ఫోన్ లో మాట్లాడుతోందని కూతుర్ని చంపేశాడు 

Date:06/10/2018
కర్నూలు ముచ్చట్లు:
ఓ కసాయి కన్నతండ్రి అనుమానపు రాక్షసి ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ఎవరినో ప్రేమించిందనే కక్షతో కన్నకూతురు అంజలి ని వెంటాడి కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతోంది.
శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో  ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి రంగమ్మ, మేనత్త లక్ష్మీ, సోదరులు కల్యాణ్, ఈశ్వర్, టూటౌన్‌ ఎస్‌ఐ మస్తాన్‌ వలీ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదోని పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌లో నివాసముంటున్న అంజలికి శుక్రవారం సాయంత్రం ఫోన్‌ వచ్చింది.
ఇంట్లోనే ఉన్న తండ్రి జహంగీర్‌ అలియాస్‌ జానీ ఫోన్‌ తీశాడు.ఓ వ్యక్తి హలో అనడంతో ఫోన్‌ కట్‌చేసి ఇంట్లోనే ఉన్న అంజలిని నిలదీశాడు. తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని చెప్పినప్పటికీ.. అలాంటిదేమీ లేకపోతే ఎవరో అబ్బాయి ఫోన్‌ ఎందుకు చేశాడంటూ కర్రతో ఇష్టానుసారం కొట్టాడు. ఆ సమయంలో తల్లి రంగమ్మ, ముగ్గురు సోదరులు ఇంట్లో లేరు. దెబ్బలకు తాళలేక అంజలి శంకర్‌నగర్‌లో ఉన్న మేనమామ దుర్గ ఇంటికి వెళ్లింది.
అయితే ఆయన లేడు. దీంతో మేనమామ భార్య లక్ష్మీతో జరిగిన విషయం చెప్పింది. తాను మాట్లాడతానంటూ ఆమె బాధితురాలిని ఓదార్చే యత్నం చేస్తుండగానే కత్తితో వెళ్లిన జానీ విచక్షణారహితంగా అంజలిని పొడిచాడు. అడ్డువచ్చిన లక్ష్మీని లాగేశాడు. దీంతో ఆమెకు కూడా  స్వల్ప గాయాలయ్యాయి.
వీధిలో ఉన్నవారంతా పరుగెత్తుకొచ్చి ఆమెను రక్షించారు. జనం రావడంతో జానీ పరారయ్యాడు. అప్పటికే ఆమె ఒంటిపై 12 చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. ఒంటినిండా కత్తిపోట్లతో రక్తమోడిన అంజలి అక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉంది. తాగుడుకు బానిసైన తన భర్త జానీకి మానవత్వం లేదని, ఏ పాపం ఎరుగని కూతురుపైనే కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించాడంటూ భార్య రంగమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. టూటౌన్‌ ఎస్‌ఐ మస్తాన్‌వలి ఆస్పత్రికి వెళ్లి ఘటనపై విచారణ చేపట్టారు. బాధితురాలి తల్లి రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
Tags: He killed the daughter talking on the phone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *