడుపోయిన టాప్-10 వాహనాల్లో 6 కార్లు మారుతి సంస్థకు చెందినవే కావడం విశేషం. ఈ జాబితాలో మొత్తం 22,191 యూనిట్ల విక్రయాలతో ‘స్విఫ్ట్‌’ తొలిస్థానంలో ఉండగా.. మారుతి కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ 21,037 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. అంటే రోజుకు దాదాపు 700 కార్లకు పైమాటే.
మారుతి కంపెనీకే చెందిన ప్రీమియం హాచ్‌బ్యాక్‌ బాలెనో 18,649 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. అయితే అంతకు ముందు నెలలో అగ్రస్థానంలో ఉన్న మారుతి ‘ఆల్టో’ ఈసారి 14,378 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాతి ఐదు, ఆరు స్థానాల్లో మారుతి విటారా బ్రెజా, వేగనార్‌ వాహనాలు నిలిచాయి. జాబితాలో మొదటి 6 స్థానాలను మారుతి దక్కించుకోగా.. హ్యుందాయ్‌కు చెందిన ప్రీమియం హాచ్‌బ్యాక్‌ ‘ఎలైట్‌ ఐ20’ 10,555 విక్రయాలతో ఏడో స్థానం, ఇదే కంపెనీకి చెందిన ఎస్‌యూవీ క్రెటా 9,677 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచాయి.
ఆ తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10, శాంత్రో పదో స్థానంతో సరిపెట్టుకున్నాయి.  ఎక్కువగా అమ్ముడైన ప్యాసింజర్‌ వాహనాల జాబితాలో శాంత్రో మళ్లీ చోటు దక్కించుకోవడం విశేషం. 2014 డిసెంబరులో శాంత్రో విక్రయాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే నాలుగేళ్ల తర్వాత.. అంటే ఈ ఏడాది అక్టోబరులో తిరిగి ఈ మోడల్‌ను హ్యుందాయ్‌ సంస్థ విడుదల చేసింది.
Tags; Hatchback is the ‘Swift’ car

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *